Bajireddy govardhan
-
ఇందూరు నిర్ణేతలు వీరే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయపరంగా అభివృద్ధిపథంలో దూసుకెళుతూ...రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఇందూరులో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేసే అంశాలు ప్రధాన పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు.త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1952 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు.గల్ఫ్ సంక్షేమ బోర్డు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ వలస కార్మిక కుటుంబాల ఓట్లు 22% ఉన్నట్టు అంచనా. దీంతో ఆయా కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాగా గల్ఫ్ కార్మిక సంఘాలు 60 ఉన్నాయి.ఈ సంఘాల జేఏసీకి జీవన్‌రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తనను తమ ప్రతినిధిగా పార్లమెంట్‌కు పంపాలని జీవన్‌రెడ్డి కోరుతున్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు గౌరవం దక్కుతోందంటే బీజేపీ, మోదీ మాత్రమే కారణమని అర్వింద్ పేర్కొంటున్నారు. ♦ ఉత్తర, దక్షిణ భారతానికి మధ్యలో హబ్ మాదిరిగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరుతున్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటయితే ఇక్కడి నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఎగుమతులు చేయవచ్చని అంటున్నారు. ♦ జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్, బీడీ కార్మికుల అంశం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. 185 నామినేషన్లలో 178 పసుపు రైతులవే.. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఏకంగా 185 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పసుపు బోర్డు డిమాండ్‌తో రైతులు దాఖలు చేసిన నామినేషన్లే 178 ఉండడం గమనార్హం. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణకు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.పసుపు బోర్డు పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని, పసుపు ధర సైతం రూ. 20 వేలకు తీసుకొచ్చినట్టు అర్వింద్ చెబుతున్నారు. ఈ ప్రాంతానికి పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వస్తాయని ఆయన అంటున్నారు.రీసెర్చ్ సెంటర్‌తో రైతులకు కొత్త వంగడాలు, మరిన్ని సబ్సిడీలు అందుతాయని పేర్కొంటున్నారు. అయితే పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు గెజిట్ విడుదలైనా, ఈ ఎన్నికల్లోనూ ఈ అంశంపై రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులాల వారీగా చూస్తే... నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరుకాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ్, గౌడ్ల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఓట్లు 16,89,957 ఉండగా, పురుషుల ఓట్లు 7,99,458, మహిళల ఓట్లు 8,90,411 ఉన్నాయి. నిజాం షుగర్స్ కీలక అంశం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అర్వింద్ తెరిపించలేకపోయారని జీవన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాము మాత్రం 2025లో నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని జీవన్‌రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అయితే ఎంపీ అర్వింద్ సైతం ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెబుతున్నారు. చెరకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి సైతం చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు.. బీజేపీ – ధర్మపురి అర్వింద్ 4,80,584 (45 శాతం) టీఆర్ఎస్ – కల్వకుంట్ల కవిత 4,09,709 (39 శాతం) కాంగ్రెస్ – మధుయాష్కీ69,240 (7 శాతం) -
బాజిరెడ్డి గోవర్థన్ రాష్ట్రంలో ఎక్కడ నుండి పోటీ చేసినా గెలిచే నాయకుడు
-
ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చైర్మన్‌గా పదవీకాలం ముగియటంతో ఆ పదవి నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తప్పుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బాజిరెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఆర్టీసీ వర్గాలు భావించాయి. కానీ, పదవీకాలం ముగిసినా ప్రభుత్వం నుంచి పొడగింపు ఆదేశాలు వెలువడలేదు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఆశాభంగం కలిగిన సిట్టింగ్‌లను బుజ్జగించేందుకు ఆర్టీసీ చైర్మన్ పదవి లాంటి వాటిని వారికి అప్పగించవచ్చని, అందుకే బాజిరెడ్డికి కొనసాగింపు అవకాశం ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇక్కడి బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బాజిరెడ్డికి వీడ్కోలు సమావేశం జరిగింది. బాజిరెడ్డి దంపతులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. రెండేళ్ల పదవీకాలంలో, ఆర్టీసీ అభ్యున్నతికి బాజిరెడ్డి ఎంతో కృషి చేశారంటూ అధికారులు కితాబిచ్చారు. ‘‘రెండేళ్లపాటు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేయటం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని బాగు చేసేందుకు ఎండీ సజ్జనార్‌తో కలిసి కృషి చేయడం జీవితంలో మరవలేను. నేను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం నాకు ఎంతో సంతోషం కలిగించింది’’అని బాజిరెడ్డి పేర్కొన్నారు. -
ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు వారు తెలిపారు. (చదవండి: పెద్దపల్లిలో విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి) ఎక్కడ తీసుకోవాలంటే? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. టి9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. (చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్) అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
ఎమ్మెల్యేలకు ఫ్లెక్సీల సెగ
మోపాల్/నందిపేట: ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు ఫ్లెక్సీల సెగ తగిలింది. తమ గ్రామాల అభివృద్ధి ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోపాల్ మండలం బాడ్సిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. బాడ్సి చౌరస్తాతో పాటు స్కూల్ వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాడ్సి ప్రైమరీ పాఠశాలకు బాజిరెడ్డి వస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక్కసారి కూడా బాడ్సికి రాలేదని, ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని వారు ఆరోపిస్తున్నారు. కానీ అప్పటికే ఎమ్మెల్యే పర్యటన రద్దయ్యింది. ఆర్మూర్ మండలం తల్వెదలో.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తల్వెదలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా గ్రామంలో ఫ్లెక్సీలు వెలియడం కలకలం రేపింది. ఇచ్చిన హామీలు మరిచి తమ గ్రామానికి ఏమి చేశారంటూ ఎందుకు వస్తున్నావు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో ఏడు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. -
పల్లెపల్లెనా ప్రగతి వీచికలు
సుభాష్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పల్లెల ప్రగతిని ఆవిష్కరింపజేశాయి. ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్ వంటి హంగులతో పల్లెలన్నీ దశాబ్ది వేడుకకు వేదికలుగా నిలిచాయి. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాలతో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. గ్రామ పంచాయతీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వాటిని మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించారు. గ్రామ పంచాయతీల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధర్పల్లిలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొనగా, సాటాపూర్‌లో బోధన్ ఎమ్మె ల్యే మహమ్మద్ షకీల్ ఆమిర్, నందిపేట్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు భాగస్వాములయ్యారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు సమకూరిన నిధులు, మెరుగుపడిన మౌలిక వసతులు, సాధించిన ప్రగతితోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వివిధ వర్గాల వారికి చేకూరిన లబ్ధి గురించి వక్తలు వివరించారు. పల్లెల పరిశుభ్రతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల సేవలను కొనియాడుతూ ‘సఫాయి అన్నా.. సలాం అన్న’ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్మి కుల గౌరవాన్ని ఇనుమడింపజేశాయి. పల్లెల పరిశుభ్రత, ప్రగతి కోసం విశేషంగా కషి చేసిన మల్టీపర్పస్ వర్కర్ల సేవలకు గుర్తింపుగా వారిని ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్, పాదరక్షలు, గ్లౌజులు, నూనె, సబ్బులు వంటి వస్తువుల తో కూడిన జూట్ బ్యాగులను పంపిణీచేశారు. రాజధానికి తరలివెళ్లిన ఉత్తమ సర్పంచులు వివిధ అంశాల ప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికై న సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ నేతృత్వంలో గురువారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా నుంచి మొత్తం 27 మంది సర్పంచులు, ఇద్దరు మల్టీ పర్పస్ వర్కర్లు ప్రత్యేక బస్సులో బయల్దేరి వెళ్లారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వీరిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావుల చేతుల మీదుగా సన్మానించారు. -
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
● ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి: దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబరిమోహన్, జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిర పాల్గొన్నారు. రూరల్నియోజకవర్గంలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న 40 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. 70 దేవాలయాలకు రూ.130 కోట్లు సిరికొండ: నియోజకవర్గంలో 70 దేవాలయాలకు రూ.130 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. న్యావనందిలో రూ. 45 లక్షలతో నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసిగా తనకు అన్ని బాధలు తెలుసని అందుకే ఎక్కడ ఏం కావాలో ఆ పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ మాన్సింగ్, వైస్ ఎంపీపీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. -
ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు ఆదాయం: పువ్వాడ
అఫ్జల్‌గంజ్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కార్గో సర్వీసులు, పెట్రోల్ పంపులతో పాటు తాజా గా మంచినీటి బాటిళ్ల విక్రయానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. సోమవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుద్ధి చేసిన మంచినీటి బాటిళ్ల (జీవా జలం) విక్రయాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఈడీలు వినోద్‌కుమార్, యాదగిరి, ఆర్ఎం శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. -
ప్రయాణికుల ఆదరణతో ప్రగతిరథం పరుగులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): ప్రయాణికుల ఆదరణతో టీఎస్ఆర్టీసీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థికంగా పటిష్టంగా తయారవుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ప్రయాణికుల వల్లే ప్రగతిరథ చక్రం పరుగులు పెడుతోందని, 2022లో ప్రయాణిక దేవుళ్లు టీఎస్ఆర్టీసీని ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించారని పేర్కొ న్నారు. బుధవారం కూకట్పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీలోని బస్‌స్టాప్‌లో కొత్త స్లీపర్, స్లీపర్ కమ్ సీట్ బస్సులను ఎండీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొ న్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడారు. గత 15 రోజుల క్రితం సూపర్ డీలక్స్ బస్సులను ప్రారంభించామని, ఈ నెలాఖరులో కొత్త ఏసీ బస్సులను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్లీపర్ బస్సులు హైదరాబాద్–విజయవాడ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. సీఎం సహకారంతో ఆర్టీసీ అభివృద్ధి: బాజిరెడ్డి ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సంస్థలోని 50 వేల మంది ఉద్యోగుల కృషి వల్లే రోజు రోజుకూ రెవెన్యూ మెరుగుపడుతోందని చెప్పారు. -
బకాయిలు చెల్లిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ బకాయిల చెల్లింపులో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం కొన్ని బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సూచనతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల హరీశ్ సూచనల నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులతో చర్చించి బకాయిల వివరాలను తీసుకున్నారు. వీటిలో తక్షణం చెల్లించాల్సిన మొత్తాలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు.. తాజాగా మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లు భేటీ అయ్యారు. నోటీసులతో కదలిక ఆర్టీసీలో ఈ బకాయిల ప్రభావం 48 వేల కుటుంబాలపై ఉంది. ఇటీవల పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేయటం, రెండురోజుల క్రితం సహకార పరపతి సంఘం లీగల్ నోటీసు జారీ చేయటంతో ఆర్టీసీలో కదలిక వచ్చింది. కనీసం రూ.2 వేల కోట్లు అయినా విడుదల చేస్తే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుందని బాజిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఆయన సీఎంతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఇప్పుడు హరీశ్‌రావుతో చర్చల సందర్భంగా అదే విషయాన్ని వెల్లడించారు. పీఎఫ్ బకాయిలే రూ.1,300 కోట్లు కొన్నేళ్లుగా ఆర్టీసీలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా మారటంతో, జీతాలు తప్ప ఉద్యోగులకు ఇతర చెల్లింపులు దాదాపు నిలిచిపోయాయి. దీంతో వారికి దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ►ఆర్టీసీ ఉద్యోగులకు కీలకమైంది సహకార పరపతి సంఘం. ప్రతినెలా జీతం నుంచి మినహాయించే 7 శాతం మొత్తంతో ఏర్పడే నిధి నుంచి ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. ఈ నిధిని ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవటంతో ఇప్పుడు రుణాలు నిలిచిపోయాయి. అలాగే అందులోనే డిపాజిట్లు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా పింఛన్ తరహాలో అందే వడ్డీ కూడా నిలిచిపోయింది. ఎండీగా సజ్జనార్ వచ్చాక రూ.500 కోట్లు తిరిగి చెల్లించినా, ఇప్పటికీ రూ.850 కోట్ల బకాయిలున్నాయి. ►ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉండే పీఎఫ్ ట్రస్టు నుంచి కూడా నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రతినెలా పీఎఫ్ చెల్లింపులు కూడా సక్రమంగా లేవు. దానికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లకు పేరుకుపోయాయి. దీంతో పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ►ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక చేయూతనందించేందుకు ఉన్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం నిధులను కూడా ఆర్టీసీ వాడేసుకుంది. అలాగే ఎస్బీటీ నిధులు కూడా ఖాళీ చేసింది. దీని కాంట్రిబ్యూషన్ కింద జీతం నుంచి నెలవారీ కోత మాత్రం కొనసాగుతోంది. వీటి బకాయిలు రూ.400 కోట్లకుపైగా ఉన్నాయి. ►2013కు సంబంధించి 2015లో జరిగిన వేతన సవరణ బకాయిల్లో సగం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు ఉంది. ►ఆరు విడతలకు సంబంధించిన కరువు భత్యం (25 శాతం వరకు ) రూ.325 కోట్ల మేర పెండింగులో ఉంది. ►2019లో జూన్ నుంచి నవంబర్ వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు, గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన వారికి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పెండింగులో ఉంది. అవో రూ.20 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. -
నష్టాల్లోంచి ఆర్టీసీ బయటకొస్తోంది!
ఖలీల్‌వాడి: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్ టికెట్‌తోపాటే తిరుమల శీఘ్ర దర్శన టోకెన్ అందిస్తున్నామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ నుంచి తిరుమల తిరుపతికి వెళ్లే బస్సులను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా బాజిరెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ నుంచి తిరుపతికి ఆర్టీసీ రోజూ 30 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు రోజుకు 1000 శ్రీఘ్ర దర్శన టోకెన్లను జారీ చేయనుందని, వీటిని టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా కనీసం 7 రోజుల ముందుగా పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీకీ అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ సహకారంతో త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించనున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సీఎం కేసీఆర్ ఈ వార్షిక బడ్జెట్లో రూ.1500 కోట్లను కేటాయించారని, సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల్లోంచి బయటకు వస్తోందని వెల్లడించారు. కారుణ్య నియామకాల ద్వారా ఆర్టీసీలో త్వరలోనే 1200 సిబ్బందిని విడతల వారీగా నియమిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అతి త్వరలోనే ఫార్మసీలను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రజలు ఆర్టీసీకి సహకారం అందించాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మూర్‌లో దాడి జరిగింది, కానీ.. గన్నారంలోనే జరగాల్సింది: ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నేతలలు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ హెచ్చరించారు. నోటికెంత వస్తే అంత మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టే ఆర్మూర్‌లో దాడి జరిగిందన్నారు. వాస్తవానికి గన్నారంలోనే జరగాల్సిందని, సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. బీజేపీ నాయకులకు ఎదురు తిరగాలని, ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్, రేవంత్ రెడ్డిలు తెలంగాణకు శనిలా మారారని విమర్శించారు. తమ ఆట మొదలైందని, కేసీఆర్‌ను విమర్శిస్తే వేటాడి వెంటాడుతామని హెచ్చరించారు. చదవండి: సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోందని, దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లు విషం కక్కుతున్నారని, దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ బర్త్ డే రోజు బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పథకాలు అమలు చేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు.. ఆ పార్టీల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రస్తావించారు. చదవండి: మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం -
ఆర్టీసీ మూసివేత ప్రసక్తే లేదు
సాక్షి, నిజామాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మూసి వేత ప్రసక్తేలేదని, అలాగే ప్రైవేటుపరం కూడా చేసేది లేదని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తేల్చి చెప్పారు. సంస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దుబారా ఖర్చులు తగ్గించి లాభాల బాట పట్టించేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు మానుకోవాలని, నష్టాలు తగ్గించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కోవిడ్‌కు ముందు ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.14 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3 కోట్లు మాత్రమే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో సంస్థ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్రతినెల జీతాలిచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలతో లాభాలు పెరుగుతాయని, ఇందుకు మరో వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తామని, ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మిస్తామని వెల్లడించారు. -
పూర్వ వైభవం తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని సంస్థ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఖర్చులు తగ్గించు కోవటంతోపాటు సంస్థ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవటం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మెరుగు పరుస్తామని అన్నారు. కొత్త ఎండీగా నియమితులైన డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌తో కలసి కష్టాల్లో ఉన్న ఆర్టీసీని పురోగమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఉదయం ఆయన బస్‌భవన్‌లో సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు అభినం దనలు భఃతెలిపారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ ప్రజాజీవితంతో ముడిపడిఉన్న సంస్థ అని, అందరికీ ఆర్టీసీతో అనుబంధం ఉంటుం దని, అలాంటి సంస్థను బతికించుకునేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని పేర్కొ న్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా సంస్థ ఆదాయం పెరిగేందుకు సాయం చేయాలని, సురక్షిత ప్రయాణం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని అన్నారు. కష్టపడి పనిచేసే తత్వమున్న సిబ్బంది, అనుభవం ఉన్న అధికారులున్నందున అంద రినీ కలుపుకొనిపోయి సంస్థను అభివృద్ధి బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలందించిందని, అలాంటి సంస్థను కాపాడుకోవటం మన విధి అని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మబోమని అన్నారు. కొత్తగా ప్రారంభమైన కార్గో అండ్ పార్శిల్ సర్వీసులను బలోపేతం చేయడం, ఆర్టీసీ స్థలాల్లో ఏర్పాటైన పెట్రోల్ బంకులను మెరుగ్గా నిర్వహించటం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. అనంతరం ఆర్టీసీ కల్యాణమండపంలో కార్యకర్తలు, నేతలతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు మూడు వేల మంది వరకు కార్యకర్తలు, నాయకులు బస్‌భవన్‌కు తరలిరావడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా ఆయన గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందుస్తు జాగ్రత్తగా రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్యేతో సమీపంగా మెలిగిన వారంతా ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్, బీగాల గణేష్ గుప్తాకు సైతం వైరస్ సోకింది. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో బాజిరెడ్డి భార్యతో పాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో ప్రత్యేక్షంగా కలిసి వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. మరోవైపు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతుండటంతో వారిని ప్రత్యక్షంగా కలిసి వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం హోం క్వారెంటైన్‌లోకి వెళ్లారు. అనంతరం వీరికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీస్ శాఖలోనూ కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు వైరస్ బారినపడగా.. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి వైరస్ సోకడంతో.. అడిషనల్ డీజీ స్థాయి అధికారి హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా జీహెచ్ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు 180 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారినపడ్డారు. -
ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆదివారం ఆయనకు కోవిడ్–19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం భార్యతో కలసి హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి సుమారు పదిహేను రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చారు. అదే రోజు ఆయన డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కాగా, ఆయనకు అస్వస్థతగా ఉండటంతో బాజిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ను శనివారం సేకరించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వాటిని పరీక్షలకోసం హైదరాబాద్‌కు పంపించారు. రిపోర్టుల్లో బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఆయన భార్య వినోద, కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌లకు నెగెటివ్ వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి యశోద ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు జగన్ తెలిపారు. హోం క్వారంటైన్లో ఎమ్మెల్సీ, ఆర్డీవో శనివారం బీబీపూర్ తండాలో జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో బాజిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆర్డీవో వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నివాసంలో వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు వెలుగులోకి రావడంతో అధికారులు, నాయకులు కలవరానికి గురయ్యారు. బాజిరెడ్డి వెంట వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆర్డీవో వెంకటయ్య హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ముత్తిరెడ్డిని కలసిన బాజిరెడ్డి..? ఇదిలా ఉండగా బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల కరోనా సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలసినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బాజిరెడ్డి, ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. -
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఇప్పటికే జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కి కరోనా సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్ బయల్దేరారు. (హైదరాబాద్‌లో దడ పుట్టిస్తున్న కరోనా) కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో వారం కిందటే బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారు. అంతేకాకుండా మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిన్న బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్, భార్యకు నెగెటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్) ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరణ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి వివరాలను వైద్యాధికారులు, సిబ్బంది సేకరిస్తున్నారు. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండాలో నిన్న (శనివారం) డబుల్ బెడ్రూం ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. 50 గృహాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వారికి ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దీంతో ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
'ఎంపీ అరవింద్ పచ్చి అబద్ధాల కోరు'
సాక్షి, డిచ్పల్లి : ఎన్నికల్లో గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్.. గెలిచి ఆర్నెళ్లయినా పసుపుబోర్డు మాటెత్తని అబద్ధాలకోర్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బతుకమ్మను ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన మాజీ ఎంపీ కవితను ఓ డించి, మోసపూరిత వ్యక్తిని గెలిపించడం బా ధాకరమని వ్యాఖ్యానించారు. డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొద్దున లేస్తేనే సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నాడని ఆరోపించారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్‌ను కలిశారని,తమను తెలంగాణలో కలపాలని కోరారని చెప్పారు. మహారాష్ట్రలోనూ 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు అమలు చేయమని అక్కడఅధికారంలో ఉన్న బీజేపీకి చెప్పాలని అర్వింద్‌కు సవాల్ విసిరారు. ఫ్లెక్సీ వివాదం.. చీరల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్ ఫొటో లేదని ఎవరో చెప్పడంంతో ఆయన కలెక్టర్ రామ్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఆర్డీవోకు ఫోన్ చేసి ప్రశ్నించారు. దీంతో ఆర్డీవో స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. అయితే, ఎమ్మెల్యే రాగా నే, పార్టీ నాయకులు ఫ్లెక్సీ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. స్టేజీపై ఫ్లెక్సీ పెట్టించాలని సూచించడంతో ఆర్డీవో ఏర్పాటు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక వ్యక్తి కోసం మా ఫొటో తీసేస్తరా ఆర్డీవో సాబ్ అని ప్రశ్నించారు. ‘ఆ వ్యక్తి రాడు, ముఖం లేదు, మంచి కార్యక్రమాలకు అడ్డుపడుతుంటాడు. అతడు ఫోన్ చేయగానే భయపడి ఫ్లెక్సీ తొలగిస్తారా..? ఏం.. మేం పని చేస్తలేమా..? ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చిత్రాలు ఉన్నాయి.. అతడు ఏం చేస్తడో చేసుకోని’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎంపీపీ భూ మన్న, జెడ్పీటీసీలు ఇందిర, జగన్, సర్పం చ్ సతీశ్‌రావు, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీవో సురేందర్, నేతలు గడీలరాములు పాల్గొన్నారు. -
పదవి రానందుకు అసంతృప్తి లేదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పదవి దక్కనందుకు తాము అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పదవుల కోసం రాలేదని, పథకాలు, సీఎం నాయకత్వంపట్ల ఆకర్షితులయ్యానని గండ్ర పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల వల్లే తన భార్య గండ్ర జ్యోతికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి వచ్చిందని గండ్ర తెలిపారు. తాను అనని మాటలను అన్నట్లు కొన్ని పత్రికలు రాయడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం తగదు: బాజిరెడ్డి మంత్రి పదవి రానందుకు ఎలాంటి అసంతృప్తి లేదని బాజిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఎవరిని నమ్ముతానో వారితో చివరి వరకు ఉంటానని, మా నాయకుడు కేసీఆరే అని తేల్చి చెప్పారు. -
కూటమి మాటలు నమ్మొద్దు
సాక్షి,ఇందల్వాయి(నిజామాబాద్): ఆంధ్ర పాలకులకు దాసోహమైన మహా కూటమి మాయ మాటలు నమ్మవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి జోరు పెంచాలని టీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి బుధవారం ఆయన ఇందల్వాయి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండేళ్లలో రూరల్ నియోజకవర్గంలో ప్రతీ ఎకరానికి సాగు నీరందిస్తామని బాజిరెడ్డి తెలిపారు. పాసుబుక్కులు రాని రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వాలు మాయ మాటలతో పబ్బం గడిపాయని, అందుకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ఇందల్వాయి రామాలయ అభివృద్ధికి రూ. 50 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ హయాంలో ఇంత వరకు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కళాబృందం సభ్యులు ప్రజలకు వివరించారు. అనంతరం టీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్ సదానందం, మాజీ ఎంపీటీసీ గంగాధర్‌గౌడ్‌లకు బాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని కుల సంఘాలతో సమావేశమయ్యారు. అంతకు ముందు స్థానికులు బాజిరెడ్డికి మంగళ హారతులు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. ముదిరాజ్, అంబేద్కర్ యువజన సంఘాలు సత్కరించి, తమ సమస్యలు తీర్చాలని వినతిపత్రాలు అందించాయి. మాజీ జెడ్పీటీసీ దినేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌నాయక్, నేతలు గడీల రాములు, ముత్తెన్న, హుస్సేన్, గోపాల్, కుమార్, శేఖర్, చింతల దాసు పాశం నర్సింహులు, తొగరి కాశీరాం తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర విచారణ చేపట్టండి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ముఖ్య నేతల మధ్య వర్గ పోరు రసకందాయంలో పడింది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యూహాత్మకంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆరోపణలు తప్పని తేలితే ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్:భూ ప్రక్షాళన ప్రక్రియపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన సంచలన ఆరోపణలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యూహాత్మకంగా స్పందించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుకు ఆదివారం లేఖ రాశారు. ఈ ఆరోపణలు తన 35 ఏళ్ల రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీశాయని లేఖలో పేర్కొన్నారు. పోలీసు శాఖతో గానీ, తగిన అధికారం కలిగిన యంత్రాంగంతో గానీవిచారణ జరిపించాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు కాని పక్షంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు ఉప్పు నిప్పులా మారిన విషయం విదితమే. గతంలో భూపతిరెడ్డి పలుమార్లు చేసిన విమర్శలపై బాజిరెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కానీ ఈసారి బాజిరెడ్డి వ్యూహాత్మకంగా కలెక్టర్‌కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఆరోపణలపై బాజిరెడ్డి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇన్చార్జి డీఆర్వోతో విచారణ.. బాజిరెడ్డి రాసిన లేఖపై కలెక్టర్ రామ్మెహన్‌రావు తక్షణం స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వినోద్‌కుమార్‌ను నియమించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించిన గ్రామాలతో పాటు అన్ని చోట్లా విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మరో వైపు జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి శనివారం సిరికొండ తహసీల్దార్ కార్యాలయాలన్ని తనిఖీ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతం పూర్తయిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆధార్ సీడింగ్, డిజిటల్ సిగ్నిచర్లను ఖాతాల వారీగా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలోని 105 గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాసుపుస్తకాల ముద్రణకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆరోపణలు, బాజిరెడ్డి కలెక్టర్‌కు లేఖ చర్చనీయాంశంగా మారింది. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ దంపతుల మృతి
సాక్షి, గజ్వేల్ (రూరల్) : ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీడిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గజ్వేల్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన బాల గంగాధర్(55) నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి పీఏగా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య విజయ(48)తో కలసి గురువారం ఉదయం కారులో వేములవాడకు దైవదర్శనానికి వెళ్లారు. అనంతరం సాయంత్రం వేములవాడ నుంచి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీడిపో వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బాల గంగాధర్, విజయ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న గజ్వేల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ సహాయంతో లారీ కింద నుంచి కారును తొలగించి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
'నన్ను ఒక నియంతగా చూశారు'
నిజామాబాద్ : పోలీస్ పటేల్‌గా, గ్రామ సర్పంచుగా పని చేసిన కాలంలో కొందరు తనను ఒక నియంతగా చూశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది అయితే, వర్సిటీ తెచ్చిన ఘనత తనదేనని గర్వంగా చెప్పగలనని ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీని ఎక్కడో రాళ్లు, కొండ గుట్టల మధ్య ఏర్పాటు చేయడానికి జిల్లా నాయకుడు ఒకరు ప్రయత్నించారని ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాజిరెడ్డి విమర్శించారు. తాను ఎక్కువగా చదువుకోకున్నా, సమాజాన్ని బాగా చదివానని బాజిరెడ్డి అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేసేందుకు ముందు ఉంటాయని ఆయన తెలిపారు. -
నిజామాబాద్‌లో కారు క్లీన్ స్వీప్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన పోరులో కారు దూసుకుపోయింది. ఒక్కసీటు కూడా హస్తానికి అందనివ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నిజామాబాద్ ఎంపీ సీటును టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత కైవసం చేసుకున్నారు. జిల్లాలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు *ఆర్మూర్ -మాజీ మంత్రి జీవన్ రెడ్డి, *బోధన్- షకీల్ అహ్మద్ *జుక్కల్-హన్మంతు షిండే *బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి *ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి *కామారెడ్డి-గంప గోవర్దన్ *నిజామాబాద్(అర్బన్)- గణేష్ గుప్తా *నిజామాబాద్ (రూరల్)-బాజిరెడ్డి గోవర్దన్ *బాల్కొండ-వి.ప్రశాంత్‌రెడ్డి -
డీఎస్ అయిదోసారి ఓడిపోయారు
నిజామాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరోసారి ఓటమి చవిచూశారు. ఆయన తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. కాగా 1994లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్థన్ 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2004 లో గోవర్థన్ బాన్సవాడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరి నిజామాబాద్ రూరల్ నుంచి బరిలోకి దిగారు. ఇక డీఎస్ ఓటమిని హ్యాట్రిక్ అనే చెప్పుకోవచ్చు. రెండుసార్లు ఓటమితో డీ శ్రీనివాస్ ఏకంగా నిజామాబాద్ అర్భన్ సెగ్మెంట్ నుంచి రూరల్‌కు మారినా ఫలితం మాత్రం వెంటాడింది. 1983, 1994, 2009, 2010, 2014 ఎన్నికల్లో డీఎస్‌ను ఓడించి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. అప్పట్లో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న డీఎస్‌కు ఓటర్లు రెండుసార్లు ఓటమి రుచి చూపించారు. ఆయన జనంలో అంతగా గుర్తింపులేని బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోవడం అప్పట్లో సంచలనం. 2004 నుంచి కాంగ్రెస్ లో కీలకమైన పదవులు నిర్వహించిన డీఎస్ వరుసగా ఓటమి పాలు కావటంతో దాదాపు ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందనే చెప్పుకోవచ్చు. డీ శ్రీనివాస్, డీఎస్, నిజామాబాద్, బాజీరెడ్డి గోవర్థన్, టీఆర్ఎస్, కాంగ్రెస్, D srinivas, DS, nizamabad, bajireddy govardhan, trs, congress -
ఎల్లమ్మకుంటలో ఘర్షణ
నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్ :నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం ఆయన మండలంలోని ఎల్లమ్మ కుంట గ్రామానికి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే ఎల్లమ్మకుంటకు చెందిన మాజీ జడ్పీటీసీ కెతావత్ మోహన్, అతని అనుచరులు (కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు) తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని అడ్డుకున్నారు. కర్రలు, రాళ్ల తో దాడి చేసి బాజిరెడ్డి ప్రయాణిస్తున్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంచిప్ప మాజీ ఎంపీటీసీ రఘు, కిషన్, సరి యా నాయక్, విఠల్, డా.చిన్నారెడ్డి సహా పది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. కెతావత్ మోహన్ కూడా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తర లించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే ప్రొబేషనరీ ఎస్పీ (రూరల్ ఠాణా ఎస్హెచ్ఓ) విజ య్ కుమార్, నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ ఆదిరెడ్డి హుటాహుటిన ఎల్లమ్మకుంట గ్రామానికి తరలివచ్చారు.గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చే శారు. గాయపడినవారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించా రు. ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై కేసు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బాజిరెడ్డిని పరామర్శించిన కవిత సంఘటన గురించి తెలిసిన వెంటనే నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఎల్లమ్మకుంట గ్రామానికి తరలివచ్చారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటుందని, అధైర్య పడవద్దన్నారు.వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. సంఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గురువారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
కేసీఆర్ సీఎం అయితేనే అభివృద్ధి: బాజిరెడ్డి
నిజామాబాద్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చని ఆ పార్టీలో చేరిన బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి కలను సాకారం చేశారన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అన్నివర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు. ఏళ్ల తరబడి వివక్షకు గరైన మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను మెజారిటీ స్థానాలలో గెలిపించాలని కోరారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి, గట్టు ధ్వజం జానా, ఉత్తమ్‌లు కిరణ్ కింద ఎందుకు పనిచేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ.. దానిని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంత్రులుగా రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాపాడాల్సిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలే స్వయంగా వాటిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వారైతే తాను సమైక్యవాద చాంపియన్ అని చెప్పుకుంటున్న సీఎం కిరణ్ కింద పనిచేయడానికి సిగ్గేయడం లేదా? అని అన్నారు. భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకోవడం చూస్తుంటే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు వేరువేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఫైళ్లపై సంతకాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చీకట్లో అన్ని వ్యవహారాలు నెరుపుతూ, పైకి మాత్రం తెలంగాణవాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. -
త్యాగాలను సమాజం మరువదు: బాజిరెడ్డి గోవర్దన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను మంగళవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి, దేపభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొని.. మహానేతలు గాంధీ, నెహ్రూ, పటేల్, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య చేపట్టి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తికోసం పోరాటం చేసిన నాయకులను ప్రజలు ఎన్నటికీ మరువబోరన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజా శ్రేయస్సుకోసం పరితపించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పారిపోయిన కొందరు భూస్వామ్య ముఠా నాయకులు.. టీఆర్ఎస్లో చేరి తెలంగాణవాదం పేరుతో గ్రామాలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గట్టు రామచంద్రరావు విమర్శించారు. -
ఘనంగా తెలంగాణ విమోచన దినం వేడుకలు
-
తెలంగాణలోనూ వైఎస్సార్సీపీ ఉంటుంది: బాజిరెడ్డి గోవర్ధన్
బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టీకరణ చంద్రబాబు మూడుసార్లు తెలంగాణను మోసం చేశారు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చానంటూనే సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకున్నానంటున్నారు ఇరుప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే సమైక్యంగా ఉంచమనే వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతోంది వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే సహించం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అనేక వైఖరులు అవలంభించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉండగా లేనిది తమ పార్టీ ఎందుకుండదని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేసిన నాయకుడని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ ప్రాంతమే అత్యధికంగా లబ్ది పొందిందని తెలిపారు. అలాంటి నాయకుడి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కచ్చితంగా ఉంటుందని చె ప్పారు. వైఎస్‌ను అదరించిన వ్యక్తులు, అభిమానులు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసినా, ఈ విషయమై రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా సహించేది లేదని బాజిరెడ్డి హెచ్చరించారు. పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్‌రావు, బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావులతో కలసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల విషయంలో తమ పార్టీ మొదటినుంచీ ఒకే వైఖరి అవలంభిస్తున్న విషయం బాజిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనిపక్షంలో సమైక్యంగా ఉంచమని చెబుతోందే తప్ప ఇతర పార్టీల మాదిరిగా ప్రాంతాల వారీగా వైఖరులను అవలంభిస్తూ ప్రజలను గందరగోళ పరచడంలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన విషయం ఆయన గుర్తుచేశారు. న్యాయంగా వ్యవహరిస్తున్న పార్టీపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరమేంటో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ ఉండగాలేనిది వైఎస్సార్సీపీ ఎందుకుండదు? ‘తెలంగాణ ప్రాంతాన్ని మూడుసార్లు మోసం చేసిన చంద్రబాబు ఒకపక్క విభజనకు లేఖ ఇచ్చానని చెబుతూనే.. మరోపక్క సీమాంధ్రలో యాత్ర చేస్తూ తెలంగాణను అడ్డుకున్నది తానే అని చెబుతున్నారు. అలాంటి టీడీపీ, ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసగించిన బీజేపీ రెండు ప్రాంతాల్లో ఉండగాలేనిది, వైఎస్సార్సీపీ ఎందుకు ఉండదు?’ అని బాజిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు...సీమాంధ్రలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎందుకు ఎండగట్టడం లేద ని ఆయన నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర నేతలను ఎందుకు బహిష్కరించ డంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
‘ప్రాణహిత-చేవెళ్లకూ జాతీయ హోదా : బాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన విధంగానే తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్లకూ జాతీయ హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నిరాహార దీక్షచేస్తున్న నిమ్స్ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సమయంలో పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామన్నారని, తెలంగాణకు ముఖ్యమైన ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.40 కోట్లు అవసరం అవుతాయని, తెలంగాణ రాష్ర్టం అంత ఖర్చును భరించే అవకాశం లేదని అనుమానం వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రజల కోసం పోరాడుతోందని కొనియాడారు. సమన్యాయం కోసం దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించిందని, బలవంతంగా దీక్ష విరమింపజేయడం సంతోషించదగ్గ పరిణామమని చెప్పారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ యథాతథంగా కొనసాగుతోందని చెప్పారు.