'నిరూపిస్తే ఉపఎన్నిక నుంచి తప్పుకుంటాం'
నంద్యాల: తెలుగుదేశం పార్టీపై శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓటర్లను మభ్యపెడుతోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం నీచ రాజకీయాలు చేస్తోందని, ఇటువంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు.
మొదటి నుంచి డబ్బు పంచే అలవాటు టీడీపీకి ఉందన్నారు. ఓటుకు రూ. 5వేలు ఇవ్వడానికి వెనుకాడట్లేదని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభలకు వెళ్లకుండా ఉండేందుకు ఒక్కో మహిళకు రూ.300 ఇస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడంతో రాత్రికి రాత్రి అమరావతికి మకాం మార్చారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని రవిచంద్ర మండిపడ్డారు. ధైర్యం, నిజాయితీ ఉంటే తాము డబ్బు పంచామని ఆరోపిస్తున్న వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. వీడియోలో డబ్బు పంచినట్లు నిరూపిస్తే తన తండ్రి శిల్పామోహన్ రెడ్డి ఎన్నికల నుంచి తప్పుకుంటారని సవాలు విసిరారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయంపై రవిచంద్ర కిశోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.