సమ ఉజ్జీల సమరం
కావలి మల్లేశం, పరిగి: ఐదుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంత్రి పదవికి మాత్రం నోచుకోలేకపోయారు. ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఎలాగైనా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్, సుదీర్ఘకాలంగా నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రం గానే ఉండడం, సహజంగా వచ్చే వ్యతిరేకత, ఆయనకు సవాలుగా మారనున్నాయి.
వైఎస్ పథకాలే అస్త్రాలుగా...
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రచారాస్త్రంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి ముందుకువెళ్తున్నారు. గతంలో పూడూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా సేవలందించిన ఆయనకు మంచి పేరు ఉంది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న నినాదంతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. వైఎస్ హయాంలో ఇంటింటికి చేరిన సంక్షేమ ఫలాలే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు.
మోడీ హవాపై నమ్మకంతో బీజేపీ
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టిన కమతం రాంరెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరుసగా ఓటమి పాలయిన ఆయన పునర్ వైభ వం కోసం కష్టపడుతున్నారు. టీడీపీతో పొత్తు, కాంగ్రెస్‌లో తనవర్గం మద్దతు తనకు కలిసి వస్తుందనే ఆశతో ఉన్నారు. మోడీ గాలి గట్టెక్కిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు.
గెలుపుపై కన్నేసిన కాంగ్రెస్
గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన టి.రామ్మోహన్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి పాలైనా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఆయన ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
టీడీపీ ఓట్లు చీల్చేవారికే..
తొలినాళ్లలో గురుశిష్యులైన కమతం రాంరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన కొప్పుల, టీడీపీతో పొత్తుతో బరిలోకి దిగిన రాంరెడ్డి టీడీపీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతిస్తున్నారు. ఎవరు ఎక్కువగా టీడీపీ ఓట్లను చీల్చుకుంటారనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయంటున్నారు. బీసీ ఓటర్లతోపాటు28వేలమంది కొత్త ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.
జన తెలంగాణ
సంస్కృతి పరిరక్షించాలి...
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలి. తెలంగాణ కోసం పోరాడిన వారి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. పాఠ్య పుస్తకాలను రూపొం దించడంలో మేధావులు, విషయ నిపుణులకు అవకాశం కల్పించాలి. సకలజనుల సమ్మెకు చిరస్థాయి గుర్తింపు లభించేలా చూడాలి. అన్ని వర్గాల వారి సుభిక్షంగా ఉండేలా తెలంగాణ నిర్మాణం జరగాలి.
- కే. రాజేశ్వర్, భీమ్‌గల్, నిజామాబాద్ జిల్లా
ఉద్యోగులకు నెల బోనస్...
తెలంగాణ కోసం జరిగిన తొలిదశ, మలిదశ పోరాటాల్లో ఉద్యోగులదే కీలక పాత్ర. 42 రోజుల సకల జనుల సమ్మెతోనే కేంద్రంలో కదలిక వచ్చింది. ఆప్షన్లు ఇవ్వకుండా ఉద్యోగుల సర్వీసు రికార్డు ఆధారంగా బదిలీలు చేయాలి. 20 శాతం నాన్‌లోకల్‌గా నియమితులైన జిల్లా క్యాడర్ ఉద్యోగులను సొంత రాష్ట్రాలకే పంపాలి. జూన్2న రాష్ట్ర అవతరణ సందర్భంగా ఒక నెల బోనస్ ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలి.
- జానపాటి శ్రీనివాస్, మిర్యాలగూడ, నల్లగొండ
సమాన అభివృద్ధి...
తెలంగాణ లోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. రోడ్లు, రైల్వేల విస్తరణతో పాటు అన్ని జిల్లా కేంద్రాలకు విమానయాన సౌకర్యాన్ని కల్పించాలి. పారిశ్రామిక అభివృద్దికి చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను కల్పించాలి. కొత్త విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఇమ్మిడిశెట్టి దేవేందర్, వరంగల్