అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం
నల్లమల నుంచి క్రూరమృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చా..
అయ్య పేరు మీదనో, మామ పేరు మీదనో వచి్చనవాడిని కాదు
వ్యక్తిగత కోపతాపాలు చూపవద్దని ఇంతకాలం ఓపికతో ఉన్నా..
నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూ తప్పుదారి పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను నల్లమల నుంచి వచ్చా. క్రూరమృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చా. తొక్కుకుంటూ వచ్చా. ఇక్కడున్నోళ్లను తొక్కితే అక్కడ తేలిన్రు. నేను అయ్య పేరుమీదనో, మామ పేరుమీదనో వచి్చనోడిని కాదు. స్వశక్తిని నమ్ముకొని పైకొచ్చినవాడ్ని. అమెరికాలోనో, గుంటూరులోనో చదువుకున్న చావు తెలివితేటలు వాళ్లకుంటే ఉండొచ్చు. నాకు సామాన్యుడి తెలివితేటలు ఉన్నాయి. నా వ్యక్తిగత కోపతాపాలు చూపవద్దని ఇంతకాలం ఓపికతో ఉన్నా.
ఈ ఆర్థిక విధ్వంసకారులను నియంత్రించే శక్తి, క్రూరమృగాలను కూడా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉంది’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు రేవంత్ మాటల్లోనే...
‘‘తెలంగాణపై కమిట్‌మెంట్ ఉన్నోళ్లు కూడా కొందరు అటువైపు ఉన్నారు. వారికి చెప్తున్నా.. దొంగలకు సద్దులు మోసేవాళ్ల సావాసం మంచిది కాదు. వాళ్లు ఇదే నగరంలో పుట్టినవారు. హైదరాబాద్ కూడా Éఢిల్లీలా కాలుష్యం కోరల్లో చిక్కుకోవాలా? నల్లగొండకు ఫ్లోరైడ్ నుంచి మోక్షం వద్దా? బావాబామ్మర్దులిద్దరూ రండి. నల్లగొండకో, రంగారెడ్డికో, భువనగిరికో, మునుగోడుకో, ఎల్‌బీనగర్‌కో, సూర్యాపేటకో పోదాం. మూసీ పునరుజ్జీవం చేయాలా? వద్దా? ప్రజలను అడుగుదాం. నేను, రాజగోపాల్‌రెడ్డి గన్‌మన్ లేకుండా వస్తాం. మీరూ రండి. జనం మధ్యనే తేల్చుకుందాం.
వాళ్లలా ఇస్తే ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం..
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు భరోసాకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే రైతుబంధు కేవలం పెట్టుబడి సహాయ పథకం మాత్రమే. ఆ రూపంలో రూ.72,816 కోట్లు ఇస్తే.. అందులో రూ.22,606 కోట్లు సాగులోనే లేని రాళ్లురప్పలకు, గుట్టలకు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమల స్థలాలకు ఆయాచితంగా చెల్లించారు. గిరిజనులకు అందించిన పోడు భూములకు బీఆర్‌ఎస్ నేతలు నకిలీ పట్టాలు రూపొందించి రైతుబంధు పొందారు. ఇప్పుడు మేం కూడా అలా చెల్లించాలంటూ బీఆర్‌ఎస్ నేతలు నీతులు చెప్తున్నారు.
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం కదా. ఇక వారి నేత ఆయన చేసిన అద్భుతాలపై ప్రశి్నస్తారన్న భయంతో సభకే రావడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు ఆయన. ఉపాధ్యక్షుడు.. అదే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పారు. ఇక వారు చేసిన రుణమాఫీ వడ్డీలకే మాత్రమే సరిపోయింది. అదికూడా ఔటర్ రింగురోడ్డును తెగనమ్మి రూ.7,500 కోట్లు తెచ్చి రుణమాఫీకి వాడేశారు. మేం కేవలం 27 రోజుల్లో రూ.17,869.21 కోట్లు రుణమాఫీ చేశాం. సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికోసం నవంబర్‌లో రూ.2,747 కోట్లు విడుదల చేశాం. మొత్తం 25,35,963 మందికి రూ.20,616 కోట్లు మాఫీ చేసి వారి రుణం తీర్చుకున్నాం.
స్విస్ బ్యాంకు కూడా అప్పులిస్తారు..
రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేం. రూ.8 వేల కోట్లు కావాలి. మా దగ్గర నల్లధనం లేదు అని నాటి సీఎం అన్నారు. నల్లధనం ప్రభుత్వం వద్ద లేదేమోగానీ వారి వద్ద ఎందుకుండదు? అంతా అక్కడికే కదా చేరింది. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే సామర్థ్యం వాళ్లది.
ఆయన కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా..
గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.7,11,807 కోట్లు. మేం అధికారంలోకి వచ్చాక రూ. 1,27,208 కోట్లు అప్పు చేశామంటున్నారు. రెండూ కలిపితే దాదాపు 8.39 లక్షల కోట్లు కావాలి. రెండు రోజుల క్రితం తీసుకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు మొత్తం రూ.7,22,788 కోట్లే. 58 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లే. గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిల భారం లేకపోతే.. మేం అద్భుతాలు సృష్టించి ఉండేవాళ్లం. గత పదేళ్లలో కనీసం హాస్టళ్లకు భవనాలు కూడా కట్టలేకపోయారు. దీనిపై ముక్కు నేలకు రాసి దళిత, గిరిజన, మైనారిటీ పిల్లలకు క్షమాపణ చెప్పాలి. ముఖం చాటేస్తున్న ఆయన సభకు వస్తే అడిగి, కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నా.
అన్నీ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా?
నా ప్రాంతం కాకున్నా కొడంగల్‌లో ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడే మళ్లీ గెలిచి సీఎం అయ్యా. ఆ వెనకబడ్డ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నా, పరిశ్రమలు తేవాలని నిర్ణయించా. ఓ 50 వేల మందికి ఉద్యోగాలు రావటంతోపాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనుకున్నా. దీన్ని సహించలేని కొందరు డబ్బు, మద్యం పంచి అధికారులపై దాడులు చేయించారు. మూసీ వద్దంటారు, మెట్రో పొడిగిస్తామంటే వద్దంటారు, ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, పరిశ్రమలు వద్దంటారు.. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించడం ఎలా సాధ్యం. తెలంగాణ పురోగతిని అడ్డుకునే వాళ్లను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment