రగులుతున్న ‘ఉప’ చిచ్చు!
రగులుతున్న ‘ఉప’ చిచ్చు!
Published Thu, Jul 6 2017 12:03 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
- అధికార పార్టీలో ఆధిపత్య పోరు
- నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతలు కేఈ ప్రభాకర్‌కు అప్పగించడంపై మంత్రి అఖిల గుస్సా
- కార్యకర్తల సమావేశానికి డుమ్మా
- ఏవీతోనూ కొనసాగుతున్న విభేదాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికార పార్టీలో రేగిన నంద్యాల ఉప ఎన్నిక చిచ్చు చల్లారడం లేదు. పైగా రోజురోజుకూ సరికొత్త రూపంలో రగులుతూనే ఉంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక కోసం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఏపీఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించడంపై మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బుధవారం నంద్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరుకాలేదని తెలిసింది. ఈ సమావేశాన్ని మొత్తం మాజీ మంత్రి ఫరూఖ్, కేఈ ప్రభాకర్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి నడిపించారు. మరోవైపు భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నట్టు అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రితో కాకుండా ఏవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా నంద్యాల ఉప ఎన్నిక వేడికి అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా చలి కాచుకుంటున్నారని తెలుస్తోంది.
ఇన్‌చార్జ్‌లు వద్దంటూ...
నంద్యాల ఉప ఎన్నిక మొత్తం భారాన్ని తానే మోయాలని మొదట్లో మంత్రి అఖిలప్రియ భావించారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆమె సవాల్‌పై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ సర్వేలో గెలుపు ముంగిట్లో లేమన్న సంకేతాల నేపథ్యంలోనే ఆమె విసిరిన సవాల్‌పై వెనక్కి తగ్గాలని సీఎం ఆదేశించారు. దీంతో ఆమె ఈ సవాల్‌పై తాజాగా పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. దీంతో పాటు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు అలాగే ఉన్నాయి. సీఎం స్థాయిలో పిలిచి మాట్లాడినా పరిష్కారం కాలేదు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికకు ఇప్పుడే ఇన్‌చార్జ్‌లను నియమించాల్సిన అవసరం లేదని నేరుగా సీఎంకే అఖిలప్రియ తేల్చిచెప్పారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏపీఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్‌ను నంద్యాలకు పంపించారు. ఇది ఆమెకు ఏ మాత్రమూ మింగుడుపడటం లేదని తెలుస్తోంది. అందుకే కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి నంద్యాలలో ఉన్నప్పటికీ ఆమె హాజరుకాలేదు. మరోవైపు సీనియర్లను కూడా ఆమె ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఎవరికి వారే..
వాస్తవానికి నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి ఇద్దామనే విషయంపై కుటుంబంలోనే విభేదాలొచ్చాయి. తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె నాగమౌనిక కోరుకున్నారు. అయితే, బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని అఖిల పట్టుబట్టింది. అనుకున్నట్టుగానే ఆయనకు టికెట్ ఇప్పించుకున్నారు. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు కొనసాగాయి. దాదాపు నెల పాటు కనీసం ఏవీకి ఫోన్ చేయకుండానే నంద్యాలలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నడిపించారు. దీనిపై కథనాలు రావడంతో నేరుగా సీఎం రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు. అయినప్పటికీ విభేదాలు సద్దుమణగకపోవడంతో ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వ్యవహారం తయారైంది. మంత్రితో సంబంధం లేకుండానే ఏవీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. ఇక ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు విడిగానో లేదా ఫరూఖ్ వర్గంతోనో కలిసి ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.
Advertisement