మంత్రులనూ మాట్లాడనివ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్షాలనే కాదు మంత్రులను కూడా మాట్లాడనివ్వడం లేదని టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలోని మీడియాపాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మాట్లాడనివ్వకుండా మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, భూసేకరణపై రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీకి అవకాశం ఇవ్వకుండా నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడరని పేర్కొన్నారు.
హరితహారంపై అటవీశాఖమంత్రి జోగు రామన్న, రోడ్లు, వంతెనలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, చేపల పెంపకంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మాట్లాడనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడరని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుదామంటే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లే త్రీమాన్ షోను నడిపిస్తున్నారని ఆరోపించారు.