ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 16 న సోనియాగాంధీ జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ముజ్జుగూడెం(నేలకొండపల్లి)న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 16 న సోనియాగాంధీ జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మండలంలోని ముజ్జుగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఓటుతో కృతజ్ఞతలు తెలపాలని చెప్పారు. త్వరలో ఖమ్మం లేదా నల్లగొండ జిల్లాలో రాహూల్‌గాంధీ పర్యటన ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేసే విధంగా పొత్తు కుదిరిందన్నారు. సార్వత్రిక, ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు.
టీడీపీ-బీజేపీ పొత్తు నేపథ్యంలో మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపు నిలుస్తారని అన్నారు. తాను ఈ నెల 9న పాలేరు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాని, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని కోరారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగుబండి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వున్నం బ్రహ్మయ్య, మాజీ చైర్మన్ ఎనికె జానకిరామయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కట్టెకోల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.