పరాజయాలు.. పరాభవాలే.. | 56 defeats of TDP when is in the opposition | Sakshi
Sakshi News home page

పరాజయాలు.. పరాభవాలే..

Published Wed, Aug 30 2017 3:50 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

పరాజయాలు.. పరాభవాలే.. - Sakshi

పరాజయాలు.. పరాభవాలే..

ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఓటములు 56 
ఉప ఎన్నికల్లో 25సార్లు డిపాజిట్లు గల్లంతు.. 
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనేక పరాజయాలు.. 
 
సాక్షి, అమరావతి: అధికారంలో ఉండగా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టి, భయభ్రాంతులకు గురిచేసి విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ఓటమి చెందడంలో అంతకు మించిన రికార్డు సృష్టించింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ మొత్తం 56 ఉప ఎన్నికలలో పరాజయాన్ని మూటకట్టుకుంది. అందులో 25 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. 
 
ఉప ఎన్నికల్లో 56 సార్లు ఓడిన టీడీపీ 
రాష్ట్రంలో 2004 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత వివిధ కారణాలతో పలు అసెంబ్లీ స్థానాలకు 62  ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ  56 స్థానాలలో ఓటమి పాలవ్వడమే కాకుండా 25 స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 
 
► 2005లో టీడీపీ అభ్యర్థి మరణంతో జరిగిన బొబ్బిలి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి టీడీపీపై విజయం సాధించారు.  
 
► 2005లో జరిగిన కరీంనగర్‌ ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు కాంగ్రెస్‌పై గెలిచారు. టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. 
 
► తెలంగాణ సాధన వ్యూహంలో భాగంగా 17 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో 2008 మే 29న ఉప ఎన్నికలు జరిగాయి. దీంతోపాటు విజయనగరం జిల్లా తెర్లాంలో టీడీపీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్, కాంగ్రెస్‌నేత  పి.జనార్దన్‌రెడ్డి హఠాన్మరణంతో ఖైరతాబాద్‌లో  ఉపఎన్నికలు ఇదేరోజున జరిగాయి.  వీటితో పాటు తెలంగాణలోని, జడ్చర్ల, వికారాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట, ఎల్లారెడ్డి, డిచ్‌పల్లి, ఖానాపూర్, మేడారం, హుజూరాబాద్, కమలాపూర్, చేర్యాల్, ఘణ్‌పూర్, ఆలేరు నియోజకవర్గాల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తెర్లాంలో టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మనాయుడు (జయప్రకాశ్‌ కుమారుడు) గెలిచారు. ఇక తెలంగాణలో జరిగిన మిగతా ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌ గెల్చుకోగా,  టీఆర్‌ఎస్‌ ఏడు స్థానాలను, టీడీపీ నాలుగు స్థానాలను, సాధించాయి. సిద్దిపేట సçహాæ కొన్ని నియోజకవర్గాలలో ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. 
 
► తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు, ఆపార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో 2010 జులై 27న 12 స్థానాలకు (చెన్నూరు, ఎల్లారెడ్డి, సిర్పూరు, సిద్ధిపేట, హుజూరాబాద్, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, మంచిర్యాల, వరంగల్‌ వెస్ట్, నిజామాబాద్‌ అర్బన్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ మినహా తక్కిన అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది.  

► 2011 అక్టోబర్‌ 13న నిజామాబాద్‌ జిల్లా  బాన్సువాడ ఉప ఎన్నికలు జరగ్గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో ఈ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని  బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాటమంటూ చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్లి పెద్ద హైడ్రామా నడిపినా ఈ ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 

► కాంగ్రెస్‌ పార్టీకి, ఎంపీ పదవికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నెలకొల్పిన అనంతరం జరిగిన కడప లోక్‌సభ స్థానానికి 2011లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. ఇదే సమయంలో జరిగిన పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.  

► 2012 మార్చి 18న కోవూరు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఘణ్‌పూర్, కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏపీలోని కోవూరు స్థానంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విజయం సాధించగా, తెలంగాణాలోని ఆరింటిలో టీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలను, బీజేపీ, ఇండిపెండెంట్లు ఒక్కొక్క స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండూ ఓటమి పాలయ్యాయి. ఇక టీడీపీ అయితే ఈ ఉప ఎన్నికల్లో కోవూరుతో సహ నాలుగు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. 

► వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో  పదవులకు రాజీనామాలు చేయించడంతో ఒక ఎంపీ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి.  2012 జూన్‌ 12న జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మూడు (పరకాల, నరసాపురం, రామచంద్రాపురం) అసెంబ్లీ స్థానాలు మినహా తక్కిన 15 అసెంబీల స్థానాలనూ. నెల్లూరు ఎంపీ స్థానాన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకొంది. తిరుపతి, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, ఒంగోలు, నరసన్నపేట, పాయకరావుపేట, అనంతపురం అర్బన్, ఎమ్మిగనూరు, రాయదుర్గం, రైల్వేకోడూరు, ఉదయగిరి, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరం స్థానాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెల్చుకుంది. ఇక పరకాలలో టీఆర్‌ఎస్, నరసాపురం, రామచంద్రాపురంలలో కాంగ్రెస్‌ విజయం సాధించాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేక చతికిలపడింది. పైగా 5స్థానాల్లో  డిపాజిట్లు కోల్పోయింది. ఏడు స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది.  
 
డబ్బు పంపిణీకి ఆద్యుడు బాబే.. 
ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతికి ఆద్యుడు చంద్రబాబేనని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి.  సాధారణ ఎన్నికల్లోనే కాదు ఉప ఎన్నికల్లోనూ వందల కోట్లు ఖర్చుచేసే విష సంస్కృతికి చంద్రబాబే శ్రీకారం చుట్టారని అంటుంటారు. 1995లో జరిగిన ఓ ఉప ఎన్నిక సందర్భంగా ఓటుకు రూ.500 పంపిణీ చేయించారని గుర్తు చేస్తుంటారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తీరు తాజా నిదర్శనం. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి.

డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలో ఉండే పార్టీకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్థానిక యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడంతో సహా అధికారపార్టీకి అన్ని అవకాశాలు ఉంటాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా నంద్యాలలోనే మకాం వేయించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు దాదాపు రూ.1,400 కోట్లతో వివిధ పథకాలను మంజూరు చేసి ప్రజలను ప్రలోభాలకు  గురిచేశారు. ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 10వేల వరకూ పంపిణీ చేశారు. తమకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, పథకాలు ఆగిపోతాయని, పెన్షన్లు – రేషన్‌ నిలిచిపోతాయని బెదిరించారు. డ్వాక్రా మహిళలను కూడా కార్యకర్తల్లా ఉపయోగించుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తాము ఓడినా నైతిక విజయం తమదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement