Ramreddy sucharitha
-
గులాబీ గూటిలో విజయానందం
పాలేరు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి, హైదరాబాద్: జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుండటంతో అధికార టీఆర్ఎస్ శిబిరం హర్షాతిరేకాల్లో మునిగి తేలుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, రెండేళ్లుగా ఏదో ఒక ఎన్నికల్లో తలమునకలవుతూనే వస్తోంది. విజయం సాధిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. మెదక్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో గెలుపుతో తెలంగాణలో ఉప ఎన్నికల విజయానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మంత్రివర్గంలో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన వ రంగల్ లోక్‌సభ స్థానాన్నయితే ఏకంగా దేశంలో ఏడో అతి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ కాగా ఆ ఉప ఎన్నికనూ భారీ మెజారిటీతో నెగ్గింది. తాజాగా పాలేరు అసెంబ్లీ స్థానాన్నీ రికార్డు మెజారిటీతో చేజిక్కించుకుంది. అలా కాంగ్రెస్ చేతిలోని రెండు సీట్లను దక్కించుకుంది. ఇవేగాక గ్రేటర్ హైదరాబా ద్, గ్రేటర్ వ రంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీ, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం. పరోక్ష ఎన్నికల్లోనూ... పరోక్ష ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. శాసనమండలిలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయి ఒకటి మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (2 స్థానాలు), ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ( ఒక స్థానం) గెలుచుకుంది. అలా మండలిలోనూ సంఖ్యా బలం పెంచుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఓడింది. ఫలించిన పాలేరు వ్యూహం! పాలేరు ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 4,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న చరిత్రను తిరగరాయాని పట్టుదలతో పనిచేసింది. స్థానికంగా మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏకంగా పదిమంది మంత్రులను మోహరించింది. మండలాలు, గ్రామాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రచారంలోకి దింపింది. ప్రతి ఓటరునూ నేరుగా కలిసేలా ప్రచారం చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో హోరెత్తించింది. భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. -
టీఆర్ఎస్ విజయోత్సవంలో ఘర్షణ
పోచారంలో ఉద్రిక్తత కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో టీఆర్ఎస్కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఫలితాలు వెలువడిన అనంత రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా అదే పార్టీకి చెందిన ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగగా ఎంపీపీ సహా ఇరువర్గాలకు చెందిన 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెంది న మరో నాయకుడు రామసహాయం బాల కృష్ణారెడ్డి వర్గీయులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఇంటి సమీపంలోకి రాగానే ఇరువర్గాలు తారసపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపీ వర్గీయుల మీదకు రాయి విసిరాడు. వెంటనే ఎంపీపీ వర్గీయులు బాలకృష్ణారెడ్డి వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడగా, కొప్పుల గణేశ్, పుట్ట వెంకన్న అనే ఇద్దరికి గాయాలయ్యాయి. ఎంపీపీ వెంకటరెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల తులిశమ్మ, రాగం మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాలేరులో తుమ్మల ఘనవిజయం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘనవిజయం సాధించారు. తుమ్మల నాగేశ్వరరావు తమ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డిపై 45 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున తుమ్మల, కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేశారు. సుచరితకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచినా ఆమెకు కలసిరాకపోవడంతో పాటు సానుభూతి పవనాలు వీయలేదు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ నుంచి ముందంజలో నిలిచిన తుమ్మల భారీ మెజార్టీ సాధించారు. -
పాలేరులో దూసుకుపోతున్న తుమ్మల
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి సుచరిత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగారు. ఆమెకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచాయి. కానీ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు ముగిసేసరికి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిని సుచరితపై 9,610 ఓట్ల ఆధిక్యం సాధించారు. భారీ ఆధిక్యంతో తామిక్కడ విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. -
నేడు నామినేషన్ వేయనున్న సుచరిత, తుమ్మల
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం ఆమె నామినేషన్ వేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పాల్గొనున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. నేటి ఉదయం 11.00 గంటలకు ట్రంక్ రోడ్డులోని రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి తుమ్మల ర్యాలీగా వెళ్లనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వేయనున్న ఈ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్‌తోపాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. 2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ పార్టీ నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ... అవి సఫలం కాలేదు. కాగా టీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరిన విషయం తెలిసిందే. హస్తం పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వర్గీయ రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య రాంరెడ్డి సుచరితను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది.