సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అధినేత కేసీఆర్ సూచించిన వారికే జెడ్పీ చైర్మన్ పదవి దక్కనుండటంతో సీఎం ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుపై టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలుండగా, ఇప్పటికే మాక్లూర్ జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 26 స్థానాలకు ఎన్నికలు జరగగా, మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ రేసులో నలుగురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు, ఇందల్వాయి జెడ్పీటీసీగా బరిలో నిలిచిన జెడ్పీవైస్ చైర్‌పర్సన్ సుమన రవిరెడ్డి, ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేసిన బాజిరెడ్డి జగన్, బోధన్ జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన గిర్దావార్ లక్ష్మి పేర్లు తెరపైకి వచ్చాయి. నేడు వెలువడనున్న ఫలితాలను బట్టి గెలుపొందిన వారిలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే అన్ని
నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు చైర్మన్ ఎన్నికపై సంకేతాలు అందాయి. విజయం సాధించిన జెడ్పీటీసీలతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. చైర్మన్‌తో పాటు, జెడ్పీ వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు అన్నీ అధిష్టానం సూచనల మేరకు జరగనున్నాయి.
క్యాంపు రాజకీయాలకు అవకాశం..?
చైర్మన్ పీఠంపై కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. అవకాశం వస్తే గెలుపొందే ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి పీఠం దక్కించుకునే యోచనలో ఆ పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏకపక్షంగా ఉన్నట్లయితే క్యాంపులకు అవకాశం ఉండదు. కానీ ఆయా పార్టీలకు మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త అటు ఇటుగా ఫలితాలు వచ్చిన పక్షంలో క్యాంపు రాజకీయాలకు తెరలేవనుంది. మొత్తం ఇప్పటికే జెడ్పీటీసీ అభ్యర్థులు సోమవారం నగరంలోని పలు హోటళ్లలో బస చేశారు. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలుండగా, చైర్మన్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 జెడ్పీటీసీ స్థానాలు గెలవాల్సి ఉంది. అంటే చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థికి 13 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
అధికారుల ముందు జాగ్రత్త..
మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఈనెల 8న, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఈనెల 7న నిర్వహించనున్నారు. మధ్యలో మూడు, నాలుగు రోజులే సమయం ఉంటుంది. విజయం సాధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్యాంపునకు తరలివెళ్లే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, ఎంపీపీ ఎన్నికకు సంబంధించిన నోటీసులు ఇచ్చాకే.., వారు గెలుపొందినట్లు సర్టిఫికేట్ ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉన్నారు. లేనిపక్షంలో వారు క్యాంపునకు తరలివెళితే నోటీసులు ఇవ్వడం ఇబ్బందిగా మారనుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
సమన్వయ బాధ్యతలు మంత్రికి..
జెడ్పీ చైర్మన్ ఎంపిక ప్రక్రియ సమన్వయ బా ధ్యతలను జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. రాష్ట్రంలో అన్ని జెడ్పీలను కైవ సం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్న ఆ పార్టీ ఈ మేరకు ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జిని ని యమించింది. ఇన్‌చార్జులను ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయించే వారిని చైర్మన్‌గా గెలిపించుకునేందుకు మిగితా జెడ్పీటీసీలను సమన్వయం చేసే బాధ్యతలను ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment