ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆదివారం హైదరాబాద్‌కు తరలనున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత కేసీఆర్ ఉమ్మడి జిల్లా కీలక నేతలతో ఇలా భేటీని నిర్వహించడం ఇది మూడోసారి. సెప్టెంబర్ 6న అభ్యర్థుల ప్రకటన సందర్భంగా కీలక సమావేశం నిర్వహించిన గులాబీ దళపతి కేసీఆర్ ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలోనూ అందరితో మాట్లాడారు. బి–ఫారాల పంపిణీతోపాటు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మరోమారు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు, సీనియర్లతో కీలక భేటీని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే సమావేశం కోసం ఒక గంట ముందుగానే రావాలని అభ్యర్థులకు ప్రగతిభవన్ నుంచి అందిన సమాచారం మేరకు ఉదయమే బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ 12న వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించే సమావేశం కీలకమైందిగా టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలోనే బి–ఫారాలను అందజేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన 12 మందికి కూడా వీటిని పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల అభ్యర్థులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఒకవేళ ఆదివారం సాయంత్రంలోపు మిగిలిన చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థి పేరు ఖరారైతే.. ఆ అభ్యర్థిని కూడా ఆహ్వానించి బి–ఫారం అందజేస్తారని సమాచారం.
కాగా.. ఈనెల 12 నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 19 వరకు కొనసాగనుండగా, రెండు నెలల క్రితమే (సెప్టెంబరు 6న) అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ తాజాగా నామినేషన్ల ప్రక్రియను పురస్కరించుకొని బి–ఫారాలను అందజేయడంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా వుండగా బి–ఫారాల అందజేతతోపాటు ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారని సమాచారం. ఎన్నికలకు ముందు అందరు అభ్యర్థులతో కలిసి నిర్వహించే చివరి సమావేశమైనందున.. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలను ముఖ్యమంత్రి వివరిస్తారని తెలిసింది. తాజాగా వచ్చిన సర్వే నివేదికలను సైతం వారికి అందజేసే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు.
ఏం చేశారు, ఏం చేయాలి...? భేటీలో అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్..
టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకే ఓటరు గుర్తింపు కార్డుతో తెలంగాణభవన్ చేరుకొని, ఎవరికైనా నేరచరిత్ర ఉంటే వాటి వివరాలను ఇవ్వాలని కూడా సమాచారం పంపినట్లు చెప్తున్నారు. ఓటరు గుర్తింపుకార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటామని, బి–ఫారాలపై అలానే అభ్యర్థుల పేర్లు రాసి ఇవ్వనున్నట్లు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అభ్యర్థులను ప్రకటించిన సుమారు 64 రోజుల వ్యవధిలో ఏం చేశారు? ఇక ముందు ఏం చేయాలి? ప్రచారంలో ఎలా దూసుకు పోవాలి? ఆయా నియోజకవర్గాల్లో ఎవరి పరిస్థితి ఏమిటి? ఈ రెండు నెలల వ్యవధిలో అభ్యర్థుల ‘గ్రాఫ్’ ఏమిటి? ప్రజల్లో పార్టీ, ప్రభుత్వం పరిస్థితి? తదితర అంశాలపై అధినేత కేసీఆర్ చర్చించనున్నారని తెలిసింది. అభ్యర్థులను ప్రకటించిన రెండు నెలల్లో ఏం చేశారు? భవిష్యత్‌లో ఏం చేయాలి? ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం ఎలా ఉండాలి? ప్రధాన అంశాలు, అస్త్రాలు ఏమిటి? అన్న విషయాలపై కేసీఆర్ క్లాస్ ఇవ్వనున్నారు.
ఇప్పటికే ఎన్నికల పాక్షిక ప్రణాళికలో కేసీఆర్ తొమ్మిది హామీలను ప్రకటించిన కేసీఆర్, తుది ప్రణాళిక కోసం కేశవరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు కమిటీలతో శనివారం భేటీ అయ్యారు. కీలకంగా నిర్వహించే ఆదివారం నాటి సమావేశంలో తుదిప్రణాళికపైన చర్చిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించిన మంత్రులు ఈటల రాజేందర్ (హుజూరాబాద్), కేటీఆర్ (సిరిసిల్ల), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), గంగుల కమలాకర్ (కరీంనగర్), రసమయి బాలకిషన్ (మానకొండూరు), దాసరి మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి), సోమారపు సత్యనారాయణ (రామగుండం), సీహెచ్ రమేష్‌బాబు (వేములవాడ), పుట్ట మధుకర్ (మంథని), కె.విద్యాసాగర్‌రావు (కోరుట్ల), వి.సతీష్‌కుమార్ (హుస్నాబాద్), డాక్టర్ సంజయ్‌కుమార్ (జగిత్యాల) ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment