సాక్షి, రఘునాథపల్లి(జనగామ): శతాబ్దాల చరిత్ర కలిగిన సర్ధార్ సర్వాయి పాపన్న కోటలోని కొంత భాగం నేలకొరగడం విచారకరమని సినీ హీరో పంజాల జైహింద్‌గౌడ్ అన్నారు. బహుజనుల రాజ్యాన్ని స్థాపించి వీరోచిత పోరాటంతో మొగలుల ఆగడాలను ఎదిరించిన వీరుడైన పాపన్న కోటను పునరుద్ధరించి భావితరాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోటలోని ఓ వైపు రాతి గోడ కుప్పకూలిన నేపథ్యంలో మంగళవారం ఆయన గౌడ సంఘం నేతలతో కలిసి కోటను పరిశీలించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ కోట పునర్నిర్మాణానికి సర్వాయి పాపన్న ట్రస్ట్ తరపున రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కోట పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరగా పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని పాపన్న కోటలో నిర్మిస్తామని తెలిపారు. కోట రాతి గోడ కూలడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌తో పాటు పరీదుల శ్రీను, మర్కాల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment