సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠ వీడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం ఫోన్ సంభాషణల రూపంలో బహిర్గతం కావడం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టింది. ఫోన్ సంభాషణ లీక్ అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరుతారని భావించినప్పటికీ, ఏవో కారణాల వల్ల వీలు కాలేదు. ఈనెల 21న భారీ ర్యాలీగా హైదరాబాద్ వెళ్లి పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నారు.
శుక్రవారం ఎల్.రమణతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరితే తనకు ప్రాధాన్యత ఉండదని భావించిన కౌశిక్ రెడ్డి.. 21వ తేదీని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్టు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తేనే స్వయంగా తానే పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. లేదంటే ఈ సస్పెన్స్ మరికొంత కాలం కొనసాగుతుందని పార్టీ వర్గాల అంచనా.
కౌశిక్ అభ్యర్థిత్వంపై తర్జనభర్జన
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతూ ‘హుజూరాబాద్ టీఆర్‌ఎస్ టికెట్ నాకే’ అని పాడి కౌశిక్ రెడ్డి మాజీ టీఆర్‌ఎస్ నాయకుడితో జరిపిన ఫోన్ సంభాషణ రచ్చకెక్కడంతో గులాబీ నేతలు విస్తుపోయారు. దీంతో కౌశిక్‌రెడ్డికి టీఆర్‌ఎస్ అధిష్టానం పార్టీ టికెట్టుపై కచ్చితమైన హామీ ఇచ్చిందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. అదే సమయంలో కౌశిక్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా వ్యవహరించారనే అపవాదు కూడా వచ్చింది. టీఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చి లాగాలని, మద్యం, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని లీకైన ఫోన్ సంభాషణల్లో ఉండడంతో టీఆర్‌ఎస్ నేతలు నోరు మెదపలేదు.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత మంత్రులు, ముఖ్య నాయకులు ప్రచారానికి కూడా హుజూరాబాద్ వైపు వెళ్లకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినా, పార్టీ టికెట్టు ఇస్తారా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ పార్టీలో చేరితే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయంలో టీఆర్‌ఎస్ ఇంటలిజెన్స్ విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణల లీక్‌తో పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిందా? ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారా.. అభ్యర్థిని చూశా? అనే విషయమై అధిష్టానం దృష్టి పెట్టింది. కౌశిక్‌రెడ్డి కాకపోతే ఈటలను ఢీకొట్టే గట్టి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కూడా అధిష్టానానికి స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కాగల అవకాశాలకు కౌశిక్‌రెడ్డి స్వయంగా గండి కొట్టుకున్నట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
ఎల్.రమణపై కేసీఆర్ వ్యాఖ్యల్లో అంతరార్థం..?
‘రమణ టీఆర్‌ఎస్‌లో చేరడం వల్ల పార్టీకి చేనేత వర్గానికి చెందిన నాయకుడు లేడనే లోటు భర్తీ అయింది. గతంలో ఈ వర్గం నుంచి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రమణ విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. ఆయనకు తగిన పదవి ఇస్తా’ అని శుక్రవారం టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చింత ప్రభాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత అసెంబ్లీలో ఈ వర్గానికి ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎల్.రమణకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా! అనే చర్చ మొదలైంది. అయితే.. జగిత్యాలకు చెందిన ఎల్.రమణ స్థానికేతర అభ్యర్థి కావడం మైనస్ అవుతుందని, ఆయన ద్వారా చేనేత, బీసీ వర్గం ఓటర్లను ఆకర్షించాలని పార్టీ భావిస్తోందని టీఆర్‌ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఇతర నాయకుల ప్రయత్నాలు
కౌశిక్‌రెడ్డి వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. 2009, 2010లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తన అవకాశాలు సజీవంగా ఉన్నాయని భావిస్తున్నారు. బీసీ నాయకుడిగా, గతంలో రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తిగా తనకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా పార్టీ అభ్యర్థిత్వంపై ఆశతో ఉన్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్ టికెట్టు ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, ఆయనతో సంప్రదింపులు జరగలేదు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబాన్ని ఎంత మేర పరిగణలోకి తీసుకుంటారో తెలియదు. ఏదేమైనా.. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ‘పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని’ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment