ఫేస్‌బుక్, వాట్సప్ అంటే తెలియదా..?
► పార్టీ అధినేతకు ఈ విషయం తెలిస్తే జిల్లా పరువుపోతుందని మండిపాటు
► హుటాహుటిన టీడీపీ కార్యాలయంలో ఇంటర్‌నెట్ డెస్క్ ఏర్పాటు
► వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక మాధ్యమాలు వాడడంలో ముందుందని ఆవేదన
► ఫేస్‌బుక్ వాట్సప్ డౌన్లోడ్ చేసుకుని జగన్‌ను తిట్టండని దిశానిర్దేశం
► తికమక పడుతున్న నాయకులు, కార్యకర్తలు
నంద్యాల: ఇంతవరకు ఫేస్‌బుక్, వాట్సాప్ అంటే ఎందో తెలీదా..! ఎవరికైనా తెలిస్తే నవ్విపోదురుగాక... అంటూ ఒక మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఆక్రోశం వెల్లగగ్గారు. అంతేకాదు హుటాహుటిన శుక్రవారం నంద్యాల పార్టీ కార్యాలయంలో వాట్సాప్, ఫేస్‌బుక్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోండని ఇంటర్నెట్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యర్థి పార్టీ సామాజిక మాధ్యమాలను వాడుకోవడంలో చాలా ముందుందని, చంద్రబాబును విమర్శలతో ముంచెత్తుతుంటే మీరు మాత్రం ఇంటర్నెట్ అంటే ఏందో తెలియదంటే ఎలా...! అంటూ నాయకులపై చిందులు తొక్కారు.
ఆదివారం వరకు రోజుకు గంట సేపు ఇంటర్నెట్ ఉపయోగంపై ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరగతులకు అందరు హాజరు కావాలని లేదంటే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని కార్యకర్తలకు, నాయకులకు హెచ్చరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంప్యూటర్‌ను నేనే తెచ్చాను. స్మార్ట్‌ఫోన్లు నేనే తెచ్చాను, ఇంటర్నెట్‌ని నేనే ప్రపంచానికి పరిచయం చేశాను అని ప్రతీ మీటింగ్‌లో చెబుతుంటే మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ ఆ మంత్రి నాయకులు, కార్యకర్తలపై తిట్ల పురాణం అందుకున్నారు. గురువారం ఉదయం నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంటర్‌నెట్‌డెస్క్ ఉంటుందని ప్రతీ కార్యకర్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కుని అందులో వాట్సాప్, ఫేస్‌బుక్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని వైఎస్‌ఆర్‌సీపీని, జగన్‌ను తిట్టాలని సూచించారు. ఇక ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం సదరు మంత్రి తీరును ప్రశ్నించారు.
ప్రతీ ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ ఉండాలి, ఫేస్‌బుక్, వాట్సాప్ తెలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంటే ఎలా అని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ను చూసి రాజకీయాల్లోకి వచ్చామని ఆయన ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాడు కాదని ఆందోళన చెందారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే ప్రజల్లో ఎప్పుడూ నిలిచి ఉంటామని, అప్పుడు ఇలాంటి ఇంటర్నెట్‌లు పార్టీని ఏమి చేయలేవని ఆ మంత్రికి గట్టిగా బదులిచ్చారు. ఇప్పటికే పార్టీకి చెడ్డపేరు ఉందని ఇలాంటి నిర్ణయాలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కాస్త మంది నాయకులను దూరం చేసుకోవద్దని సదరు మంత్రికి బహిరంగంగానే బదులిచ్చారు. ప్రతీరోజు ఇంటర్‌నెట్ శిక్షణ తరగతులకు రమ్మంటున్నారని ముందు ప్రజలతో ఎలా మెలగాలో ఆ మంత్రికి శిక్షణ ఇవ్వాలని కార్యకర్తలు చర్చించుకున్నారు. అనవసరమైన నిర్ణయాలతో పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉందని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.