సాక్షి, హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనను ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్‌లో సీఎం నుంచి బీ ఫామ్ అందుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్సే అని జోస్యం చెప్పారు.
'కేసీఆర్ నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. నాలుగు సార్లు నాకు బీ ఫామ్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీకి రుణపడి ఉన్నా. తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి వమ్ము చేశాడు. బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా.. ఎలా అభివృద్ధి చేస్తుందో రాజగోపాల్ చెప్పాలి. ఇప్పటివరకు అభివృద్ధి కోసం ఆ పార్టీ ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు.
తన కాంట్రాక్టుల కోసం రూ.22వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మిస్తున్నాడు. కర్రుకాల్చి వాత పెట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ మునుగోడులో మూడో స్థానానికే పరిమితం అవుతుంది. జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఒక్క ఓటుకు బీజేపీ రూ.30 వేలు పంచుతామని చెప్తోంది. నాయకుడు కాదు గెలిచేది, మునుగోడు ప్రజలే' అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment