కొండంత కుబేరుడు!
చేవెళ్ల లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి
విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల విలువ రూ.528 కోట్లు
ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి (కేవీఆర్) భారీ మొత్తంలో ఆస్తుల వివరాలను వెల్లడించారు. భార్య, ముగ్గురు కుమారులు, తన పేరిట మొత్తం రూ.528 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు వివరించారు. నగదు, బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో వాటాలు, స్థిరాస్తులు మొత్తం కలిపి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 528 కోట్ల, 62లక్షల, 30వేల, 210 విలువ చేసే సంపద ఉన్నట్లు శనివారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇందులో తన పేరిట రూ. 171కోట్ల, 72 లక్షల, 69 వేల 324, ఆయన భార్య, అపోలో ఆస్పత్రుల ఎం.డి. సంగీతారెడ్డి పేరిట రూ.243 కోట్ల, 27 లక్షల, 40 వేల 262, ముగ్గురు కుమారుల పేరుపై రూ.63 కోట్ల, 90 లక్షల, 60వేల 724 ఆస్తులున్నాయని వివరించారు. తమ ఆస్తిలో సింహభాగం అపోలో ఆస్పత్రుల్లో వాటాల రూపంలో ఉందని తెలిపారు. ఆంధ్రా పెట్రో, దిఆంధ్రా షుగర్స్, సిటాడెల్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్, స్టెఫాన్ డిజైన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్, హెల్త్‌క్యూర్ ఇండియా లిమిటెడ్, కార్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ వంటి సంస్థల్లో ఈ దంపతులకు రూ.కోట్ల వాటాలున్నాయి. 50ఎకరాల వ్యవసాయ భూమితోపాటు, హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.కోట్ల విలువైన నివాస, వాణిజ్య భవనాలను కేవీఆర్ ఆస్తుల జాబితాలో చూపించారు. సంగీతారెడ్డికి రూ.3కోట్ల విలువైన బం గారు, వజ్రాభరణాలు ఉన్నాయి. ఇన్ని కోట్ల ఆస్తులున్నప్పటికీ కుటుంబ సభ్యులెవరికీ వ్యక్తిగత కార్లుగానీ, ఇతర వాహనాలుగానీ లేవని అఫిడవిట్‌లో పేర్కొనడం విశేషం.