మైనార్టీ ఇక్కడ మెజార్టీ
ఉద్యమ గుమ్మం ఖమ్మం నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. రాజకీయ దిగ్గజాలైన తుమ్మల నాగేశ్వరరావు, కుమారున్ని బరిలో దింపిన పువ్వాడ నాగేశ్వరరావులు కూడా ఓటరు నాడి తెలుకునేందుకు చెమటోడ్చాల్సి వస్తోంది. ఊహకందని విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చేలా ఉండటంతో నేతలు తలపట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో వాటిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీతో జట్టుకట్టి టీడీపీ, యూనిస్‌సుల్తాన్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఆ వర్గం ఓట్లకు దూరమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలకు ఈ ఓట్లు పడవచ్చనే అంచనాలు ఊపందుకున్నాయి. వైఎస్‌ఆర్ కల్పించిన నాలుగుశాతం రిజర్వేషన్ తమకు లాభిస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ భావిస్తోంది. ఇంతకూ మైనార్టీల మనసులను ఎవరు దోచుకుంటారో వేచిచూడాల్సిందే..
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో వారి ఓట్లే కీలకం
టీడీపీ, కాంగ్రెస్‌లపై మైనార్టీల ఆగ్రహం
ప్రత్యామ్నాయం వైపు చూపు
మైనార్టీలకు దగ్గరవుతున్న వైఎస్సార్‌సీపీ
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనార్టీ ఓటర్ల నిర్ణయమే జిల్లాలో కీలకం కానుంది. ఖమ్మం, రఘునాథపాలెం మండలం కలిపి ఏర్పడిన నియోజకవర్గంలో 250 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 2,64,007 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పుురుషులు 1,33,793, మహిళలు 1.30,214, ఇతరులు 37 మంది ఉన్నారు. ఖమ్మం నగరంలో ఖిల్లా, శుక్రవారిపేట, మోమినాన్, ముస్తఫానగర్, నిజాంపేట, తుమ్మలగడ్డ, చెరువుబజార్, ఇస్లాంపేట, మోతీనగర్‌లతో పాటు పరిసర ప్రాంతంలో ఉన్న ఇందిరానగర్, గొల్లగూడెం, పాండురంగాపురం ప్రాంతాల్లో మైనార్టీలు అధికంగా ఉన్నారు. కొత్త ఓటర్లను కూడా కలిపితే మైనార్టీలు, నూర్‌బాష్‌లు మొత్తం 50 వేల ఓటర్ల వరకు ఉంటారని అంచనా. అంటే మొత్తం ఓటర్లలో ఐదో వంతు మైనార్టీలే ఉన్నారన్నమాట.
పార్టీల వారిగా గిరిగీసుకొని ఉండే మైనార్టీ ఓటర్లు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీడీపీ అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ ఒక్కసారి కూడా మైనార్టీ నాయకులను బరిలో దింపలేదు. పార్టీ పుట్టిన నాటి నుంచి పనిచేస్తున్న వారిని కరివేపాకులా వాడుకున్నారే తప్ప వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మూడు జనరల్ స్థానాల్లో ఒక్కటైనా తమకు కేటాయించాలని మైనార్టీ నాయకులు కోరారు. టికెట్ వస్తుందని ఆశించి నామినేషన్లు కూడా వేశారు. కానీ చివరకు చేదు అనుభవమే ఎదురైంది. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకోవడం మైనార్టీలకు రుచించడంలేదు. టీడీపీకి ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలిపిన వారం అవుతామని పలువురు మైనార్టీ పెద్దలు టీడీపీకి ఓటు వేయవద్దని తీర్మానం చేసినట్లు ప్రచారం. కాంగ్రెస్ విషయానికొస్తే మైనార్టీ నాయకులంటే కాంగ్రెస్ పార్టీలో చులకన భావం ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం టికెట్ ఆశించిన సుల్తాన్‌కు భంగపాటు ఎదురు కావడంతో పాటు కనీసం పార్టీ జిలా ్లసమన్వయ కమిటీలో కూడా మైనార్టీలకు స్థానం కల్పించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీలు మండిపడుతున్నారని సమాచారం. ప్రాధాన్యత ఇవ్వని పార్టీకి ఓటేసి గెలిపించడం కంటే వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించి తమ సత్తా చూపించాలని పలువురు మైనార్టీ నాయకులు బహిరంగంగానే అంటుండటం గమనార్హం.
మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలు మర్చిపోలేనిది. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన మహానేత వైఎస్ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మైనార్టీల అవసరాలను గుర్తించి ఇతర వర్గాలకు మాదిరిగానే సంక్షేమ పథకాలు అందించారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కూరాలకుల నాగభూషణం ప్రచారంలోనూ మైనార్టీలు ముందుడటాన్ని దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలపై కోపంతో ఉన్న నాయకులు వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారని సమాచారం.
తెలంగాణవాదంతో ముందుకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌కు మైనార్టీల ఓట్లు ఏ మేరకు పడుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ బహిరంగ సభకు మైనార్టీలు తరలిరావడం, కేసీఆర్ మైనార్టీలనుద్దేశించి ఉర్దూలో ప్రసంగించడం ఆ పార్టీ అభ్యర్థులకు కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.