sandra Venkata Veeraiah
-
TS Election 2023: సెంటిమెంట్ పాటించిన సండ్ర! మరోసారి వ్యాపారవేత్త ఇంటి నుంచే..
సాక్షి, ఖమ్మం: గత ఎన్నికల్లో మాదిరిగానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈసారి కూడా తనకు కలిసొస్తున్న సెంటిమెంట్‌ను పాటించారు. ప్రతీ ఎన్నికల్లో మండలం నుంచైతే రామానగరంలో, పట్టణంలోనైతే హనుమాన్‌నగర్ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం నుంచి పూజలు చేసి, వ్యాపారవేత్త వందనపు సత్యనారాయణ ఇంటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే రామానగరంలో ప్రచారం చేసిన సండ్ర... శుక్రవారం సత్తుపల్లిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. వ్యాపారి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి పట్టణంలోని పలు డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకటవీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కళ్ల ముందే కనిసిస్తున్న నేపథ్యాన మరోమారు తనను గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, నరుకుళ్ల మమత, వేములపల్లి పుష్పలత, దేవరపల్లి ప్రవీణ్, మేకల భవాని, మారుతి సూరిబాబు, వీరపనేని రాధిక, గుండ్ర రాఘవేందర్, ఎం.డీ.గఫార్‌ఖాన్, చల్లగుండ్ల కృష్ణయ్య, మల్లూరు అంకమరాజు, యోగానందం, అద్దాల మీరా, మాధురి మధు, వల్లభనేని పవన్ పాల్గొన్నారు. చదవండి: పాలేరులోనే పొంగులేటి! -
ఎమ్మెల్యే సండ్రకు తప్పిన ప్రమాదం
ఖమ్మంక్రైం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో శివాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఎమ్మెల్యే డ్రైవర్ పక్కనే ఉన్న కాల్వను గమనించకపోవటంతో వాహనం టైరు కాల్వలో ఇరుక్కుపోయింది. వాహనం ఒక పక్కకు ఒరిగి పోతుండగా డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించటంతో బోల్తా పడకుండా ఆగిపోయంది. వెంటనే సండ్ర, ఆయన గన్మెన్లు కిందకు దిగారు. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు అక్కడకు చేరుకొని వాహనాన్ని బయటకు తీసారు. ఆ సమయంలో గుడి ముందు ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ శివుడే తనకు ఎటువంటి ముప్పు కలిగించకుండా కాపాడాడని సండ్ర అంటూ కారెక్కి హైదరాబాద్ వెళ్లిపోయారు. -
టీఆర్ఎస్లోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల చేరిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే అంశం క్రిస్మస్ తర్వాతకు వాయిదా పడింది. సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడం, టీఆర్ఎస్ ప్రతిపాదనలపై కార్యకర్తలతో మాట్లాడేందుకు తనకు సమయం కావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరడంతో ఈ నెల 25 తర్వాతే ఈ అంశం కొలిక్కి రానుంది. పార్టీ మారే విషయంలో సండ్ర కొంత సానుకూల సంకేతాలిస్తున్నా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ససేమిరా అంటున్నారు! తాను పార్టీ మారే సమస్యే లేదంటూ ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యత తీసుకున్న టీఆర్ఎస్లోని ఓ కీలక నేత వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. టచ్‌లో సీఎం సన్నిహితుడు... అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే టీడీపీ నుంచి ఎవరూ ప్రమాణం చేయకుండా చూడాలన్న వ్యూహంతోనే టీఆర్ఎస్ ఈ ఆపరేషన్ చేపట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో చంద్రబాబు అండ్ కో ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతోనే సీఎం సన్నిహితుడు ఒకరు నేరుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. ఈ మేరకు సీఎం సన్నిహితుడి నుంచి తమ నాయకుడికి ఫోన్ వచ్చిందని సండ్ర అనుచరులు చెబుతున్నారు. అయితే సండ్రతోపాటు మెచ్చాను కూడా టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి అసెంబ్లీలో టీడీపీని అధికారికంగా టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న షరతు వారిద్దరి మధ్య చర్చల్లో వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మెచ్చా కూడా వస్తానంటేనే తాను కూడా పార్టీ మారే విషయంలో నిర్ణయం తీసుకుంటానని సండ్ర తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. సండ్ర సానుకూల సంకేతాలు... టీఆర్ఎస్ ప్రతిపాదనపై టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొంతన కుదరడం లేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుపై అంచనాకు వచ్చారని, అందుకే టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అందుకు ప్రతిఫలంగా సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం, హోదా కల్పించాలని సండ్ర కోరుకుంటున్నట్లు సమాచారం. హోదా దక్కితే ఇబ్బంది లేదని, లేదంటే తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని సన్నిహితులతో సండ్ర చెబుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. సండ్ర పార్టీ మారే అంశంపై నియోజకవర్గానికి చెందిన కీలక టీడీపీ నేతలు ఇప్పటికే పార్టీ కేడర్‌తో సానుకూల సంప్రదింపులు జరుపుతుండగా శనివారం సాయంత్రం సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సండ్ర ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీ మార్పు గురించి చర్చించారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ప్రతిపాదనల గురించి పార్టీ నేతలకు సండ్ర వివరించారని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే మంత్రి పదవి లభిస్తేనే పార్టీ మారే విషయం గురించి ఆలోచించాలని అనుచరులు సండ్రకు సూచించినట్లు సమాచారం. మరోవైపు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా టీడీపీని వీడేది లేదంటూ ఆయన చేత అనుచరులు బలవంతంగా చెప్పించి వాట్సాప్‌లో పెట్టినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే మెచ్చా స్వభావం రీత్యా కూడా నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జనలు పడే అవకాశముందని, అనివార్యమైతేనే ఆయన పార్టీ మారతారని మెచ్చా అనుచరులు చెబుతున్నారు. నేనింకా నిర్ణయం తీసుకోలేదు పార్టీ మారడం గురించి నేనింకా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని ప్రతిపాదనలపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. ఏదైనా క్రిస్మస్ తర్వాతే తేలుతుంది. నేను పార్టీ మారినా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశాన్ని అందరికీ చెప్పాకే ముందుకెళ్తా. దొంగచాటు రాజకీయాలు చేసే అవసరం నాకు లేదు. – ‘సాక్షి’తో సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారను.. టీడీపీ నుంచి నేను గెలిచాను. అదే రీతిలో పార్టీలో ఉంటానే తప్ప పార్టీ మారే సమస్యేలేదు. వదంతులు వస్తున్నాయి. వాటితో సంబంధం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎన్ని ఇబ్బందులున్నా.. నేను పార్టీలోనే ఉంటాను తప్ప మారే సమస్య లేదు – వాట్సాప్ వీడియోలో మెచ్చా నాగేశ్వరరావు -
ఇప్పుడు గుర్తుకొచ్చిందా : సండ్రా
సాక్షి, సత్తుపల్లి: ‘కొడుకు కోసం సిరిసిల్లా జిల్లాను చేశావ్. ఒక పద్ధతి లేదు. ఒక కమిటీ లేదు. సత్తుపల్లి జిల్లా చేయమంటే సీఎం కేసీఆర్ అపహాస్యంగా మాట్లాడారు. జిల్లాల పునర్వీభజన అశాస్త్రీయంగా జరిగింది. సత్తుపల్లికి పూర్వ వైభవం తగ్గింది. ఎన్నికలప్పుడు సత్తుపల్లి జిల్లా గుర్తుకు వచ్చిందా?’ అని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌లు ప్రశ్నించారు. సత్తుపల్లిలో మున్వర్ హుస్సేన్ నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉండి చేయలేని వాళ్లు.. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి మోసగించేందుకు వస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు సమన్వయంతో ఒకే పార్టీ వ్యవస్థలా పని చేస్తున్నాయన్నారు. సింగరేణి సంస్థ షేప్ నిధులు రూ.16 కోట్లు కేటాయిస్తే ప్రభావిత ప్రాంతాలైన ఎన్టీఆర్నగర్, వెంగళరావునగర్, కిష్టారం, కొమ్మేపల్లి, రేజర్లలో నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. భూ నిర్వాసితులకు పరిహారంలో చాలా అన్యాయం చేశారన్నారు. సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, సత్తుపల్లి అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా చేస్తామన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల్లో అలజడి సృష్టించి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోందని, ప్రజాకూటమి కార్యకర్తలు దేనికీ భయపడే ప్రశక్తే లేదన్నారు. ఇంటింటి ప్రచారంతో ఓటు బదలాయింపు వందశాతం జరిగేలా పని చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని.. దీని దోపిడీకి వ్యతిరేకమన్నారు. ఇంతకంటే మెరుగైన పథకాలను తీసుకొస్తామన్నారు. పరెడ్ల సత్యనారాయణరెడ్డి, కొర్రపాటి సాల్మన్‌రాజు, నున్నా రామకృష్ణ, గోళ్ల అప్పారావు, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేష్, మధు పాల్గొన్నారు. -
మాకు విపక్షమూ స్వపక్షమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేలను సైతం స్వపక్షంగానే భావిస్తూ పాలన సాగిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విశాల దృక్పథంతో పరిపాలన సాగిస్తున్నారని, గత ముఖ్యమంత్రులు వ్యవహరించినట్లుగా సంకుచిత మనస్తత్వం ప్రదర్శించడం లేదన్నారు. రాష్ట్రంలో కేవలం నలుగురి పాలనే నడుస్తోందని, కొందరికే పాలనాధికారాల వల్ల పరిపాలన దెబ్బతింటోందంటూ ఆదివారం అసెంబ్లీలో వివిధ పద్దులపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన విమర్శలను హరీశ్‌రావు తిప్పికొట్టారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. 1.5 కోట్ల చొప్పునే ఉండేవని, వాటిని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల మాత్రమే మంజూరు చేసేవారని హరీశ్‌రావు గుర్తుచేశారు. విపక్ష పార్టీ సభ్యులున్న చోట ఇన్చార్జి మంత్రి పేరిట, నియోజకవర్గ నేత పేరిట మంజూరు జరిగేదన్నారు. కానీ తమ ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి కూడా రూ. 3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తోందన్నారు. అలాగే ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో తలకెత్తుకున్న మిషన్ భగీరథ పథకాన్ని మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ చేపడుతున్నామన్నారు. ప్రతి గూడెం, గిరిజన తండా, గ్రామాల్లో అత్యంత వేగంగా పనులు సాగుతున్నాయన్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు కావాలని ఎమ్మెల్యేలు వేడుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రమంతటా ఒకటే పాలసీ. ప్రజలకు ఏం కావాలో సీఎంకు తెలుసని, రాష్ట్ర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. అక్కడా మిషన్ కాకతీయ.. మిషన్ కాకతీయ పథకంలోనూ విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఏయే నియోజకవర్గాల్లో చెరువుల పునరుద్ధరణను తొలుత ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను తాను అడగ్గా ప్రతిపక్ష ఎమ్మెల్యేలూ ఉద్యమకారులేనని, వారి నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా తెలంగాణ వాళ్లేనని చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 20 శాతం చెరువులను తీసుకుని అభివృద్ధి చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి జిల్లా కేంద్రం నుంచి డబుల్ రోడ్డు వేయమని సీఎం చెప్పారని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో 31 లక్షల పెన్షన్లు ఉంటే ఇప్పుడు 41 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని హరీశ్ వెల్లడించారు. పక్క రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వాలంటే టీడీపీ నేతలే సభ్యులుగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు కావాల్సిన వాళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తున్న విషయాన్ని సండ్ర వెంకట వీరయ్య గ్రహించాలని సూచించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా విమర్శించాలనుకోవడం సరి కాదన్నారు. గుర్తింపు కోసమే ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెట్టి పత్రికలకు ఇస్తున్న ప్రకటనలపై వివరణ ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, సీపీఎం డిమాండ్‌పైనా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తెలియజేసేందుకే ప్రకటనలు ఇస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలోనూ తమ ప్రభుత్వం దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా మొదటిసారిగా కార్పొరేట్ స్థాయిలో వైద్య చికిత్సలు అందించేందుకు 8,535 మంది జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, 16,793 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశామని, 16,492 మందికి ప్రమాద బీమా కింద రూ. 5 లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. ఏటా జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 34.50 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కాగా, న్యాయశాఖ, సమాచార, సాధారణ పరిపాలన విభాగంతోపాటు పలు పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్సోళ్లది జిల్లాకో మాట ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే.. అవి పూర్తికాకుం డా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని హరీశ్‌రావు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పై కాంగ్రెస్ నేతలు జిల్లాకో రీతిగా మా ట్లాడుతున్నారని.. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులేసి ప్రాజెక్టులు అడ్డుకుంటే.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తు న్నారని దుయ్యబట్టారు. ఆదివారం అసెంబ్లీలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని చంద్రసాగర్.. నల్లగొండ జిల్లాలోని పిల్లా యిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగానీ కాలువల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘60 ఏళ్లలో ఎప్పూడూ లేని విధంగా సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు సాగునీరిచ్చాం. అందోల్, పుల్కల్ మండలాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వారు తిరిగి గ్రామాలకు వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటికి కొదవలేదని రైతులు అంటున్నారు. వలసపోయిన ప్రజలు కేసీఆర్ పాలనలో వాపస్ వస్తున్నారు’ అని వివరించారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగానీ కాలువ అభివృద్ధి కోసం ప్రభు త్వం రూ.284.5 కోట్లు విడుదల చేసిందని, డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కిషన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఏప్రిల్ 31 లోపు కొత్త రేషన్ కార్డులు: ఈటల ఏప్రిల్ 31 లోపు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 4.06 లక్షల బోగస్ రేషన్ కార్డులను తొలగించామని చెప్పారు. కొత్త కార్డుల కోసం 2.56 లక్షల దరఖాస్తులొచ్చాయని.. వీటిలో 89,713 దరఖాస్తులు పరిశీలించి 77,000 మందిని అర్హులుగా తేల్చామన్నారు. బోదకాలు బాధితులకు పెన్షన్: లక్ష్మారెడ్డి బోదకాలు వ్యాధిగ్రస్తులకు నెలవారీ పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. బోదకాలు బాధితులకు సహాయం, బస్తీ దవాఖానాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బోదకాలు బాధితులు మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడుతున్నారని, ఈ దృష్ట్యా ఉపాధిహామీ కింద నిర్మించే మరుగుదొడ్లను వెస్ట్రన్ పద్ధతిలో నిర్మించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. కొత్తగూడెంలో అబ్కారీ కార్యాలయం: పద్మారావు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అబ్కారీ శాఖ కార్యాలయం, బేవరేజెస్ కార్పొరేషన్ గోదాము నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. భవన నిర్మాణ నమూనాలు సిద్ధమయ్యాయని, బడ్జెట్ సమావేశాలు ముగియగానే తానే స్వయంగా వెళ్లి పనులు ప్రారంభిస్తానని చెప్పారు. -
మంత్రులనూ మాట్లాడనివ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్షాలనే కాదు మంత్రులను కూడా మాట్లాడనివ్వడం లేదని టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలోని మీడియాపాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మాట్లాడనివ్వకుండా మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, భూసేకరణపై రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీకి అవకాశం ఇవ్వకుండా నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడరని పేర్కొన్నారు. హరితహారంపై అటవీశాఖమంత్రి జోగు రామన్న, రోడ్లు, వంతెనలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, చేపల పెంపకంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మాట్లాడనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడరని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుదామంటే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లే త్రీమాన్ షోను నడిపిస్తున్నారని ఆరోపించారు.