సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ బకాయిల చెల్లింపులో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం కొన్ని బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సూచనతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు.
ఇటీవల హరీశ్ సూచనల నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులతో చర్చించి బకాయిల వివరాలను తీసుకున్నారు. వీటిలో తక్షణం చెల్లించాల్సిన మొత్తాలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు.. తాజాగా మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లు భేటీ అయ్యారు.
నోటీసులతో కదలిక
ఆర్టీసీలో ఈ బకాయిల ప్రభావం 48 వేల కుటుంబాలపై ఉంది. ఇటీవల పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేయటం, రెండురోజుల క్రితం సహకార పరపతి సంఘం లీగల్ నోటీసు జారీ చేయటంతో ఆర్టీసీలో కదలిక వచ్చింది. కనీసం రూ.2 వేల కోట్లు అయినా విడుదల చేస్తే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుందని బాజిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఆయన సీఎంతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఇప్పుడు హరీశ్‌రావుతో చర్చల సందర్భంగా అదే విషయాన్ని వెల్లడించారు.
పీఎఫ్ బకాయిలే రూ.1,300 కోట్లు
కొన్నేళ్లుగా ఆర్టీసీలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా మారటంతో, జీతాలు తప్ప ఉద్యోగులకు ఇతర చెల్లింపులు దాదాపు నిలిచిపోయాయి. దీంతో వారికి దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.
►ఆర్టీసీ ఉద్యోగులకు కీలకమైంది సహకార పరపతి సంఘం. ప్రతినెలా జీతం నుంచి మినహాయించే 7 శాతం మొత్తంతో ఏర్పడే నిధి నుంచి ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. ఈ నిధిని ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవటంతో ఇప్పుడు రుణాలు నిలిచిపోయాయి. అలాగే అందులోనే డిపాజిట్లు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా పింఛన్ తరహాలో అందే వడ్డీ కూడా నిలిచిపోయింది. ఎండీగా సజ్జనార్ వచ్చాక రూ.500 కోట్లు తిరిగి చెల్లించినా, ఇప్పటికీ రూ.850 కోట్ల బకాయిలున్నాయి.
►ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉండే పీఎఫ్ ట్రస్టు నుంచి కూడా నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రతినెలా పీఎఫ్ చెల్లింపులు కూడా సక్రమంగా లేవు. దానికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లకు పేరుకుపోయాయి. దీంతో పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
►ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక చేయూతనందించేందుకు ఉన్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం నిధులను కూడా ఆర్టీసీ వాడేసుకుంది. అలాగే ఎస్బీటీ నిధులు కూడా ఖాళీ చేసింది. దీని కాంట్రిబ్యూషన్ కింద జీతం నుంచి నెలవారీ కోత మాత్రం కొనసాగుతోంది. వీటి బకాయిలు రూ.400 కోట్లకుపైగా ఉన్నాయి.
►2013కు సంబంధించి 2015లో జరిగిన వేతన సవరణ బకాయిల్లో సగం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు ఉంది.
►ఆరు విడతలకు సంబంధించిన కరువు భత్యం (25 శాతం వరకు ) రూ.325 కోట్ల మేర పెండింగులో ఉంది.
►2019లో జూన్ నుంచి నవంబర్ వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు, గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన వారికి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పెండింగులో ఉంది. అవో రూ.20 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment