Padi Koushik Reddy Give Clarity On Joining In TRS Party Tomorrow - Sakshi
Sakshi News home page

Kaushik Reddy: కౌశిక్‌రెడ్డి కారెక్కడం ఖాయం, రేపే ముహూర్తం

Published Tue, Jul 20 2021 11:50 AM | Last Updated on Tue, Jul 20 2021 1:29 PM

Padi Koushik Reddy Give Clarity On Joining In TRS party Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి రేపు(బుధవారం) టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరటం దాదాపు ఖాయమైంది. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్.. ఈటలకు అనేక అవకాశాలు ఇచ్చారని, ఏడేళ్లలో ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో ఏం చేయలేదని మండిపడ్డారు. వ్యక్తిగత అభివృద్ధికే ఈటల ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈటలది ఆత్మగౌరవం కాదని, హుజూరాబాద్ ప్రజలది ఆత్మగౌరవమని గుర్తుచేశారు. దళిత బంధు అద్భుతమైన పథకమని అన్నారు. 

ఈటలకు డిపాజిట్ సైతం దక్కదన్నారు. ఈటల రాజేందర్‌ హత్య రాజకీయాలు చేస్తారని, 2018లో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో తనను హత్య చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. హత్య రాజకీయాల చరిత్ర ఈటలదేనని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి తనతో అన్ని పనులు చేయించుకుని మోసం చేశాడన్నారు. స్వంత తమ్ముడని చెప్పావు కదా రెవంత్ అన్నా.. ఆ మాట గుండే మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. రేవంత్రెడ్డిది తొందరపాటు చర్యలని, తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అవుతుందని కౌశిక్‌రెడ్డి అన్నారు.

ఇటీవల ఫోన్‌ సంభాషణ లీక్‌ అయిన నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనని వార్తలు వచ్చాయి.  అయితే ఎల్‌.రమణతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరుదామని భావించిన కౌశిక్‌ రెడ్డి కొన్ని కారణాలతో ఆగిపో​యినట్లు తెలుస్తోంది. మరోవైపు హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠ వీడడం లేదు. కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ ఆయనకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది. బలమైన అభ్యర్థి కోసం వేచిచూస్తోంది.

ఈ క్రమంలోనే అభ్యర్థి ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాదయాత్రతో ఎన్నికల సమరానికి సై అంటున్నారు. ఇదిలా ఉండగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ని టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థిగా బరిలోకి దించుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement