సాక్షి , కరీంనగర్: కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రెండుసార్లు ఎంపీ పదవికి కేసీఆర్, ఎమ్మెల్యేల పదవికి కేటీఆర్, ఈటల రాజేందర్ రాజీనామా చేసినా ప్రజలు గెలిపించారు. అలాంటి బలమైన పునాదులు ఉన్న జిల్లాలో.. అందులోనూ పార్టీలో సీనియర్ నేత ఎంపీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు సొంత ప్రాంతమైన హుజూరాబాద్‌లో ప్రతికూల ఫలితం రావడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. ఆ కంచుకోటపై నేడు కాషాయజెండా ఎగరడంపై టీఆర్‌ఎస్ పార్టీ సమీక్ష ప్రారంభించింది. 23,855 ఓట్ల తేడాతో తమ సిట్టింగ్ స్థానంలో ప్రత్యర్థి విజయం సాధించడంతో.. ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే పనిలో మునిగింది. పార్టీ జిల్లా నాయకత్వాన్ని అధిష్టానం నివేదిక అడగనున్నట్లు తెలిసింది.
పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రత్యర్థిదే పైచేయి
హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో కమలాపూర్ ఈటల రాజేందర్ సొంతప్రాంతం. ఇక్కడ బీజేపీకి ఆధిక్యంరావడంలో వింతేంలేదు. మిగిలినవి హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక. ఈ ప్రాంతాల్లోని మెజారిటీ గ్రామాల్లో టీఆర్‌ఎస్ అనుకూల సర్పంచులే. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. హుజూరాబాద్ మున్సి పాలిటీ, హుజూరాబాద్ రూరల్, వీణవంక మండలాల్లో భారీ మెజారిటీ వస్తుందనుకున్న గులాబీఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. దీంతో జిల్లా గులాబీ నాయకత్వం గ్రామాలవారీగా పోస్టుమార్టం ప్రారంభించింది. ఎక్కడు ఏ కారణం చేత ఓట్లు తగ్గిపోయాయే తెలుసుకునే పనిలో పడింది.
చదవండి: (హుజూరాబాద్ నిశ్శబ్ద తీర్పు.. చక్రం తిప్పిన బండి సంజయ్)
గట్టి నేతలు ఉన్నా..
పాడి కౌశిక్‌రెడ్డి సొంతమండలం వీణవంకలో టీఆర్‌ఎస్‌కు 162 ఓట్ల మెజారిటీ వచ్చింది. జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ ప్రచారం చేసిన ఇల్లందకుంట ప్రాంతంలో బీజేపీ మెజారిటీ 1,423 ఓట్లు. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 549ఓట్లు అధికంగా రావడం గమనార్హం. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌బాబుల సొంతగ్రామం సింగాపూర్‌లో టీఆర్‌ఎస్ కేవలం 133ఓట్ల మెజారిటీ సాధించింది. ఎస్సీ కార్పొరేషన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ల స్వస్థలమైన హుజూరాబాద్ పట్టణంలోనూ బీజేపీకి మెజారిటీ వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రకటించిన హుజూరాబాద్ మండలం శాలపల్లిలో బీజేపీకి 137మెజారిటీ రావడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిలో ఉందని సమాచారం.
త్వరలోనే నివేదిక
ఓటమి విషయంలో అధిష్టానం త్వరలోనే ఓ నివేదిక కోరే అవకాశముందని సమాచారం. నాలుగున్నర నెలలుగా హుజూరాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం చేసినా.. సానుకూల ఫలితం రాకపోయేసరికి జిల్లా నేతలు ఆత్మావలోకనం ప్రారంభించారు. పార్టీలో భారీగా చేరికలు జరిగినా, దళితబంధులాంటి సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా, పెండింగ్ పనులు పూర్తి చేసినా, రూ.కోట్లాది నిధులు విడుదల చేసినా ఎందుకు ప్రజలు తమను తిరస్కరించారు? అన్న విషయంలో బుర్రలు బద్ధలు కొంటుకుంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో రాజేందర్ విజయానికి సానుభూతే కారణమని.. పార్టీ అ డిగిందే తడవుగా.. వివరణ ఇచ్చేందుకు సిద్ధపడ్డారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment