కాంగ్రెస్‌తో వినాశనమే: నరేంద్ర మోడీ | Narendra modi slams Congress party over election campaigns | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో వినాశనమే: నరేంద్ర మోడీ

Published Wed, Apr 23 2014 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Narendra modi slams Congress party over election campaigns

తెలంగాణ ప్రచారసభల్లో మోడీ
 సాక్షి, హైదరాబాద్ /నిజామాబాద్/కరీంనగర్/మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్‌కు మళ్లీ అధికారమిస్తే వినాశనమే. తెలంగాణను ఇన్నేళ్లు పరేషాన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. తల్లీకొడుకుల కుటుంబ పాలనే ఢిల్లీని పాడు చేసింది. అదే పాలనను మీరు కోరుకుంటున్నారా? అదే జరిగితే తెలంగాణను ఎవరూ రక్షించ లేరు. కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలి’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశమంతా ఎన్‌డీఏ సునామీ వీస్తోందని, ఢిల్లీలో తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.  ‘పసిబిడ్డలాంటి తెలంగాణ ఆలనపాలన చూసుకోవాల్సి ఉంది. దాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే పూచీ నాది. అరవై ఏళ్లలో జరగని ప్రగతిని 60 నెలల్లో చేసి చూపుతా’ అని మోడీ హామీ ఇచ్చారు.
 
వారసత్వ, కుటుంబపాలనకు స్వస్తి పలకాలని, ప్రజాస్వామ్యంలో కుటుంబపాలన అత్యంత ప్రమాదకరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తండ్రీబిడ్డలు, మామాఅల్లుళ్ల ప్రభుత్వం వస్తే తెలంగాణలో విధ్వంసమేనని పరోక్షంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుం బాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  చేసిన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలివి..
 
 కాంగ్రెస్‌ను ఇంకా నమ్ముతున్నారా?
 రాష్ర్ట విభజనకు కాంగ్రెస్ అనుసరించిన తీరును తప్పుబట్టిన ఆయన.. ‘బచ్చేకో జన్మ్ దియా.. మాకో మార్ దియా’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిలేని బిడ్డలా తయారైందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తీరు బాగా లేదు. తల్లిని చంపి... బిడ్డను బతికించినట్లుగా రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పుడు ఆ బిడ్డకు ఆలనపాలన లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో తెలంగాణకు తల్లిలాంటి సర్కారు రావాలి.
 
  చిన్న పిల్లాడిని సంరక్షించినట్లుగా ఇక్కడ ప్రజల బాగోగులను చూసుకునే ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముంది’ అని మోడీ అన్నారు. ‘కాంగ్రెస్‌ను మీరింకా నమ్ముతున్నారా? తెలంగాణ కోసం 1100 మందిని చంపిందెవరు? అమరుల త్యాగాన్ని మరిచిపోతారా? అమరులైన వీరుల కుటుంబాలను ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్ అనే పాపాన్ని తెలంగాణలో చొరబడనిద్దామా?’ అంటూ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ సునామీ వస్తోందన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పుడు బీజేపీ గాలి వీస్తోందనుకున్నానని, కొద్ది రోజులకు అది ప్రభంజనమేనని తెలుసుకున్నానని, ఇప్పుడు చూస్తుంటే అది సునామీ అని తేటతెల్లమైందని మోడీ వ్యాఖ్యానించారు. అది ఏ స్థాయిలో ఉంటుందో రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేరన్నారు. కొందరు రాజనీతిజ్ఞులు ఏసీ గదుల్లో కూర్చొని లెక్కలేస్తున్నారని, కానీ వారి ప్రయాస వృథానే అవుతుందని.. బీజేపీ ఊపు వారి అంచనాలకందనిరీతిలో ఉందని పేర్కొన్నారు.
 
 తెలుగు వాళ్లను అవమానించారు: తెలంగాణ, ఆంధ్రా ప్రజలను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మోడీ గతాన్ని గుర్తు చేశారు. ‘ఢిల్లీలో కూర్చున్న తల్లీ కొడుకులు తెలంగాణ.. ఆంధ్రావాళ్లను ఎన్నడూ ప్రేమించలేదు. ప్రేమించరు. ఇందిరా పాలనలోనే రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో.. అప్పటి ఏపీ సీఎం, దళిత బిడ్డ అంజయ్యను అవమానపరిచాడు. ఆంధ్ర రాష్ట్రమంతా రాజీవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ప్రతిగా అంజయ్యను సీఎం పదవి నుంచి తొలగించారు. తెలుగుబిడ్డ పీవీ ప్రధాని కావడం కూడా ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ‘ప్రపంచమంతా గొప్ప ప్రధానిగా పొగిడిన పీవీని సోనియాగాంధీ అవమానించారు.
 
  ఆయన ప్రధాని కావడాన్ని మొదటి నుంచీ జీర్ణించుకోలేని సోనియా కనీసం ఆయన అంత్యక్రియలను కూడా గౌరవప్రదంగా జరగనీయలేదు. పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు నివాళులు అర్పించేందుకు ముందుకు రాని పాపాత్ములున్న కాంగ్రెస్‌కు ఓటేస్తారా?’ అని మోడీ ప్రశ్నించారు. ‘ఇప్పుడు వాళ్ల కోపం మరింత పెరిగిపోయింది. తెలంగాణ ప్రజలు తమ మెడలు వంచారని.. పరువు తీశారనే కోపంతో ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ ను అభివృద్ధి చేస్తామంటున్నారు.. ఇలాంటి వాళ్ల చేతికి తెలంగాణను అప్పగిస్తారా?’ అని వ్యాఖ్యానించారు.
 
 ‘మర్ జవాన్-మర్ కిసాన్’గా మార్చింది:
దేశానికి కాపలాగా ఉన్న సైనికుల తలలను పొరుగు దేశం సైనికులు నరికివేసినా కాంగ్రెస్ పట్టించుకోలేదని మోడీ ధ్వజమెత్తారు.  సరిహద్దుల్లో చనిపోయిన సైనికులకంటే ఉగ్రవాదుల చేతుల్లో బలైన సైనికులే ఎక్కువగా ఉన్నారన్నారు. ఇటు యుద్ధంలోనూ, అటు ఉగ్రవాదుల చేతుల్లోనూ మరణించిన సైనికుల సంఖ్య కంటే.. దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందన్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి ‘జై జవాన్- జై కిసాన్’ అని నినదిస్తే, కాంగ్రెస్ దాన్ని ‘మర్ జవాన్-మర్ కిసాన్’గా మార్చిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
 
 టీఆర్ ఎస్‌కు చురకలు: ‘తల్లీ కొడుకులు కలిసి దేశాన్ని నాశనం చేశారు. తెలంగాణలో తండ్రీ కూతురు, మామా అల్లుళ్ల ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాలను ఆసరాగా తీసుకుకొని తండ్రీబిడ్డల ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రయత్నాలు సఫలమైతే తెలంగాణ విధ్వంసమవుతుంది. మీ అభివృద్దికి నేను హామీ ఇస్తున్నా ఇలాంటి వారిని తిరస్కరించండి’ అంటూ పరోక్షంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మోడీ విమర్శలు చేశారు.
 
  ‘తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటంతోనే బండి నడవదు. మీ చేతిలో అధికారం లేనంత కాలం మీ జీవన స్థితిగతులు మారవు. కేంద్రంలోని ప్రభుత్వం మూలంగా దేశంలో 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కర్మాగారాలు మూత పడ్డాయి. వాళ్లు బొగ్గును దొంగిలించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు అడిగితే ఫైలు పోయిందని చెబుతున్నారు. అమ్మా కొడుకుల ప్రభుత్వం వద్ద ఫైల్ పోయింది. కానీ మా లైఫ్ పోయింది’ అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
 
 దేశం ఇలాగే ఉండాలా?: ‘బస్ వస్తే ఎక్కుదాం... రైల్లో సీటు దొరికితే కూచుందాం... పరీక్ష రాద్దాం పాస్ అయితే చూద్దాం.. మన దేశం, మన పరిస్థితులు ఇలాగే ఉండాలా? మన కలలు సాకారం కావద్దా? అందుకే మార్పు కావాలంటున్నాను. ఎవరికైనా ఎస్సెమ్మెస్ చేస్తే అది చేరిందా లేదా అని ఫోన్ చేసి అడుగుతామా? కానీ అడగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అన్నింటా భరోసా సన్నగిల్లింది. బయటకు వెళ్లిన మనిషి ఇంటికి వస్తాడో లేదో తెలియదు, కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంటికొస్తుందో లేదో తల్లికి ఆందోళన. ఈ పరిస్థితి మారాలి. ప్రజల్లో ధైర్యం, నమ్మకం కలిగించే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరాలి.
 
 అది బీజేపీతోనే సాధ్యం’ అని మోడీ పేర్కొన్నారు. ‘అత్యంత లేటెస్ట్ కంప్యూటరో, ఐపాడో కొని అందులో మన మధుర జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకున్నాక ఓ చిన్న వైరస్ చేరితే అదంతా నాశనమేకదా! అలాగే సరైన ఆలోచనవిధానాలు లేని ప్రభుత్వం మన దేశాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందదే’ అని ఆరోపించారు. ‘డిజిటల్ ఇండియా’ స్వప్నం సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నయా పైసా వదలకుండా నల్లధనం మొత్తాన్ని విదేశాల నుంచి వెనక్కు రప్పిస్తానని మోడీ హామీ ఇచ్చారు.
 
 ఢిల్లీతో ‘కనెక్షన్’ ఉండాలి: కరెంటు లైన్ మాదిరిగా ఢిల్లీకి, తెలంగాణకు కనెక్షన్ ఉండాలని మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘ఇక్కడ విద్యుత్ తీగలు.. స్తంభాలు లేకుంటే హైదరాబాద్‌లో విద్యుత్ ప్రాజెక్టులున్నా లాభం లేదు. ఢిల్లీ పవర్ ప్రాజెక్టు లాంటిది. అక్కడి కరెంట్ ఇక్కడికి రావాలంటే స్తంభాలు, తీగల్లేకుండా సాధ్యం కాదు. అక్కడి శక్తి.. ఇక్కడి వరకు చేరాలంటే బీజేపీ-టీడీపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్లమెంటుకు పంపించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఏమాత్రం అభివృద్ధి జరగదని పరోక్ష విమర్శలు చేశారు. ‘దేశానికి, తెలంగాణకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. తెలంగాణ భవిష్యత్తును ఎవరు మారుస్తారో మీరే నిర్ణయించుకోండి. తల్లీకొడుకుల పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరముంది. బీజేపీలాంటి బాధ్యతాయుత పార్టీకి ఎన్నికల్లో మద్దతివ్వండి. సూరత్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మూడు లక్షల మంది నివసిస్తున్నారు. వారిని నా సోదరుల్లా చూసుకుంటున్నాను. తెలంగాణ భాగ్యరేఖ మార్చుతాం. నేను మీ వాడిని. మీరేం కోరుకుంటున్నారో నాకు తెలుసు. మీ కలలు.. కోరికలు నావి. మీ ఆశలు, ఆకాంక్షలు.. ఆపేక్షలన్నీ బీజేపీతోనే సాధ్యమవుతాయ’ని మోడీ పేర్కొన్నారు.
 
 మంగళవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘భారత విజయ్ యాత్ర’ పేరిట నిర్వహించిన బహిరంగ సభకు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హాజరై వెళ్లిపోయారు. తర్వాత కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన సభకు మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ మైదానంలో జరిగినసభలో మోడీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జత కలిశారు. చివరగా సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్డీయే శంఖారావం సభలో ఎన్డీయే మిత్రులుగా పవన్, చంద్రబాబు ఇద్దరూ పాలుపంచుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులు, బీజేపీ నాయకులు కూడా మోడీ సభలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement