కేసీఆర్ ద్రోహి: సోనియా | K Chandrasekhar Rao as a Betrayer, says Sonia Gandhi | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ద్రోహి: సోనియా

Published Mon, Apr 28 2014 1:17 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

K Chandrasekhar Rao as a Betrayer, says Sonia Gandhi

* పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట మార్చారు
* అధికారం కోసమే ఆయన పాకులాట
* లోక్‌సభలో టీ-బిల్లు పెట్టినపుడు కేసీఆర్ రాలేదు
* చేవెళ్ల, చౌట్కూరు(ఆందోల్) బహిరంగ సభల్లో పాల్గొన్న సోనియా
 
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: ‘‘నమ్మించి ద్రోహం చేయడం కేసీఆర్‌కు అలవాటు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు. తెలంగాణ ప్రయోజనాల కంటే అధికారం కోసమే ఆయన పాకులాడుతున్నారు. ఆయనకు తెలంగాణ మీద చిత్తశుద్ధి లేనే లేదు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ సభకు గైర్హాజరయ్యారు. దీనినిబట్టే తెలంగాణపై ఆయనకున్న ప్రేమ ఏపాటితో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మతతత్వ శక్తులతో కేసీఆర్ చేతులు కలిపే ప్రమాదముంది’’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

టీఆర్‌ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఆ పార్టీలకు సొంత ప్రయోజనాల తప్ప దేశ హితం పట్టదని ఆమె విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చాందసవాద శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం శాంతియుతంగా ఉండాలన్నా, అభివృద్ధి, సామాజిక న్యాయం కావాలన్నా అది కాంగ్రెస్‌వల్లే సాధ్యమంటూ.. తెలంగాణను రూ. 40 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియాగాంధీ ఆదివారం చేవెళ్లలో, మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం చౌట్కూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ‘‘నా అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లకు నమస్కారాలు’’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన సోనియాగాంధీ ఆ తరువాత హిందీలో మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకు కాంగ్రెస్ చేసిన కృషి, తెలంగాణ అభివృద్ధికి తాము రూపొందించిన కార్యక్రమాల గురించి చెప్పటంతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు సంధించారు. ముఖ్యాంశాలు సోనియా మాటల్లోనే...
 
అంతర్గత విబేధాలొచ్చినా లెక్కచేయలేదు
‘‘తెలంగాణ మహోద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన అమరులకు నా శ్రద్దాంజలి. మా పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించింది. వారి గుండె చప్పుడును గుర్తించింది. అందుకే అనేక అడ్డంకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాం. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంతగా కృషి చేసిందో మీకు తెలుసు. సంకీర్ణ యు గంలో అన్ని పక్షాలను ఒప్పించడానికి, అందరినీ ఏకతాటిపైకి తేవడానికి ఎంతగా కష్టపడ్డామో ఇప్పుడు చెప్పలేను.

టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మాటమార్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోలేదు. మా పార్టీలో అంతర్గత విబేధాలొచ్చినా లెక్కచేయకుం డా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాం. తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వ్యతిరేకించడంతో ఆ పార్టీ నిజస్వరూపం బయటపడింది. టీఆర్‌ఎస్‌తో సహా వీటిలో ఏ పార్టీకీ నీతి లేదు. వీరందరి లక్ష్యం ఒక్కటే. విలువలను పణంగా పెట్టయినా సరే అధికారాన్ని చేజిక్కించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
 
తెలంగాణ రాదని కేసీఆర్ విలీనం చేస్తానన్నారు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (గతంలో) యూపీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన మాటకు ఎన్నడూ కట్టుబడలేదు. తెలంగాణ రాష్ట్రం రాదని భావించి తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్నారు. కానీ కాంగ్రెస్ తన చేతుల మీదుగా తెలంగాణ సాధించి పెట్టింది. దీంతో ఆయన మాటమార్చారు. తెలంగాణ రావడానికి అసలైన హీరోలు ఈ ప్రాంత ప్రజలే. బీజేపీ మాదిరిగానే టీఆర్‌ఎస్ నేతకూ అవకాశవాద లక్షణాలొచ్చాయి. ఆయనకు వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలు తప్ప మరేవీ అక్కర్లేదు. దళిత, గిరిజన, అణగారిన వర్గాల ప్రయోజనాలు కనిపించవు. ఇలాంటి సంప్రదాయ, చాందసవాద పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రమాదముంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. నా దృష్టిలో సామాజిక న్యాయమంటే దళిత, గిరిజన, మైనారిటీ, మహిళలు సహా అట్టడుగునున్న వర్గాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కలగాలి. రాజ్యాధికారం దక్కాలి.
 
రూ. 40 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళిక
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏది ఉండాలో మీరే లోతుగా ఆలోచించండి. తెలంగాణలో అభ్యున్నతి, సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అవసరముంది. ఈ ప్రాంతంలో మౌలిక వసతులను విస్తరించాలి. నేను ఊకదంపుడు హామీలు ఇవ్వను.. ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తాం. యూపీఏ అధికారంలోకొస్తే తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తాం. ఇది దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు అవుతుంది. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంటును నిర్మిస్తాం. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పిస్తాం. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి పదేళ్ల పాటు పన్ను రాయితీలు కల్పిస్తాం.

భారీ సంఖ్యలో ఉన్న చేనేత కార్మికుల కోసం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం, ఐటీ రంగాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు రూ. 40 వేల కోట్ల వ్యయంతో తగిన కార్యాచరణను రూపొందించాం. టీపీసీసీ ఎన్నికల ప్రణాళికను అమలు చేసి అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడతాం. దేశంలోని ప్రతి పేద పౌరుడికి పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తాం. వృద్ధులు, వితంతలు, వికలాంగులకు సామాజిక పింఛన్లు ఇస్తాం. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తాం.
 
హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఇచ్చేస్తాం...
హైదరాబాద్‌తో సమానంగా తెలంగాణను అభివృద్ధిని చేసే సంకల్పం మాకుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్రానికే ఇచ్చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రజలకు ఇకపై అన్యాయం జరగదు. మీకు రావాల్సిన ఉద్యోగాలు మీకు వస్తాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాల ఉద్యోగులకూ న్యాయం చేస్తాం. ఇరు ప్రాంతాల ఉద్యోగుల సమ్మతితోనే తదుపరి చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో ఉద్యమం ముగిసినందున అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడతాం. టీఆర్‌ఎస్ మాదిరిగా కవ్వింపు చర్యలకు కాంగ్రెస్ పాల్పడదు. అలాంటి చర్యలతో తెలంగాణకే నష్టం. సీమాంధ్ర ప్రజలతో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తాం. లౌకిక, దృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం.. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు మీ మద్దతు అవసరం. జై తెలంగాణ!’’
 
డ్వాక్రా రుణాలనూ రద్దు చేయాలి...
చేవెళ్ల సభ ముగిసిన అనంతరం సోనియాగాంధీ నేరుగా ప్రజల వద్దకొచ్చారు. బారికేడ్ ఎక్కి అందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు సోనియాగాంధీకి ఓ వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రుణాలతోపాటు డ్వాక్రా సంఘాల రుణాలను కూడా రద్దు చేయాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పిన సోనియాగాంధీ అందరికీ అభివాదం చేస్తూ ఆందోల్ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.
 
 మొరాయించిన హెలికాప్టర్
 చేవెళ్ల నుంచి రోడ్డు మార్గాన ఆందోల్ వెళ్లిన సోనియా

 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ మొరాయించింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె చేసేదేమీలేక రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఆందోల్ వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మెదక్ జిల్లా ఆందోల్ బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో సోనియాగాంధీ హైదరాబాద్ వచ్చారు. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకుడు వయలార్ రవి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆమెకు స్వాగతం పలికారు. వారితో కలిసి హెలికాప్టర్లో చేవెళ్ల బహిరంగ సభకు బయలుదేరేందుకు సోనియాగాంధీ సిద్ధమయ్యారు.

అయితే అప్పటికే వాతావరణం అనుకూలించకపోవడం, చేవెళ్లలో వర్షం కురుస్తుండటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ప్రయాణానికి అనుమతిచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డారు. పరిస్థితిని గమనించిన సోనియాగాంధీ రోడ్డు మార్గంలో చేవెళ్ల వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. అంతలోనే వాతావరణం అనుకూలంగా మారడంతో హెలికాప్టర్లో చేవెళ్లకు వెళ్లారు. అక్కడ సభ అనంతరం ఆందోల్ వెళ్లేందుకు సోనియా సిద్ధమయ్యారు. హెలికాప్టర్ కొంత ఎత్తుకు లేచిన తర్వాత పైలట్ కొద్ది క్షణాల్లోనే మళ్లీ కిందకు దించారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ చెప్పడంతో చేసేదేమీ లేక ఆమె రోడ్డు మార్గాన ఆందోల్ వెళ్లిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement