మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయరాదని పది వామపక్షాలు నిర్ణయించాయి.
సాక్షి,హైదరాబాద్ : మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయరాదని పది వామపక్షాలు నిర్ణయించాయి. ఈ స్థానం నుంచి పోటీచేస్తున్న వారిలో ఎవరికి మద్దతునివ్వాలనే విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలు జరిగేలోగా మరోసారి భేటీ అయ్యి దీనిపై నిర్ణయించే అవకాశముంది. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ పోటీచేస్తున్నందున, పార్టీ ముద్ర ఉన్న వ్యక్తికి మద్దతుపై ఈ పార్టీల్లో ఇంకా స్పష్టత రాలేదు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కౌన్సిల్‌కు పోటీచేస్తున్న ఎస్.ప్రభాకర్‌రెడ్డికి పూర్తి మద్దతును ఈ పార్టీలు ప్రకటించాయి. గురువారం నల్లగొండలో ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఈ పార్టీల ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.
బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని కార్యాలయంలో భేటీ అయిన ఈ పార్టీల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సీపీఐ,సీపీఎంల తరఫున ఈ స్థానాలకు అభ్యర్థులను నిలపాలనే ప్రయత్నం జరిగినా.. అది ఫలవంతం కాలేదు. ఈ పార్టీలు నిలిపే అభ్యర్థులకు మిగతా పార్టీల మద్దతు లభించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని సీపీఐ,సీపీఎం విరమించుకున్నాయి. ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంలో వివిధ వామపక్షాలమధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. హైదరాబాద్ సీటు నుంచి సీపీఎం జనార్దనరెడ్డిని నిలిపే యత్నం చేయగా, ఒకపార్టీ ముద్ర ఉన్న వాళ్లు కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన వారినే ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరిస్తామని మిగతాపక్షాలు ఒప్పుకోలేదు. దీనితో ఈ స్థానానికి పోటీచేయరాదని వామపక్షాలు నిర్ణయించాయి. అయితే అదే సమయంలో నల్లగొండ,వరంగల్,ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎస్.ప్రభాక ర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి పదివామపక్షాలు మద్దతును పలకడం కమ్యూనిస్టుపార్టీల చరిత్రలోనే తొలిసారని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాము మద్దతు పలికిన అభ్యర్థి విజయానికి కృషిచేయాలని ఈ పార్టీల నేతలు నిర్ణయించారు. బుధవారం ఎస్‌వీకేలో జరిగిన భేటీలో తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ), జానకీరాం (ఆర్‌ఎస్‌పీ), ఎం.శ్రీనివాస్ (సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ), మురహరి (ఎస్‌యూసీఐ) పాల్గొన్నారు.