- ఓటేసిన 1,70,800 మంది
- అందరి చూపు 19న జరిగే ఓట్ల లెక్కింపు వైపు
- జిల్లాలో జోరుగా గెలుపోటములపై బెట్టింగ్‌లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పాలేరు ఉప ఎన్నికలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 1,90,351 మంది ఓటర్లుండగా.. 1,70,800 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పోలింగ్ శాతం 89.73 నమోదైంది. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో 1,96,442 మంది ఓటర్లుండగా.. 1,76,826 మంది ఓటేశారు. అప్పుడు 90.01 శాతం నమోదైంది. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌తో పోలిస్తే అతిస్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే నాలుగు మండలాల్లోని 243 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, యువత బారులు దీరారు. ఇక 12 మోడల్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా అలంకరించడంతో వీటిని చూడటానికి వచ్చిన ఓటర్లు అబ్బురపడ్డారు. పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి రుడోలా, ప్రత్యేక అధికారులు, కలెక్టర్ దానకిషోర్, ఎస్పీ రమా రాజేశ్వరి సందర్శించారు.
పోలింగ్ జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మహిళా కమాండోలు కూడా మోహరించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, రాంరెడ్డి సుచరితారెడ్డి, పోతినేని సుదర్శన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ ఎన్నికలో మధ్యాహ్నం వరకు ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 14.81 శాతం, 11 గంటలకు 37.60 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 61.17 శాతం, 3 గంటలకు 75.10 శాతం, సాయంత్రం 5 గంటలకు 85.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన 6 గంటలకు 89.73 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
ఈనెల 19న జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరు విజేతలో.. పరాజితులో తేలనుంది. నాలుగు మండలాల ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య.. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అయితే జిల్లావ్యాప్తంగా గెలుపోటములపై నేతలు, పార్టీ శ్రేణులు, వ్యాపారులు జోరుగా బెట్టింగ్‌లు పెడుతున్నారు.
రూరల్‌పైనే ధీమా..
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 59,219 ఓట్లు పోల్ కావడంతో ఇక్కడ మెజారిటీ తమకంటే.. తమకు వస్తుందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. అభివృద్ధి మంత్రం తమకు విజయం చేకూరుస్తుందని టీఆర్‌ఎస్, ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతి తమకు ఓట్ల వర్షం కురిపించిందని కాంగ్రెస్ ఎవరికి వారు ఆశల పల్లకీలో ఉన్నారు.
స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు
పాలేరు ఉప ఎన్నిక ఈవీఎంలను ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు భారీ బందోబస్తు మధ్య సోమవారం రాత్రి తరలించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల 243 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రుడోలా, కలెక్టర్ దానకిశోర్ సమక్షంలో అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా పనులను జేసీ దివ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీలిస్తున్నారు.
- ఖమ్మం జెడ్పీసెంటర్
పోలింగ్ ఫుల్
Published Tue, May 17 2016 9:05 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement