'పాలేరులో ప్రతిపక్షాలకు దిమ్మదిరగాలి'
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఓటర్లను మంత్రి కేటీఆర్ కోరారు. అభివృద్ధి నిరోధకాలు మారిన విపక్షాలతో తెలంగాణ ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. పాలేరు ప్రజలకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, ఇక్కడ మాత్రం దొంగ ఏడ్పులు ఏడుస్తోందని ధ్వజమెత్తారు. సాగునీటి, తాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ మీద నీటి యుద్ధం ప్రకటించాయని అన్నారు.
అవకాశవాద రాజకీయ పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. రాజకీయాల్లో విలువలు భూస్థాపితం చేసిన ప్రతిపక్ష పార్టీలకు పాలేరు ఉప ఎన్నికలో దిమ్మదిరిగే జవాబు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులతో పాలేరులో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీయిచ్చారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు ఇస్తామన్నారు.