పసుపు, చెరకు రైతులు
గల్ఫ్ కుటుంబాలు
బీడీ కార్మికులు
విలక్షణ తీర్పు ఇస్తున్న నిజామాబాద్ ఓటర్లు
ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయపరంగా అభివృద్ధిపథంలో దూసుకెళుతూ...రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఇందూరులో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేసే అంశాలు ప్రధాన పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు.
త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1952 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి బీఆర్‌ఎస్, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు.
గల్ఫ్ సంక్షేమ బోర్డు
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ వలస కార్మిక కుటుంబాల ఓట్లు 22% ఉన్నట్టు అంచనా. దీంతో ఆయా కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాగా గల్ఫ్ కార్మిక సంఘాలు 60 ఉన్నాయి.
ఈ సంఘాల జేఏసీకి జీవన్‌రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తనను తమ ప్రతినిధిగా పార్లమెంట్‌కు పంపాలని జీవన్‌రెడ్డి కోరుతున్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు గౌరవం దక్కుతోందంటే బీజేపీ, మోదీ మాత్రమే కారణమని అర్వింద్ పేర్కొంటున్నారు.
♦ ఉత్తర, దక్షిణ భారతానికి మధ్యలో హబ్ మాదిరిగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరుతున్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటయితే ఇక్కడి నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఎగుమతులు చేయవచ్చని అంటున్నారు.
♦ జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్, బీడీ కార్మికుల అంశం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది.
185 నామినేషన్లలో 178 పసుపు రైతులవే..
2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఏకంగా 185 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పసుపు బోర్డు డిమాండ్‌తో రైతులు దాఖలు చేసిన నామినేషన్లే 178 ఉండడం గమనార్హం. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణకు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
పసుపు బోర్డు
పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని, పసుపు ధర సైతం రూ. 20 వేలకు తీసుకొచ్చినట్టు అర్వింద్ చెబుతున్నారు. ఈ ప్రాంతానికి పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వస్తాయని ఆయన అంటున్నారు.
రీసెర్చ్ సెంటర్‌తో రైతులకు కొత్త వంగడాలు, మరిన్ని సబ్సిడీలు అందుతాయని పేర్కొంటున్నారు. అయితే పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు గెజిట్ విడుదలైనా, ఈ ఎన్నికల్లోనూ ఈ అంశంపై రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కులాల వారీగా చూస్తే...
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరుకాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ్, గౌడ్‌ల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఓట్లు 16,89,957 ఉండగా, పురుషుల ఓట్లు 7,99,458, మహిళల ఓట్లు 8,90,411 ఉన్నాయి.
నిజాం షుగర్స్ కీలక అంశం
నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అర్వింద్ తెరిపించలేకపోయారని జీవన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాము మాత్రం 2025లో నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని జీవన్‌రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అయితే ఎంపీ అర్వింద్ సైతం ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెబుతున్నారు. చెరకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి సైతం చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..
బీజేపీ – ధర్మపురి అర్వింద్ 4,80,584 (45 శాతం)
టీఆర్‌ఎస్ – కల్వకుంట్ల కవిత 4,09,709 (39 శాతం)
కాంగ్రెస్ – మధుయాష్కీ69,240 (7 శాతం)
Comments
Please login to add a commentAdd a comment