సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే అంశం క్రిస్మస్ తర్వాతకు వాయిదా పడింది. సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడం, టీఆర్‌ఎస్ ప్రతిపాదనలపై కార్యకర్తలతో మాట్లాడేందుకు తనకు సమయం కావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరడంతో ఈ నెల 25 తర్వాతే ఈ అంశం కొలిక్కి రానుంది. పార్టీ మారే విషయంలో సండ్ర కొంత సానుకూల సంకేతాలిస్తున్నా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ససేమిరా అంటున్నారు! తాను పార్టీ మారే సమస్యే లేదంటూ ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యత తీసుకున్న టీఆర్‌ఎస్‌లోని ఓ కీలక నేత వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.
టచ్‌లో సీఎం సన్నిహితుడు...
అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే టీడీపీ నుంచి ఎవరూ ప్రమాణం చేయకుండా చూడాలన్న వ్యూహంతోనే టీఆర్‌ఎస్ ఈ ఆపరేషన్ చేపట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో చంద్రబాబు అండ్ కో ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతోనే సీఎం సన్నిహితుడు ఒకరు నేరుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. ఈ మేరకు సీఎం సన్నిహితుడి నుంచి తమ నాయకుడికి ఫోన్ వచ్చిందని సండ్ర అనుచరులు చెబుతున్నారు. అయితే సండ్రతోపాటు మెచ్చాను కూడా టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి అసెంబ్లీలో టీడీపీని అధికారికంగా టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న షరతు వారిద్దరి మధ్య చర్చల్లో వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మెచ్చా కూడా వస్తానంటేనే తాను కూడా పార్టీ మారే విషయంలో నిర్ణయం తీసుకుంటానని సండ్ర తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం.
సండ్ర సానుకూల సంకేతాలు...
టీఆర్‌ఎస్ ప్రతిపాదనపై టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొంతన కుదరడం లేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుపై అంచనాకు వచ్చారని, అందుకే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అందుకు ప్రతిఫలంగా సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం, హోదా కల్పించాలని సండ్ర కోరుకుంటున్నట్లు సమాచారం. హోదా దక్కితే ఇబ్బంది లేదని, లేదంటే తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని సన్నిహితులతో సండ్ర చెబుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. సండ్ర పార్టీ మారే అంశంపై నియోజకవర్గానికి చెందిన కీలక టీడీపీ నేతలు ఇప్పటికే పార్టీ కేడర్‌తో సానుకూల సంప్రదింపులు జరుపుతుండగా శనివారం సాయంత్రం సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సండ్ర ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీ మార్పు గురించి చర్చించారు. ఈ భేటీలో టీఆర్‌ఎస్ ప్రతిపాదనల గురించి పార్టీ నేతలకు సండ్ర వివరించారని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే మంత్రి పదవి లభిస్తేనే పార్టీ మారే విషయం గురించి ఆలోచించాలని అనుచరులు సండ్రకు సూచించినట్లు సమాచారం. మరోవైపు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా టీడీపీని వీడేది లేదంటూ ఆయన చేత అనుచరులు బలవంతంగా చెప్పించి వాట్సాప్‌లో పెట్టినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే మెచ్చా స్వభావం రీత్యా కూడా నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జనలు పడే అవకాశముందని, అనివార్యమైతేనే ఆయన పార్టీ మారతారని మెచ్చా అనుచరులు చెబుతున్నారు.
నేనింకా నిర్ణయం తీసుకోలేదు
పార్టీ మారడం గురించి నేనింకా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని ప్రతిపాదనలపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. ఏదైనా క్రిస్మస్ తర్వాతే తేలుతుంది. నేను పార్టీ మారినా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశాన్ని అందరికీ చెప్పాకే ముందుకెళ్తా. దొంగచాటు రాజకీయాలు చేసే అవసరం నాకు లేదు. – ‘సాక్షి’తో సండ్ర వెంకటవీరయ్య
పార్టీ మారను..
టీడీపీ నుంచి నేను గెలిచాను. అదే రీతిలో పార్టీలో ఉంటానే తప్ప పార్టీ మారే సమస్యేలేదు. వదంతులు వస్తున్నాయి. వాటితో సంబంధం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎన్ని ఇబ్బందులున్నా.. నేను పార్టీలోనే ఉంటాను తప్ప మారే సమస్య లేదు – వాట్సాప్ వీడియోలో మెచ్చా నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment