సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేలను సైతం స్వపక్షంగానే భావిస్తూ పాలన సాగిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విశాల దృక్పథంతో పరిపాలన సాగిస్తున్నారని, గత ముఖ్యమంత్రులు వ్యవహరించినట్లుగా సంకుచిత మనస్తత్వం ప్రదర్శించడం లేదన్నారు. రాష్ట్రంలో కేవలం నలుగురి పాలనే నడుస్తోందని, కొందరికే పాలనాధికారాల వల్ల పరిపాలన దెబ్బతింటోందంటూ ఆదివారం అసెంబ్లీలో వివిధ పద్దులపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన విమర్శలను హరీశ్‌రావు తిప్పికొట్టారు.
గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. 1.5 కోట్ల చొప్పునే ఉండేవని, వాటిని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల మాత్రమే మంజూరు చేసేవారని హరీశ్‌రావు గుర్తుచేశారు. విపక్ష పార్టీ సభ్యులున్న చోట ఇన్‌చార్జి మంత్రి పేరిట, నియోజకవర్గ నేత పేరిట మంజూరు జరిగేదన్నారు. కానీ తమ ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి కూడా రూ. 3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తోందన్నారు.
అలాగే ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో తలకెత్తుకున్న మిషన్ భగీరథ పథకాన్ని మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ చేపడుతున్నామన్నారు. ప్రతి గూడెం, గిరిజన తండా, గ్రామాల్లో అత్యంత వేగంగా పనులు సాగుతున్నాయన్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు కావాలని ఎమ్మెల్యేలు వేడుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రమంతటా ఒకటే పాలసీ. ప్రజలకు ఏం కావాలో సీఎంకు తెలుసని, రాష్ట్ర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నామన్నారు.
అక్కడా మిషన్ కాకతీయ..
మిషన్ కాకతీయ పథకంలోనూ విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఏయే నియోజకవర్గాల్లో చెరువుల పునరుద్ధరణను తొలుత ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను తాను అడగ్గా ప్రతిపక్ష ఎమ్మెల్యేలూ ఉద్యమకారులేనని, వారి నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా తెలంగాణ వాళ్లేనని చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 20 శాతం చెరువులను తీసుకుని అభివృద్ధి చేశామన్నారు.
ప్రతీ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి జిల్లా కేంద్రం నుంచి డబుల్ రోడ్డు వేయమని సీఎం చెప్పారని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో 31 లక్షల పెన్షన్లు ఉంటే ఇప్పుడు 41 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని హరీశ్ వెల్లడించారు. పక్క రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వాలంటే టీడీపీ నేతలే సభ్యులుగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు కావాల్సిన వాళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తున్న విషయాన్ని సండ్ర వెంకట వీరయ్య గ్రహించాలని సూచించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా విమర్శించాలనుకోవడం సరి కాదన్నారు.
గుర్తింపు కోసమే ప్రకటనలు
రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెట్టి పత్రికలకు ఇస్తున్న ప్రకటనలపై వివరణ ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, సీపీఎం డిమాండ్‌పైనా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తెలియజేసేందుకే ప్రకటనలు ఇస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలోనూ తమ ప్రభుత్వం దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
దేశవ్యాప్తంగా మొదటిసారిగా కార్పొరేట్ స్థాయిలో వైద్య చికిత్సలు అందించేందుకు 8,535 మంది జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, 16,793 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశామని, 16,492 మందికి ప్రమాద బీమా కింద రూ. 5 లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. ఏటా జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 34.50 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కాగా, న్యాయశాఖ, సమాచార, సాధారణ పరిపాలన విభాగంతోపాటు పలు పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
కాంగ్రెస్సోళ్లది జిల్లాకో మాట
ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే.. అవి పూర్తికాకుం డా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని హరీశ్‌రావు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పై కాంగ్రెస్ నేతలు జిల్లాకో రీతిగా మా ట్లాడుతున్నారని.. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులేసి ప్రాజెక్టులు అడ్డుకుంటే.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తు న్నారని దుయ్యబట్టారు.
ఆదివారం అసెంబ్లీలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని చంద్రసాగర్.. నల్లగొండ జిల్లాలోని పిల్లా యిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగానీ కాలువల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘60 ఏళ్లలో ఎప్పూడూ లేని విధంగా సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు సాగునీరిచ్చాం. అందోల్, పుల్కల్ మండలాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వారు తిరిగి గ్రామాలకు వెళ్లారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటికి కొదవలేదని రైతులు అంటున్నారు. వలసపోయిన ప్రజలు కేసీఆర్ పాలనలో వాపస్ వస్తున్నారు’ అని వివరించారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగానీ కాలువ అభివృద్ధి కోసం ప్రభు త్వం రూ.284.5 కోట్లు విడుదల చేసిందని, డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కిషన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
ఏప్రిల్ 31 లోపు కొత్త రేషన్ కార్డులు: ఈటల
ఏప్రిల్ 31 లోపు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 4.06 లక్షల బోగస్ రేషన్ కార్డులను తొలగించామని చెప్పారు. కొత్త కార్డుల కోసం 2.56 లక్షల దరఖాస్తులొచ్చాయని.. వీటిలో 89,713 దరఖాస్తులు పరిశీలించి 77,000 మందిని అర్హులుగా తేల్చామన్నారు.
బోదకాలు బాధితులకు పెన్షన్: లక్ష్మారెడ్డి
బోదకాలు వ్యాధిగ్రస్తులకు నెలవారీ పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. బోదకాలు బాధితులకు సహాయం, బస్తీ దవాఖానాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బోదకాలు బాధితులు మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడుతున్నారని, ఈ దృష్ట్యా ఉపాధిహామీ కింద నిర్మించే మరుగుదొడ్లను వెస్ట్రన్ పద్ధతిలో నిర్మించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు.
కొత్తగూడెంలో అబ్కారీ కార్యాలయం: పద్మారావు
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అబ్కారీ శాఖ కార్యాలయం, బేవరేజెస్ కార్పొరేషన్ గోదాము నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. భవన నిర్మాణ నమూనాలు సిద్ధమయ్యాయని, బడ్జెట్ సమావేశాలు ముగియగానే తానే స్వయంగా వెళ్లి పనులు ప్రారంభిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment