సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. మెజార్టీ అభ్యర్థులు ఈనెల 14వ తేదీన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. వేద శాస్త్రాల ప్రకారం ఆ రోజున తిథి, నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చి చెప్పడంతో అదే రోజున నామినేషన్లు వేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒంటరిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, మరో రోజు భారీ ఊరేగింపుతో వెళ్లి రెండో సెట్ పత్రాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ వచ్చి బీ–ఫారాలు తీసుకుని వెళ్లాలని ‘గులాబీ’ దళపతి కేసీఆర్ నుంచి అభ్యర్థులకు ఆహ్వానం అందింది. వచ్చేటప్పుడు కచ్చితంగా ఓటరు గుర్తింపు కార్డు, నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను వెంట తీసుకుని రావాలని ఆయన ఆదేశించారు. దీంతో అభ్యర్థులందరూ ఆదివారం హైదరాబాద్‌కు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల19తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుండడంతో తిథి, నక్షత్రాలు చూసుకుని నామినేషన్లు వేసేందుకు వీలుగా ముందస్తుగానే బీ–ఫారాలు ఇస్తున్నారు.
నేర చరిత్ర ఉంటే..
అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకే ఓటరు గుర్తింపు కార్డుతో తెలంగాణభవన్‌కు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు ప్రతి సాంకేతిక పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే విధానాన్ని వివరించే అవకాశం ఉంది. ఓటరు గుర్తింపుకార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటారని.. అదే పేరును బీ–ఫారంపై రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేరచరిత్రపై రెండు పత్రికలు, టీవీలలో ప్రచారం చేయాల్సి ఉన్నందున వాటికి సంబంధించిన పత్రాలు తేవాలన్నారు. నేర చరిత్రకు సంబంధించిన పత్రికా ప్రకటనలను టీఆర్‌ఎస్ అధిష్టానమే అభ్యర్థుల తరఫున ఇవ్వనున్నట్లు తెలిసింది.
జాతకం కూడా బయటపెడతారు..
బీ–ఫారాల అందజేతతోపాటు అభ్యర్థులకు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు ముందు అందరు అభ్యర్థులతో కలిసి నిర్వహించే చివరి సమావేశమైనందున.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలను గులాబీ దళపతి వివరించే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 6న అభ్యర్ధులను ప్రకటించారు. అంటే దాదాపు రెండు నెలల కాలం అయింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ సర్వే చేయించారు. ఈ సమావేశంలో తాజాగా వచ్చిన సర్వే నివేదికలను సైతం వారికి అందజేయనున్నట్లు సమాచారం.
మెజార్టీ సభ్యులు 14వ తేదీనే..
టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో మెజార్టీ సభ్యులు ఈనెల 14న నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. జనగామ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ములుగు అభ్యర్థి అజ్మీరా చందూలాల్, స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి రాజయ్య, వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్, నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట అభ్యర్థి ఆరూరి రమేష్ మాత్రం ఈనెల 19న నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు.
14వ తేదీనే ఎందుకు..?
వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం. శ్రవణా నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకుని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి.
కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు 9వ స్థానంలో ఉండడంతో పాటు మకర లగ్నంలో చంద్రుడు, కేతువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారి తీస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఎక్కువ మంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. 19వ తేదీ ఏకాదశితో పాటు శివప్రీతికరమైన కార్తీక మాస సోమవారం కాబట్టి కలిసివస్తుందని.. ఈ రోజున నామినేషన్లు దాఖలుచేసేందుకు ఎర్రబెల్లి, అరూరి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment