సర్పంచ్ పదవే సంతృప్తినిచ్చింది | satisfying sarpanch | Sakshi
Sakshi News home page

సర్పంచ్ పదవే సంతృప్తినిచ్చింది

Published Tue, Apr 1 2014 11:29 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

satisfying  sarpanch

పరిగి, న్యూస్‌లైన్: ‘ధన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికలు రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా జరగాలి.. అప్పుడే ప్రజలకు పారదర్శక పాలన చేరువవుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలు మొదలుకుని చట్టసభల ఎన్నికల వరకూ వ్యాపార ధోరణి ప్రబలుతోంది. ఇది బాధాకరం. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలు బాగా కాస్ట్‌లీ అయ్యాయి.

అభ్యర్థులు గెలిచాక కూడా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు.  అభివృద్ధి పనులు సైతం నా వారు.. నీ వారు అంటూ విభజన చేస్తున్నారు. ఈ కుసంస్కృతి కారణంగా.. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలు సైతం కుట్రలు, కుతంత్రాలతో కుళ్లిపోతున్నాయి’ అని పరిగి పంచాయతీ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్, సర్పంచ్, సమితి ప్రెసిడెంట్‌గా తన రాజకీయ ప్రస్థానంలో అంచలంచెలుగా ఎదిగి.. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రస్తుత పరిగి శాసనసభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నేటి రాజకీయాలు, ఎన్నికలపై ‘న్యూస్‌లైన్’తో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు..

 రూ.5 వేలతో సర్పంచ్‌నయ్యాను..
 1972 నుంచి 77 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా ఆ తర్వాత 1977 నుంచి 83 వరకు సర్పంచ్‌గా పనిచేశాను. మొదటిసారి సర్పంచ్‌గా గెలిచినప్పుడు నామినేషన్ ఫీజు తప్ప ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఫలానా హరీశ్వర్‌రెడ్డి అయితే బాగుంటుందని పెద్దలంతా కలిసి నన్ను ఎన్నికల బరిలో నిలబెట్టారు. వారే గెలిపించారు. రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికైనప్పుడు చాయ్, బిస్కెట్లు.. నామినేషన్లకు కోసం రూ. 10 వేల వరకు ఖర్చు పెట్టాం. మొదటిసారిగా 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లక్షలోపే ఖర్చయ్యింది.

అదికూడా డబ్బులు పంచేందుకు కాదు. చిన్నాచితకా ఖర్చులకే. అప్పట్లో ఎక్కువ శాతం ఎన్నికలు ఏకగ్రీవమే అయ్యేవి. పెద్దలే ఒకర్ని నిర్ణయిస్తే గ్రామస్తులంతా వారినే ఎన్నుకునేవారు. ఇప్పుడు చిన్నచిన్న పంచాయతీలకు సైతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మేజర్ పంచాయతీలకైతే రూ.10- 20 లక్షలు ఖర్చు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే ఎన్నికలకైతే రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వాళ్లు గెలిచింది మొదలు ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలని ఆరాటపడుతూ పనులు చేయటం మానేసి డబ్బుల సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారు.
 
 మార్పు రావాలి..
 ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి, అంతకుముందు డిప్యూటీ స్పీకర్ తదితర పదవుల కంటే పరిగికి సర్పంచ్‌గా చేసిన రోజుల్లోనే ఎక్కువ సంతృప్తి చెందాను. నిష్పక్షపాతంగానే ప్రజలు నన్ను గెలిపించారు. అభివృద్ధి పనులు సైతం అలాగే చేశాను. అందరు తెలిసినవారే. వారికి పనులు చేయటం ఎంతో తృప్తిగా ఉండేది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు ఉండేవి కావు. ఎన్నుకునే సమయంలో ఎవరూ ఏదీ ఆశించే వారు కాదు.. గెలిచాక పనులు కూడా అలాగే చేసే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. రాజకీయాల్లో, ఎన్నికల్లో మార్పు రావాల్సిన అవసరముంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement