అసహనం.. అరాచకం | murder attempt on Shilpa Reddy | Sakshi
Sakshi News home page

అసహనం.. అరాచకం

Published Fri, Aug 25 2017 3:47 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

అసహనం.. అరాచకం - Sakshi

అసహనం.. అరాచకం

పోలింగ్‌ శాతం పెరగడంపై టీడీపీలో అసహనం
నంద్యాలలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నేతలు
శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం
వేటకొడవలితో  ‘అభిరుచి మధు’ వీరంగం
వైఎస్సార్‌సీపీకి ఓటేశారని ఓ కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాడి


నంద్యాల : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తడంతో టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. ఓటమి తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడంతో అరాచకాలకు తెగబడుతున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. గురువారం నంద్యాలలోని సూరజ్‌ హోటల్‌ వద్ద మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం ఇందుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. టీడీపీ నాయకుడు అభిరుచి మధు పట్టపగలే, నడిరోడ్డుపై పోలీసుల సమక్షంలోనే వేటకొడవలి తీసుకుని వీరంగం చేయడం..అతని గన్‌మెన్‌ కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. అధికారం ఉందనే అహకారం, తమను ఏమీ చేయలేరన్న ధీమాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వారి విషయంలో పోలీసులు కూడా చూసీచూడనట్లు వెళుతుండడంతో ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నంద్యాల పట్టణంలోని సలీంనగర్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకుడు మహబూబ్‌బాషా అలియాస్‌ చింపింగ్‌ బాషా బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు.

దీంతో గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్న మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన అనుచరుల వాహనాలను సూరజ్‌ హోటల్‌ వద్ద టీడీపీ నాయకుడు అభిరుచి మధు అడ్డుకున్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు వేటకొడవలి తీసుకుని ‘నీ అంతు చూస్తా’ అంటూ వీరంగం సృష్టించాడు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ మధు చేతిలోని వేటకొడవలిని లాక్కోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పైగా మధు సూచనతో అతని గన్‌మెన్‌ సోమభూపాల్‌ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే నంద్యాల పట్టణంలో అలజడి రేగింది. టీడీపీ నాయకులు పథకం ప్రకారం తమను హత్య చేయడానికి ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ నాయకుడు జగదీశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ సీఐ శ్రీనివాసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అభిరుచి మధుతో పాటు అతని అనుచరులైన మున్నా అలియాస్‌ ఖాదర్, షేక్‌ చిన్ను, వేణు, గన్‌మెన్‌ సోమభూపాల్‌పై కేసు నమోదైంది. అదే విధంగా టీడీపీ నాయకుడు అభిరుచి మధు కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు శిల్పాచక్రపాణిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి,  ముగ్గురు కౌన్సిలర్లతో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం కేసు పెట్టాడు.  

ఓటు వేయలేదని..
నంద్యాలలోని విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబ సభ్యులు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో వారి ఇంటి వద్ద ఉండే టీడీపీ వర్గీయుడైన ఆర్టీసీ డ్రైవర్‌ సుబ్బయ్య కుటుంబ సభ్యులు గురువారం దాడి చేసి గాయపరిచారు. తనతో పాటు కుమారుడు శ్రీనివాసరెడ్డిపై కర్రలతో దాడి చేసి గాయపరచడమే కాకుండా తన చీర కూడా లాగారని రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన పక్కింటి మహిళ కవితను తోసేసినట్లు ఆమె తెలిపింది. ఈ ఘటన కూడా ‘తమ్ముళ్ల’ అరాచకాలకు అద్దం పడుతోంది. ఇక బుధవారం పోలింగ్‌ సందర్భంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు అందరికీ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement