‘ఖేడ్’లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే..
నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కృష్ణానది నీళ్లు తెచ్చి ఈ ప్రాంత రైతుల కాళ్లు కడుగుతామని నీటిపారుదలశాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో నిర్వహించిన ఉప ఎన్నిక ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజురోజుకు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని, తెలంగాణలో టీడీపీకి అసలు భవిష్యతే లేదన్నారు. ఆంధ్రా పార్టీ అయిన టీడీపీకి నారాయణఖేడ్ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికే టీడీపీ ఈ ఎన్నికలో పోటీ చేస్తుం దన్నారు.
‘ మీ కడుపులో తలపెట్టి ప్రార్థిస్తున్నా.. తెలంగాణ కోసం కలసిరావాలి.. టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తే నారాయణఖేడ్ దశ దిశ మారుస్తాం’ అని ప్రజలనుద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బాబు
తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని హరీశ్‌రావు ఆరోపిం చారు. లోయర్ మానేరు నుంచి కరెంటు రాకుండా చేసింది చంద్రబాబేనని చెప్పారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను సైతం అడ్డుకున్నారని విమర్శిం చారు. ప్రాజెక్టుల నీరు రాకుండా అడ్డుకొని ఢిల్లీకి ఉత్తరాలు రాసిన ఘనత కూడా ఆయనదేనన్నారు.