సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చైర్మన్‌గా పదవీకాలం ముగియటంతో ఆ పదవి నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తప్పుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బాజిరెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఆర్టీసీ వర్గాలు భావించాయి. కానీ, పదవీకాలం ముగిసినా ప్రభుత్వం నుంచి పొడగింపు ఆదేశాలు వెలువడలేదు. ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఆశాభంగం కలిగిన సిట్టింగ్‌లను బుజ్జగించేందుకు ఆర్టీసీ చైర్మన్ పదవి లాంటి వాటిని వారికి అప్పగించవచ్చని, అందుకే బాజిరెడ్డికి కొనసాగింపు అవకాశం ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇక్కడి బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బాజిరెడ్డికి వీడ్కోలు సమావేశం జరిగింది. బాజిరెడ్డి దంపతులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. రెండేళ్ల పదవీకాలంలో, ఆర్టీసీ అభ్యున్నతికి బాజిరెడ్డి ఎంతో కృషి చేశారంటూ అధికారులు కితాబిచ్చారు. ‘‘రెండేళ్లపాటు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేయటం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని బాగు చేసేందుకు ఎండీ సజ్జనార్‌తో కలిసి కృషి చేయడం జీవితంలో మరవలేను. నేను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం నాకు ఎంతో సంతోషం కలిగించింది’’అని బాజిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment