జనగామలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న వీబీఐటీ కేంద్రం
సాక్షి, జనగామ: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపే మిగిలింది. ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకోసం ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థుల తరపున ఏజెంట్లను అనుమతిస్తారు. దీంతో ఆయా అభ్యర్థులు, వారు ఎంచుకున్న ఏజెంట్లకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
సూచనలు...
- కౌంటింగ్ ఏజెంట్లుగా అనుభవం ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి. దాని వలన అభ్యర్థి ప్రయోజనాలు సరిగ్గా పరిరక్షించబడుతాయి.
- ఎన్నికల సంఘం శాశ్వత ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్లుగా అంగీకరించరు. ఎందుకంటే భద్రత సిబ్బందిని ఆయన వెంట లోనికి అనుమతించరు. భద్రత లేకుండా తాను వెళతానని లిఖిత పూర్వకంగా రాసిచ్చినా అంగీకరించరు.
- ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా పనిచేస్తే సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
- ప్రతి అభ్యర్థి ఎన్ని లెక్కింపు టేబుళ్లు ఉంటే అంతమందిని గరిష్టంగా 15 మందిని ఏజెంట్లుగా నియమించుకోవచ్చు.
- సాధారణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒకటి రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుంది.
- కౌంటింగ్ ఏజెంటును ఫొటోలో ఉన్న అభ్యర్థి కానీ అతని ఎన్నికల ప్రతినిధి గానీ ఫారం 18లో వివరాలు అందజేసి, ఏజెంటు ఫొటోగ్రాఫ్, సంతకాలు చేసిన రెండు ఫారాలు రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.
- అభ్యర్థి తనకు సౌలభ్యంగా ఉంచేందుకు ఫారం 18లోనే తన తరుపు పాల్గొనే ఏజెంట్ల పేర్లు కూడా రాసి ఇవ్వొచ్చు.
- కౌంటింగ్‌కు మూడు రోజుల ముందుగా సాయంత్రం 5 గంటల లోగా ఏజెంట్ల జాబితా, ఫొటోలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తే వారు అనుమతి పత్రాలను జారీ చేస్తారు.
- ఏజెంట్లు ఓట్ల లెక్కింపునకు గంట ముందుగా కౌంటింగ్ హాలుకు అనుమతి పత్రంతో హాజరుకావాల్సి ఉంటుంది.
- ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం.. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
- 17 సీ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి ( పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేస్తారు).
- పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు.
- వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఈవీఎం ల సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా... వారికి పోలైన ఓట్లు వెలువడతాయి.
- అనివార్య కారణాల చేత నియమించిన వ్యక్తి నచ్చక పోయినా.. లేదా అతను హాజరు కాలేకపోయినా.. ఫారం 19 పూర్తి చేసి ఓట్ల లెక్కింపునకు ముందుగా మరో ఏజెంటును నియమించుకోవచ్చు.
- ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే ఎట్టి పరిస్థితుల్లోను ఏజెంటును నియమించుకోవడానికి వీలు లేదు.
- ఏ టేబుల్ వద్ద నియమించిన ఏజెంటు అక్కడే ఉండాలి. అన్ని టేబుళ్ల వద్ద తిరగడానికి వీలు లేదు.
- హాలులో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలి. నియమాలు పాటించక పోతే ఏ ఏజెంటునైనా బయటకు పంపించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది.
- లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు హాలు నుంచి ఏజెంటును బయటకు వెళ్లడానికి అనుమతించరు.
- కౌంటింగ్ హాలు దగ్గర తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు.
- లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు.
- లెక్కింపు కేంద్రంలో దూమపానం నిషేధం.
- వరుస క్రమంలో లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి వరుసలో ఉన్న టేబుళ్లకు సీరియల్ నెంబర్ ఇవ్వబడుతుంది.
- ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
- జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, నమోదైన గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్లకు కుర్చీలను ఏర్పాటు చేస్తారు.
- ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతాయి.. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్ల లెక్కింపు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment