టార్గెట్ ‘అల్లుడు’
వాద్రాపై కాషాయ అతిరథుల గురి...
2జీ నుంచి ‘జీజాజీ’ వరకు కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్న బీజేపీ నేతలు
ఎలక్షన్ సెల్: యూపీఏ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ‘కాషాయ’ అతిరథులు కొద్దిరోజులుగా విమర్శల జోరు పెంచారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆయనను జైలుకు పంపుతామని సైతం వారు హెచ్చరిస్తున్నారు. యూపీఏ అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో వాద్రా పేరు పెద్దగా వినిపించేది కాదు. రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చాక వరుస కుంభకోణాలు యూపీఏ సర్కారును కుదిపేస్తున్న తరుణంలోనే వాద్రాపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ కంపెనీతో ఆయన జరిపిన లావాదేవీల్లో భారీ అవకతవకలు జరిగాయని, హర్యానా సర్కారు ఆయనకు కారుచౌకగా విలువైన భూములను కట్టబెట్టిందని కథనాలు వెలువడ్డాయి. హర్యానా సర్కారు డీఎల్‌ఎఫ్ కంపెనీకి ఏజెంటుగా పనిచేస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. డీఎల్‌ఎఫ్-వాద్రా అవకతవకల చిట్టాను రెండేళ్ల కిందటే ఆయన మీడియా ముందు పెట్టా రు. వాద్రాకు చెందిన అక్రమ భూ లావాదేవీలను రద్దుచేసిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను హర్యానాలోని కాంగ్రెస్ సర్కా రు బలిపశువును చేసింది.
భూసేకరణ విభాగం స్పెషల్ కలెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రాధాన్యం లేని పురాతత్వ విభాగం కార్యదర్శిగా బదిలీ చేసింది. అంతటితో ఆగకుండా, గతంలో ఆయన హర్యానా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉండ గా, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడ్డారంటూ రెండు చార్జిషీట్‌లు దాఖలు చేసిం ది. కొద్దికాలానికి మీడియాలో వాద్రా గొడవ సద్దుమణిగినా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ‘కాషాయ’ పార్టీ అతిరథులందరూ ఆయనపైనే ప్రధానంగా గురి పెడుతున్నారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే, వాద్రాను జైలుకు పంపుతామని తాజాగా బీజేపీ నేత ఉమాభారతి హెచ్చరించారు. బీజేపీ నేతలు ఇటీవల కొద్ది రోజులుగా వాద్రాపై చేసిన వ్యాఖ్యలు...
‘దేశ ప్రజలకు 2జీ కుంభకోణం గురించి ఇప్పటికే తెలుసు. కానీ కొత్తగా జీజాజీ (బావ) కుంభకోణాల గురించి వింటున్నారు’ అంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ అయిన వాద్రాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తల్లీ కొడుకుల (సోనియా, రాహుల్) ప్రభుత్వంలో యువతకు రావలసిన ఉద్యోగాలు వాద్రాకు వచ్చినట్లున్నాయని, అందుకే ఆయన ఆస్తులు భారీగా పెరిగాయని ఎద్దేవా చేశారు. ఒక అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ద్వారానే తనకు వాద్రా ఆస్తుల పెరుగుదల గురించి తెలిసిందని, పదో తరగతి పాసైన యువకుడు, చేతిలో ఉన్న లక్ష రూపాయల పెట్టుబడితో నాలుగేళ్లలోనే రూ.300 కోట్లకు అధిపతి అయ్యాడని ఆ పత్రిక రాసిందని అన్నారు.
- కాంగ్రెస్ హయాంలో 2జీ కుంభకోణమే కాదు, ‘జీజాజీ’ కుంభకోణమూ జరిగిందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సిధ్‌పురాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- వాద్రాపై అవినీతి ఆరోపణలు రుజువైతే ఆయనను ఉపేక్షించేది లేదని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఇటీవల ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
- తమ పార్టీ అధికారంలోకి వస్తే, వాద్రా అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని బీజేపీ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.
- వాద్రా-డీఎల్‌ఎఫ్ అవినీతిపై సీబీఐ, సీవీసీల చేత దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కొద్దిరోజుల కిందట ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశారు.
బీజేపీ దూకుడు వెనుక...
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. మోడీపై కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టేందుకే బీజేపీ నేతలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాటలే స్పష్టం చేస్తున్నాయి. ‘మా పార్టీ ప్రధాని అభ్యర్థిపై కొద్దిరోజులుగా వ్యక్తిగత విమర్శల దాడి సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కు తగ్గకూడదని మేమూ నిర్ణయించుకున్నాం’ అని నఖ్వీ అన్నారు.
వాద్రా-డీఎల్‌ఎఫ్ కుంభకోణంపై కథనాలు పత్రికల పతాక శీర్షికలకెక్కిన సమయంలో బీజేపీ సంయమనంతోనే వ్యవహరించింది. ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలంటూ కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు వచ్చినా పార్టీ నాయకత్వం అనవసర రాద్ధాంతానికి దిగకుండా హుందాగానే ఉంది. మోడీ తన నామినేషన్ పత్రాల్లో తొలిసారిగా తన భార్య పేరును పేర్కొనడంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలు సంధిస్తూ రావడంతో బీజేపీ సైతం తన పంథాను మార్చుకుంది. వాద్రాపై బీజేపీ నేతలు విమర్శల జోరు పెంచడంతో స్టాక్‌మార్కెట్‌లో డీఎల్‌ఎఫ్ షేర్ల ధర మూడు రోజుల్లోనే 12 శాతం మేరకు పతనమైంది.