
సాక్షి, హైదరాబాద్: మంత్రి పదవి దక్కనందుకు తాము అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి పదవుల కోసం రాలేదని, పథకాలు, సీఎం నాయకత్వంపట్ల ఆకర్షితులయ్యానని గండ్ర పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల వల్లే తన భార్య గండ్ర జ్యోతికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి వచ్చిందని గండ్ర తెలిపారు. తాను అనని మాటలను అన్నట్లు కొన్ని పత్రికలు రాయడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారం తగదు: బాజిరెడ్డి
మంత్రి పదవి రానందుకు ఎలాంటి అసంతృప్తి లేదని బాజిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఎవరిని నమ్ముతానో వారితో చివరి వరకు ఉంటానని, మా నాయకుడు కేసీఆరే అని తేల్చి చెప్పారు.