రైతులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
కోతలు, కొర్రీలతో సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ప్రభుత్వం ఉంది
రైతుబంధుపై దు్రష్పచారంతో రైతాంగాన్ని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు
రైతులకు ఇస్తున్నది భిక్ష కాదు, వారి హక్కు అని తెలుసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎగవేసేందుకు చేస్తున్న కుట్రలను ఎదిరించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో రైతుబంధు పథకంపై అబద్ధాలతో దు్రష్పచారం చేశారని, చివరికి అన్నంపెట్టే రైతన్నను దొంగలా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. కోతలు, కొర్రీలతో రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు..
పెద్ద దోఖా జరగబోతోంది..
‘రైతుబంధును బొంద పెట్టి పనికిమాలిన షరతులతో అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్మల్ని నిండా ముంచే ఒక పెద్ద దోఖా జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి మమ అనిపించి, పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టేలా ఘోరాలు చేయబోతున్నారు. వంచనను గ్రహించి, ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన సమయం వచి్చంది. ఇప్పుడు మేల్కొనకపోతే భరోసా ఉండదు గోస మాత్రమే మిగులుతుంది.
రైతుబంధుతో రూ.73 వేల కోట్లు జమ
వానాకాలం.. యాసంగి రెండు పంటలకు అవసరమైన పైసలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడే ఒక అపురూపమైన ఆలోచనకు ఆచరణే రైతుబంధు. మొత్తం 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. అవినీతికి, లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. ఇక రుణమాఫీ కింద రూ.28 వేల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఈ రెండు పథకాల ద్వారానే అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి.
రైతులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్
రైతుబంధు కింద కేసీఆర్ ఎకరానికి ఏటా రూ.10 వేలే ఇçస్తున్నాడని, మేం వస్తే రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా ఇంతవరకూ రైతు భరోసా జాడా పత్తా లేదు. రైతుబంధు కింద ఇచ్చే రూ.10 వేలను ఊడగొట్టారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయి మూడో సీజన్ కూడా వచ్చేసింది. రేవంత్‌రెడ్డి సర్కారు మొత్తంగా ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ పడింది. రైతులకు హక్కుగా రావాల్సిన ఈ సొమ్మును వదులుకోవద్దు.
ఏ పంట పైసలు వేస్తారు?
ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా వానాకాలం పైసలా? యాసంగి పైసలా? ఏడాదికి ఒకే పంటకు ఇస్తారా? రెండు పంటలకు వేస్తారా? ఈ కుట్రను రైతాంగం గుర్తించాలి. ఇప్పుడు వేయాల్సింది ఎకరానికి రూ,7,500 కాదు..రూ.17500 డిమాండ్ చేయాలి.
పీఎం కిసాన్‌తో లింక్ చేస్తే సగం మందికి కూడా రాదు
ఆదాయం పన్ను కట్టేవాళ్లకు, పాన్ కార్డు ఉన్న వాళ్లకు రైతుబంధు కట్ అని పత్రికల్లో కథనాలు రాయించారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇక భూమితో బంధం తెంపేస్తారా? పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు. 70 లక్షలకు పైగా రైతన్నలు ఉంటే 30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ రావట్లేదు.
రైతులను అవమానపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రూ.22 వేల కోట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, క్రషర్లకు ఇచ్చారనే దు్రష్పచారంతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది. వానా కాలంలో పోలి్చతే యాసంగిలో సాగు తగ్గుతుంది. పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు రెండు సీజన్లు వేయడం సాధ్యం కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం యాసంగిలో కూడా వానాకాలం లెక్క ప్రకరామే రైతుబంధు పైసలు జమ చేసింది. అయితే యాసంగిలో వేసిన రైతుబంధు పైసలను దుర్వినియోగం లెక్కల్లో వేసి కాంగ్రెస్ సర్కారు అన్నదాతలను దొంగలుగా చూపుతోంది. రైతులందరికీ రైతుభరోసా అమలు చేయాలి. రైతులకు ఇస్తున్నది భిక్ష కాదు, వారి హక్కు అని ప్రభుత్వం తెలుసుకోవాలి. మేం రైతులకు అండగా ఉంటాం’అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment