ప్రలోభాలు..బెదిరింపులు!
∙ నంద్యాల ఉప ఎన్నికలో హద్దులు దాటిన అధికారపార్టీ నేతలు
∙ క్యూలో నిల్చున్న ఓటర్లను భయపెట్టే యత్నం
∙ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
∙ టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
నంద్యాల : ఉప ఎన్నికకు పదిరోజుల ముందు నుంచి ప్రలోభాలకు, బెదిరింపులకు దిగిన అధికార పార్టీ నేతలు ఎన్నికల రోజు కూడా అతే తంతు కొనసాగించారు. అధికార బలంలో ఎన్నికల కోడ్‌ను సైతం తూట్లుపపొడిచారు. ఓటింగ్ శాతం పెరిగితే తమపారీ ఓటమి తప్పదేమోనని భావించి క్యూలో నిలుచున్న ఓటర్లను సైతం భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఓటర్లకు డబ్బులు ఎరచూపడమే కాక, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను బెదిరించారు. అధికార పార్టీ నేతల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.
నాగమౌనిక హల్‌చల్...
అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చెల్లెలు నాగమౌనిక ఉదయం 9 గంటల ప్రాంతంలోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని హల్‌చల్ చేశారు. ఆమెకు ఓటు లేకపోయినా ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న షాదీఖానాలో ఏర్పాటు చేసిన 46, 47, పురపాలక సంఘం కోట ప్రాథమిక పాఠశాలల్లో 55, 56 వద్దనున్న పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను, ఆయా పార్టీల ఏజెంట్ల ఐడీ కార్డులను పరిశీలించారు. అంతటితో ఆగకుండా క్యూలో ఉన్న ఓటర్లను టీడీపకే ఓట్లు వేయాలని బెదిరింపు ధోరణి ప్రదర్శించింది.
వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యం
58, 59, 60 పోలింగ్‌కేంద్రాల వద్ద అధికార పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెడుతూ కనిపించారు. ఏజెంట్ల ముసుగులో ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి డబ్బులు పంపిణీకి చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న 59, 60 వార్డుల వైఎస్సార్సీపీ నాయకులు, కౌన్సిలర్ కలాం టీడీపీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలాంపై టీడీపీ నేతలు దాడికి దిగారు.