koppula harishwar reddy
-
బీఆర్ఎస్లో విషాదం.. మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(76) కన్నుమూశారు. శ్వాస సరిగ్గా ఆడక కార్డియాక్ అరెస్ట్ అయి హరీశ్వర్ రెడ్డి మృతి చెందారు. వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు. ఇక, హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి సీఎం సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సీఎం కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
పరిగి అభివృద్ధికి నిధులివ్వండి
పరిగి వికారాబాద్ : నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు , మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈమేరకు బుధవారం ఆయన ఐటీశాఖ మంత్రిని హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి పలు అంశాలు చర్చించారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోని పలు సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, నిధుల కేటాయింపుకు హామీ ఇచ్చారని హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. -
ఈసీని తప్పుదోవ పట్టించిన పరిగి ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా: ఎన్నికల వ్యయం నమోదులో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్) ఎలక్షన్ కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26 నాటికీ రూ.22.15 లక్షలు ఖర్చు చేసినట్లు స్వయంగా టీఆర్ఆర్ రికార్డు చేశారని, చేవెళ్లలో సోనియా సభ ప్రచార ఖర్చు రూ.14.30 లక్షలు కూడా జమ చేయడంతో ఆయన నిర్దేశిత ఎన్నికల వ్యయాన్ని మించిపోయారన్నారు. సోనియా ప్రచార వ్యయం తన ఖాతాలో చూపరనే ధీమాతో రామ్మోహన్‌రెడ్డి పోలింగ్‌కు మూడు రోజుల ముందు రూ.22 లక్షలు ఖర్చయినట్లు పేర్కొన్నారని, దీన్ని ధ్రువపరుస్తూ రిటర్నింగ్ అధికారి సంతకం చేశారని అన్నారు. ఊహించని రీతిలో సోనియా ప్రచార ఖర్చు కూడా జమ కావడంతో రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపించారు. -
ఆశల పల్లకిలో..
డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి: తాను గెలిచీ.. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం ఎక్కవచ్చన్న ఆశ ఒకరిది. చట్టసభల్లో అడుగిడాలన్న వాంఛ మరొకరిది. కలగా మారిన మంత్రి పదవులను దక్కించుకోవాలనే ఆకాంక్ష ఇంకో ఇద్దరిది. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల బరిలో ఉన్న ఆ నలుగురికి ప్రస్తుత ఎన్నికలు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ తరఫున పరిగిలో పోటీ చేస్తున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, తాండూరు నుంచి పోటీచేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థులుగా ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బరిలో ఉన్న ఆర్.కష్ణయ్య, తీగల కృష్ణారెడ్డిలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే ఈ పోరులో విజయం కోసం వారు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు. పరిగి.. మంత్రి పదవిపై గురి రెండు దశాబ్ధాలుగా ఓటమెరుగని హరీశ్వర్‌రెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. మంత్రి పదవి కలగానే మారింది. చ ంద్రబాబు సర్కారులో డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే కేబినెట్ బెర్త్ ఖాయమని భావిస్తున్న ఆయన జోరుగా ప్రచారం చేస్తూప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ఓట్ల చీలికతో ప్రజావ్యతిరేకత నుంచి గట్టెక్కుతాననే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున టి.రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కమతం రాంరెడ్డిలు హరీశ్వర్‌కు పోటీ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి కూడా నిర్ణయాత్మక శక్తిగా మారడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒకప్పుడు తనకు కుడిభుజంగా ఉన్న రుక్మారెడ్డి ప్రత్యర్థిగా బరిలో దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలంటున్న హరీశ్వర్ గెలిస్తే వుంత్రి కావాలన్న కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నారు. తాండూరు.. పార్టీ మారినా.. రాత మారేనా? తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ముందే పసిగట్టిన తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరారు. మంత్రి కావాలనే కోరిక టీఆర్ఎస్తో నెరవేరుతుందని భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులు తన వెంట రాకపోవడంతో విజయం కోసం శ్రమించాల్సిన వస్తోంది. ఎం.నారాయణరావు (కాంగ్రెస్), ప్రభుకుమార్(వైఎస్సార్ సీపీ), ఎం.నరేశ్(టీడీపీ) బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఉద్యమకాలంలో ఉద్యోగులతో ఘర్షణ పడ్డ ఆయనను అప్పట్లో టీజేఏసీ తెలంగాణ ద్రోహిగా పేర్కొనడం ఇబ్బందికరంగా మారింది. నానాటికీ ప్రజల మద్దతు కూడగట్టుకంటున్న ప్రభుకుమార్‌పై తాజాగా దాడి చేయించడం వ్యతిరేకతను పెంచుతోంది. మహేశ్వరం.. ఒక్క ఛాన్స్! శాసనసభలో అడుగిడాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకునేందుకు తీగల కృష్ణారెడ్డి చెమటోడుస్తున్నారు. 1989,1996లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి, 2009లో మహేశ్వరం అసెంబ్లీకి టీడీపీ తరుఫున బరిలో దిగిన ఆయనకు పరాభవమే ఎదురైంది. తాజాగా మరోసారి మహేశ్వరం నుంచి అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరున్న కృష్ణారెడ్డికి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గతంలో తనకు దక్కాల్సిన మలక్‌పేట టీడీపీ టికెట్టును ఎగురేసుకుపోయిన మల్రెడ్డి రంగారెడ్డి(కాంగ్రెస్)తో హోరాహోరీగా తలపడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా రంగారెడ్డికి బీ ఫారం ఇచ్చి సీపీఐకి షాక్ ఇచ్చిం ది. సీపీఐతో పెద్దగా పోటీ ఉండదని భావిం చిన తీగలకు కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో దిమ్మ తిరిగింది. మరోవైపు ఈసా రి ఎన్నికలకు దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఎంపీగా బరిలో దిగిన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఇక్కడి నుంచి మంచి మెజార్టీ తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులను సబితాఇంద్రారెడ్డి తమవైపు తిప్పుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. దీంతో ఇక్కడ పోటీ టీడీపీ-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా నెలకొంది. సొంత మండలమైన సరూర్నగర్పై గంపెడాశలు పెట్టుకున్న కృష్ణారెడ్డి తాడోపేడో తేల్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎల్బీనగర్.. ఒత్తిడిలో సీఎం అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధికారికంగా ప్రకటించిన ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన వర్గాల కోసం ప్రజాక్షేత్రంలో పోరాడిన ఆయన తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యమ బాట వీడి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి పెరిగింది. కొంచెం అటూ ఇటూ అయినా ఇన్నేళ్ల ఉద్యమ జీవితంలో సంపాదించుకున్న ప్రతిష్ట మసకబారుతుందని భావిస్తున్నారు. స్థానికేతరుడైన ఆయనను ఇక్కడ పోటీకి దింపడంపై మండిపడ్డ ‘దేశం’ శ్రే ణులు నామినేషన్ రోజే దాడికి దిగాయి. పలువురు సీనియర్ టీడీపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఆయునకు ప్రతికూలంగా మారింది. సొంత పార్టీ నేతలను బుజ్జగించడం కత్తిమీద సామైంది. కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ ఆయనమీద పోటీలో ఉన్నారు. -
సమ ఉజ్జీల సమరం
కావలి మల్లేశం, పరిగి: ఐదుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంత్రి పదవికి మాత్రం నోచుకోలేకపోయారు. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఎలాగైనా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్, సుదీర్ఘకాలంగా నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రం గానే ఉండడం, సహజంగా వచ్చే వ్యతిరేకత, ఆయనకు సవాలుగా మారనున్నాయి. వైఎస్ పథకాలే అస్త్రాలుగా... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రచారాస్త్రంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి ముందుకువెళ్తున్నారు. గతంలో పూడూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా సేవలందించిన ఆయనకు మంచి పేరు ఉంది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న నినాదంతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. వైఎస్ హయాంలో ఇంటింటికి చేరిన సంక్షేమ ఫలాలే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. మోడీ హవాపై నమ్మకంతో బీజేపీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టిన కమతం రాంరెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరుసగా ఓటమి పాలయిన ఆయన పునర్ వైభ వం కోసం కష్టపడుతున్నారు. టీడీపీతో పొత్తు, కాంగ్రెస్‌లో తనవర్గం మద్దతు తనకు కలిసి వస్తుందనే ఆశతో ఉన్నారు. మోడీ గాలి గట్టెక్కిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. గెలుపుపై కన్నేసిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన టి.రామ్మోహన్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి పాలైనా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఆయన ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీ ఓట్లు చీల్చేవారికే.. తొలినాళ్లలో గురుశిష్యులైన కమతం రాంరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన కొప్పుల, టీడీపీతో పొత్తుతో బరిలోకి దిగిన రాంరెడ్డి టీడీపీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతిస్తున్నారు. ఎవరు ఎక్కువగా టీడీపీ ఓట్లను చీల్చుకుంటారనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయంటున్నారు. బీసీ ఓటర్లతోపాటు28వేలమంది కొత్త ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. జన తెలంగాణ సంస్కృతి పరిరక్షించాలి... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలి. తెలంగాణ కోసం పోరాడిన వారి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. పాఠ్య పుస్తకాలను రూపొం దించడంలో మేధావులు, విషయ నిపుణులకు అవకాశం కల్పించాలి. సకలజనుల సమ్మెకు చిరస్థాయి గుర్తింపు లభించేలా చూడాలి. అన్ని వర్గాల వారి సుభిక్షంగా ఉండేలా తెలంగాణ నిర్మాణం జరగాలి. - కే. రాజేశ్వర్, భీమ్‌గల్, నిజామాబాద్ జిల్లా ఉద్యోగులకు నెల బోనస్... తెలంగాణ కోసం జరిగిన తొలిదశ, మలిదశ పోరాటాల్లో ఉద్యోగులదే కీలక పాత్ర. 42 రోజుల సకల జనుల సమ్మెతోనే కేంద్రంలో కదలిక వచ్చింది. ఆప్షన్లు ఇవ్వకుండా ఉద్యోగుల సర్వీసు రికార్డు ఆధారంగా బదిలీలు చేయాలి. 20 శాతం నాన్‌లోకల్‌గా నియమితులైన జిల్లా క్యాడర్ ఉద్యోగులను సొంత రాష్ట్రాలకే పంపాలి. జూన్2న రాష్ట్ర అవతరణ సందర్భంగా ఒక నెల బోనస్ ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలి. - జానపాటి శ్రీనివాస్, మిర్యాలగూడ, నల్లగొండ సమాన అభివృద్ధి... తెలంగాణ లోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. రోడ్లు, రైల్వేల విస్తరణతో పాటు అన్ని జిల్లా కేంద్రాలకు విమానయాన సౌకర్యాన్ని కల్పించాలి. పారిశ్రామిక అభివృద్దికి చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను కల్పించాలి. కొత్త విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. - ఇమ్మిడిశెట్టి దేవేందర్, వరంగల్ -
సర్పంచ్ పదవే సంతృప్తినిచ్చింది
పరిగి, న్యూస్‌లైన్: ‘ధన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికలు రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా జరగాలి.. అప్పుడే ప్రజలకు పారదర్శక పాలన చేరువవుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలు మొదలుకుని చట్టసభల ఎన్నికల వరకూ వ్యాపార ధోరణి ప్రబలుతోంది. ఇది బాధాకరం. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలు బాగా కాస్ట్లీ అయ్యాయి. అభ్యర్థులు గెలిచాక కూడా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. అభివృద్ధి పనులు సైతం నా వారు.. నీ వారు అంటూ విభజన చేస్తున్నారు. ఈ కుసంస్కృతి కారణంగా.. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలు సైతం కుట్రలు, కుతంత్రాలతో కుళ్లిపోతున్నాయి’ అని పరిగి పంచాయతీ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్, సర్పంచ్, సమితి ప్రెసిడెంట్‌గా తన రాజకీయ ప్రస్థానంలో అంచలంచెలుగా ఎదిగి.. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రస్తుత పరిగి శాసనసభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నేటి రాజకీయాలు, ఎన్నికలపై ‘న్యూస్‌లైన్’తో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు.. రూ.5 వేలతో సర్పంచ్‌నయ్యాను.. 1972 నుంచి 77 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా ఆ తర్వాత 1977 నుంచి 83 వరకు సర్పంచ్‌గా పనిచేశాను. మొదటిసారి సర్పంచ్‌గా గెలిచినప్పుడు నామినేషన్ ఫీజు తప్ప ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఫలానా హరీశ్వర్‌రెడ్డి అయితే బాగుంటుందని పెద్దలంతా కలిసి నన్ను ఎన్నికల బరిలో నిలబెట్టారు. వారే గెలిపించారు. రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికైనప్పుడు చాయ్, బిస్కెట్లు.. నామినేషన్లకు కోసం రూ. 10 వేల వరకు ఖర్చు పెట్టాం. మొదటిసారిగా 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లక్షలోపే ఖర్చయ్యింది. అదికూడా డబ్బులు పంచేందుకు కాదు. చిన్నాచితకా ఖర్చులకే. అప్పట్లో ఎక్కువ శాతం ఎన్నికలు ఏకగ్రీవమే అయ్యేవి. పెద్దలే ఒకర్ని నిర్ణయిస్తే గ్రామస్తులంతా వారినే ఎన్నుకునేవారు. ఇప్పుడు చిన్నచిన్న పంచాయతీలకు సైతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మేజర్ పంచాయతీలకైతే రూ.10- 20 లక్షలు ఖర్చు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే ఎన్నికలకైతే రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వాళ్లు గెలిచింది మొదలు ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలని ఆరాటపడుతూ పనులు చేయటం మానేసి డబ్బుల సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారు. మార్పు రావాలి.. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి, అంతకుముందు డిప్యూటీ స్పీకర్ తదితర పదవుల కంటే పరిగికి సర్పంచ్‌గా చేసిన రోజుల్లోనే ఎక్కువ సంతృప్తి చెందాను. నిష్పక్షపాతంగానే ప్రజలు నన్ను గెలిపించారు. అభివృద్ధి పనులు సైతం అలాగే చేశాను. అందరు తెలిసినవారే. వారికి పనులు చేయటం ఎంతో తృప్తిగా ఉండేది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు ఉండేవి కావు. ఎన్నుకునే సమయంలో ఎవరూ ఏదీ ఆశించే వారు కాదు.. గెలిచాక పనులు కూడా అలాగే చేసే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. రాజకీయాల్లో, ఎన్నికల్లో మార్పు రావాల్సిన అవసరముంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ. -
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ పునర్నిర్మాణం అంశంపై యువకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లుపెడితే బీజేపీ మద్దతిచ్చిందన్నారు. పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు.. ఇప్పుడు తాము లేఖ ఇవ్వటం వల్లే తెలంగాణ వచ్చిందటం హాస్యాస్పదమన్నారు. దశాబ్దాలపాటు వెనకబాటుకు గురైన తెలంగాణకు ప్యాకేజి ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంతనే పోరా టం ఆగదని, ఈ ప్రాంత అభివృద్ది కోసం మరి న్ని పోరాటాలు అవసరమన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రౌతు కనకయ్య, పరిగి సర్పంచ్ విజయమాల, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబాయ్య, మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సురేందర్, పరిగి, కుల్కచర్ల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పరిగి పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి సునంద బుగ్గన్నయాదవ్, నాయకులు అనూష, రాములు, సురేష్, రాంచంద్రయ్య పాల్గొన్నా రు. అనంతరం కుల్కచర్ల మండల పరిధిలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో టీడీపీ కుల్కచర్ల మం డల అధ్యక్షుడు శివరాజ్ తదితరులు న్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్‌లో చైర్మన్ స్థానాన్ని సాధించి సత్తా చాటాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కనకయ్య, నాయ కులు కృష్ణయ్య, యాదగిరి యాదవ్, శంకర్, సత్యనారాయణరెడ్డి, వేమారెడ్డి తదితరులు న్నారు. టీఆర్ఎస్ కండువాతో శుభప్రద్ పటేల్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ ఈ సమావేశంలో గులాబీ కండువాతో కనిపించడం చర్చంనీయాంశమైంది, వికారాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్నుంచి శుభప్రద్ పోటీ చేస్తున్నారన్న గుసగుసలు వినపించాయి.