RTC employes
-
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లించనుంది. ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. దాంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది. పదోన్నతులకు త్వరలో మార్గదర్శకాలు ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – పల్లిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు ప్రయోజనకరం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సాను కూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – పీవీ రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వై.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
సీసీఎస్‌కు రూ.200 కోట్ల బకాయిలు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి బకాయిపడ్డ మొత్తం నుంచి ఎనిమిది వారాల్లో రూ.200 కోట్లను చెల్లించాలంటూ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. ఇందులో రూ.100 కోట్లను నాలుగు వారాల్లో, మిగిలిన రూ.100 కోట్లను ఆ తర్వాతి నాలుగు వారాల్లో చెల్లించాలని పేర్కొంది. ఈ వివరాలను న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి జమ చేయాల్సిన నిధులను సంస్థ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని నెలలుగా ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో ఆ సంఘం ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం వాదనలు జరిగాయని.. ఆర్టీసీ పక్షాన అడ్వొకేట్ జనరల్, సీసీఎస్ తరఫున తాను వాదనలు వినిపించినట్లు జయప్రకాశ్‌రావు వెల్లడించారు. వాదనలు తర్వాత.. నాలుగు వారాల్లో రూ.100 కోట్లు, మరో నాలుగు వారాల్లో మిగతా రూ.100 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను కేసును మానిటర్ చేస్తానని, ఆరు వారాల తర్వాత మళ్లీ పరిశీలిస్తానని, రూ.వంద కోట్లు చెల్లించిందీ.. లేనిదీ.. తెలుసుకుంటానని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారని ఆయన వివరించారు. -
బకాయిలు చెల్లిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ బకాయిల చెల్లింపులో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం కొన్ని బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సూచనతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల హరీశ్ సూచనల నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులతో చర్చించి బకాయిల వివరాలను తీసుకున్నారు. వీటిలో తక్షణం చెల్లించాల్సిన మొత్తాలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు.. తాజాగా మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లు భేటీ అయ్యారు. నోటీసులతో కదలిక ఆర్టీసీలో ఈ బకాయిల ప్రభావం 48 వేల కుటుంబాలపై ఉంది. ఇటీవల పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేయటం, రెండురోజుల క్రితం సహకార పరపతి సంఘం లీగల్ నోటీసు జారీ చేయటంతో ఆర్టీసీలో కదలిక వచ్చింది. కనీసం రూ.2 వేల కోట్లు అయినా విడుదల చేస్తే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుందని బాజిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఆయన సీఎంతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఇప్పుడు హరీశ్‌రావుతో చర్చల సందర్భంగా అదే విషయాన్ని వెల్లడించారు. పీఎఫ్ బకాయిలే రూ.1,300 కోట్లు కొన్నేళ్లుగా ఆర్టీసీలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా మారటంతో, జీతాలు తప్ప ఉద్యోగులకు ఇతర చెల్లింపులు దాదాపు నిలిచిపోయాయి. దీంతో వారికి దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ►ఆర్టీసీ ఉద్యోగులకు కీలకమైంది సహకార పరపతి సంఘం. ప్రతినెలా జీతం నుంచి మినహాయించే 7 శాతం మొత్తంతో ఏర్పడే నిధి నుంచి ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. ఈ నిధిని ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవటంతో ఇప్పుడు రుణాలు నిలిచిపోయాయి. అలాగే అందులోనే డిపాజిట్లు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా పింఛన్ తరహాలో అందే వడ్డీ కూడా నిలిచిపోయింది. ఎండీగా సజ్జనార్ వచ్చాక రూ.500 కోట్లు తిరిగి చెల్లించినా, ఇప్పటికీ రూ.850 కోట్ల బకాయిలున్నాయి. ►ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉండే పీఎఫ్ ట్రస్టు నుంచి కూడా నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రతినెలా పీఎఫ్ చెల్లింపులు కూడా సక్రమంగా లేవు. దానికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లకు పేరుకుపోయాయి. దీంతో పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ►ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక చేయూతనందించేందుకు ఉన్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం నిధులను కూడా ఆర్టీసీ వాడేసుకుంది. అలాగే ఎస్బీటీ నిధులు కూడా ఖాళీ చేసింది. దీని కాంట్రిబ్యూషన్ కింద జీతం నుంచి నెలవారీ కోత మాత్రం కొనసాగుతోంది. వీటి బకాయిలు రూ.400 కోట్లకుపైగా ఉన్నాయి. ►2013కు సంబంధించి 2015లో జరిగిన వేతన సవరణ బకాయిల్లో సగం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు ఉంది. ►ఆరు విడతలకు సంబంధించిన కరువు భత్యం (25 శాతం వరకు ) రూ.325 కోట్ల మేర పెండింగులో ఉంది. ►2019లో జూన్ నుంచి నవంబర్ వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు, గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన వారికి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పెండింగులో ఉంది. అవో రూ.20 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. -
Telangana: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మూడ్రోజుల క్రితం 5 శాతం కరువు భత్యాన్ని ప్రకటించిన సంస్థ త్వరలో మరో రెండు విడతల కరువు భత్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో రెండు దఫాలుగా డీఏ ప్రకటించేలా ఏర్పాట్లు ప్రారంభించింది. రెండు కలిపి దాదాపు 9 శాతం వరకు ఉంటుందని సమాచారం. ఈ మూడింటిని జోడిస్తే జూనియర్ డ్రైవర్, కండక్టర్ల వేతనాలకు నెలవారీ రూ.1,300 వరకు, సీనియర్లకు రూ.1,600 నుంచి రూ.2,000 వరకు, అధికారుల్లో స్థాయిని బట్టి రూ.3,800 నుంచి రూ.10 వేల వరకు పెరగనున్నాయి. అసంతృప్తి చల్లార్చేందుకు.. ఆర్టీసీ తమ ఉద్యోగులకు 6 విడతల డీఏ పెంపు బకాయి పడింది. సంస్థలో సమ్మె జరిగిన 2019లో జూలై విడత నుంచి డీఏ పెంపు నమోదవలేదు. అప్పటి నుంచి డీఏ 40.9 శాతం నిలిచిపోయి ఉంది. తాజాగా మూడ్రోజుల క్రితం అధికారికంగా ప్రకటన లేకుండా 5 శాతం డీఏ పెంచుతూ ఎండీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల డీఏ మొత్తం 45.9 శాతానికి చేరుకుంది. దీన్ని స్వాగతించినా బకాయిల ఊసు లేకపోవడం అసంతృప్తిని మిగిల్చింది. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరిగి నష్టాలు మరింత ఎక్కువైనందున ఆక్యుపెన్సీ రేషియోను 80 శాతం దాటించటం ద్వారా బ్రేక్ ఈవెన్‌కు చేర్చాలని ఎండీ వంద రోజుల ప్రణాళిక ప్రారంభించారు. ఇది విజయం సాధించేందుకు ఉద్యోగుల కృషి అవసరం. దీంతో వారిలో అసంతృప్తిని తగ్గించేందుకు డీఏ పెంచాలని భావిస్తున్నారు. -
మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన
-
మరో ముందడుగు
-
ఏపీఎస్ఆర్టీసీకి 229 కోట్ల ఆదాయం
-
ఏపీఎస్ ఆర్టీసీకి దసరా ధమాకా
సాక్షి, అమరావతి: దసరా సీజన్లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) భారీగా ఆదాయం ఆర్జించింది. ఈ సీజన్లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. గతఏడాది దసరా సీజన్ కంటే ఈసారి రూ.20 కోట్లు అధికంగా రావడం గమనార్హం. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండక్కి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) ఏకంగా 103 శాతంగా నమోదైంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు ఆదరణ మరింత పెరిగింది. మొత్తం పండగ సీజన్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ గణనీయమైన ఆదాయాన్ని రాబట్టింది. ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసి.. ప్రణాళికాబద్ధంగా సర్వీసులు నడపడంతో మంచి రాబడి లభించింది. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిరోజూ సాధారణంగా రూ.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 71 లక్షల మంది ప్రయాణిస్తారు. కలిసొచ్చిన టీఎస్ ఆర్టీసీ సమ్మె దసరా సీజన్ ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ చక్కగా వినియోగించుకుంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అన్ని రీజియన్ల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపారు. హైదరాబాద్‌లో ఈడీ స్థాయి అధికారిని అందుబాటులో ఉంచి, అక్కడి నుంచి రెగ్యులర్ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులను తిప్పారు. ప్రతిరోజూ దాదాపు 40 వేల మంది ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటారు. దసరా పండుగ సమయంలో ఈ సంఖ్య 75 వేలకు చేరింది. -
ఆర్టీసీ ఉద్యోగులపై చిన్నచూపు
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ కార్మికులు ఈ దేశ పౌరులు కాదా అని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులు ఓటుహక్కును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇతర ఉద్యోగుల మాదిరిగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడానికి అధికారులకు వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల విధులకు 480 మంది ఉద్యోగులు పశ్చిమ రీజియన్ పరిధిలో ఎన్నికల విధులు సంబంధించి ఈవీఎంలు, వీవీ పాట్లు, ప్రొసీడింగ్ అధికారులు, ఏపీఓలు తదితర సిబ్బందిని తరలించడానికి 400 బస్సులను రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు 400 ఆర్టీసీ బస్సులకు 400 మంది డ్రైవర్లు, ప్రతి 5 బస్సులకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున మొత్తం మీద 480 మందిని ఆర్టీసీ అధికారులు నియమించారు. ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు బుధవారం సాయంత్రం నుంచే తరలివెళ్లిపోవడంతో వారివారి సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసే హక్కును కోల్పోతున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర శాఖల ఉద్యోగులకు అధికారులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించగా ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఆ అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు హక్కు కోల్పోతున్న మరో 100 మంది కార్మికులు ఇదిలా ఉండగా కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న కార్మికులే కాక మరో 100 మంది కార్మికులు కూడా ఓటుహక్కును కోల్పోతున్నారు. ప్రతి నిత్యం జిల్లా నుంచి 32 బస్సులు హైదరాబాద్‌కు మరో 18 వరకూ బస్సులు విశాఖపట్నం, తిరుపతి, సింధనూరు, భద్రాచలం వంటి సుదూర ప్రాంతాలకు బస్సులు నడిపే డ్రైవర్లు, వారి సహాయకులు వారివారి విధుల్లో ఉండడం వల్ల వారు కూడా ఓటు హక్కుకు దూరమవుతున్నారు. ఇటువంటి విధుల్లో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించకపోవడంతో వారు తమ ప్రాథమిక హక్కును కోల్పోతున్నారు. అధికారుల వింత వాదన కాగా ఓటు హక్కు వినియోగంపై ఆర్టీసీ అధికారులు చెబుతున్న వినిపిస్తున్న వాదనలు వింతగా ఉన్నాయని ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బంది ఏదో ఒక ఖాళీ సమయంలో తమ ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణాత్మకంగా లేవంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు బస్సులను అక్కడే ఒదిలేసి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్లడం సాధ్యపడదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా బస్సులపై ప్రతాపం చూపే అవకాశం ఉంటుందని, అటువంటి సమయంలో సంబంధిత డ్రైవర్ బస్సు వద్ద లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అటువంటివి జరిగితే దానికి సంబంధిత డ్రైవరే బాధ్యత వహించాల్సి ఉన్నందున వారు బస్సును విడిచి వారికి ఓటు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఓటు వేసి వచ్చే వెసులుబాటు ఉండదంటున్నారు. ఉద్ధేశపూర్వకంగానే ప్రభుత్వ చర్య ఇటీవల జరిగిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చూసిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎక్కువమంది ఉద్యోగులు ఓటు వేసినట్లు అందిన ఇంటిలిజెన్స్ నివేదికల మేరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఓటు హక్కును దూరం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి చర్య తీసుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులు కూడా వైసీపీకే ఓటు వేసే అవకాశం ఉన్నందున వారికి ఓటు హక్కును దూరం చేయడానికే కుట్రపన్నిందంటున్నారు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం 2,242 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో ఉంటారు. వారిలో చాలా మంది ఎన్నికల సమయంలో విధుల్లో ఉండే అవకాశం ఉన్నందున వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. దేశంలోని ప్రతి పౌరుడుకి ప్రాథమిక హక్కైన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఇతర శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించి ఆర్టీసీ కార్మికులకు ఈ సౌకర్యం కల్పించకపోవడం వివక్షాపూరితంగా పరిగణించాలి. దీనిపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి. – ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు, ఎన్ఎంయూ రాష్ట్ర మాజీ చైర్మన్ -
ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ
మంచిర్యాలఅర్బన్ : ఈ నెల 11న ఆర్టీసీలో తలపెట్టిన సమ్మెపై కార్మిక సంఘాలు, యాజమాన్యం ఎవరి వ్యూహల్లో వారు నిమగ్నమయ్యారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూని యన్ సమ్మెకు పిలుపునివ్వగా జేఏసీ మద్దతునిచ్చిన సంగతి విదితమే. సమ్మెకు మూడు రోజు లు గడువు మిగిలి ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 7నుంచి టీఎంయూ, జేఏసీలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేస్తున్నాయి. ఒకవేళ సమ్మె జరిగితే చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. సమ్మె పిలుపు నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. మరోవైపు ఆయా డిపోలలో సమ్మెపై ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీయటం, కార్మిక సంఘాల నేతల ఫోన్‌నంబర్లు, ఇతరత్రా – మిగతా వివరాలు సేకరించారు. ఆర్టీసీలో చేపట్టే సమ్మెపై వ్యుహప్రతివ్యుహలు సాగుతుండటం చర్చానీయంశంగా మారింది. సమ్మె సక్సెస్‌కు.. ఆర్టీసీలో సమ్మె సక్సెస్‌కు కార్మిక సంఘాలు సన్నాహలు చేస్తున్నాయి. ఆదిలాబాద్ రీజినల్‌లోని ఆరు డిపోలలో 650 బస్సులుండగా 3000 మంది కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె జరిగితే ఒక్క బస్సును కూడా డిపోలోనుంచి కదలనివ్వకుండా వ్యూహలు రచిస్తున్నారు. గుర్తింపు సంఘం తలపెట్టిన సమ్మెకు జేఏసీ కూడా మద్దతు ప్రకటించటంతో విజయవంతానికి తలమునకలయ్యారు. మరోవైపు సూపర్వైజర్ అసోసియేషన్ సిబ్బంది కూడా ఒకటి రెండు రోజుల్లో సమ్మెకు అనుకూల ప్రకటన చేసే అవకాశం ఉందని కార్మిక సంఘాలు నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రెడ్బ్యాడ్జీలతో నిరసన, గేట్ ధర్నా, రీజినల్ కార్యాలయం ఎదుట నిరహరదీక్షలు చేపట్టారు. సమ్మె సన్నాహక సదస్సులు నిర్వహిస్తూ కార్మికులను సమాయత్త పరుస్తున్నారు. ముందస్తు చర్యల్లో యాజమాన్యం. ఆర్టీసీలో సమ్మె తప్పనిసరి అయితే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే ముందస్తు చర్యలపై యాజమాన్యం దృష్టి సారించింది. గురువారం ఆదిలాబాద్ రీజినల్‌లోని ఆయా డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యుహలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అద్దెబస్సులను నడపటంతో పాటు పైవేట్ సర్వీసులను వినియోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ల కొరత అధిగమించేందుకు పోలీస్, ఇతరశాఖల డ్రైవర్ల సహకారం పొందా లని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. పదోతరగతి ఉత్తీర్ణులైన వారిని తాత్కాలిక కండక్టర్లుగా విధుల్లోకి చేర్చుకోవాలనే నిర్ణయించినట్లు సమాచారం. ఇదంతా చేసిన సూపర్వైజర్ అసోసియేషన్ కూడా సమ్మెలోకి వెళ్లితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని బేరిజు వేసుకుంటున్నారు. ఇంటలిజెన్స్ ఆరా.. ఆర్టీసీలో 11న తలపెట్టిన సమ్మెపై ఆయా డిపో పరిధిలో ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. శుక్రవారం మంచిర్యాల డిపో పరి«ధిలో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఎంత మంది ఉన్నారు.. సంస్థ బస్సులు, అద్దెబస్సులు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు సేకరించారు. రోజుకు సమ్మె మూలంగా నష్టం ఎంత..? ఏయే కార్మిక సంఘాలు బలంగా ఉన్నాయనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘాల నేతల ఫోన్ నంబర్లు సేకరించటం చర్చానీయంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె వాయిదా వేసుకునే పరిస్థితి లేదని ఓ కార్మిక సంఘం నాయకుడు అభిప్రాయపడ్డాడు. -
జగన్ ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల హర్షం
సాక్షి, చిత్తూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 54వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం వైఎస్ జగన్‌ను ఆర్టీసీ కార్మికులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో కార్మికులకు భరోసా, భద్రత లభిస్తాయని ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 53వ రోజు శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండల కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ‘దేవుడి ఆశీర్వాదం, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తా’నని వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం 54వరోజు పాదయాత్రను గొడ్లవారిపల్లి శివారు నుంచి ప్రారంభించిన వైఎస్ జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు నీరాజనం పలికారు. పాదయాత్రలో జననేతను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. పీఆర్సీ బకాయిలు, రెండు డీఏలు చెల్లించలేదని తమ ఆవేదనను వ్యక్తం చేయగా వారికి భరోసాను కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు కదలారు. వైఎస్ జగన్‌ను స్థానిక సంస్థల ఎన్నికల ప్రతినిధులు కూడా కలిసారు. జన్మభూమి కమిటీలతో సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని తెలిపారు. జన్మభూమి కమిటీలను రద్దు చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బీడీ కార్మికులు సైతం జననేతతో సమావేశమయ్యారు. పాదయాత్ర కల్లూరు చేరిన అనంతరం వైఎస్ జగన్ మైనార్టీల ఆత్మీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. -
సమైక్యం సాధిస్తాం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యమం హోరెత్తుతోంది. సింహపురిలో 49వ రోజైన మంగళవారం సమైక్య పోరులో ఉద్యమకారులు, విద్యార్థులు సమై క్య రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రతినబూనారు. నగరంలో నీటిపారుదలశాఖ ఉద్యోగులు మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ హోంలో పశుసంవర్థకశాఖ ఉద్యోగులు నిరసనదీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ నుంచి బస్సులతో ర్యాలీ నిర్వహించారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థి, అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీవిగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో సమైక్యవాదులు కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. ముత్తకూరులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసనదీక్షలు సాగుతున్నాయి. ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యాలయాలు, ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. ఉద్యమ కార్యాచరణపై ఎన్జీఓ హోంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలో విధులు నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ ఉద్యోగులపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. కంప్యూటర్లను ఆపేసి ఉద్యోగులను బయటకు పంపారు.నెల్లూరు స్వర్ణాల చెరువులో నగర, రూరల్ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర జెండా ఆవిష్కరించి జలాభిషేకం నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 20వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. ఐకేపీ మహిళలు దీక్షలో కూర్చొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్లో 30వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. సీతారాంపురంలో 20వ రోజు ఉపాధ్యాయ రిలే దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో తెలంగాణ ఉపాధ్యాయునికి సన్మానం చేశారు. కలిగిరిలో బుధవారం నిర్వహించనున్న మహిళా గర్జనపై ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించడంతో సీమాంధ్రలో ప్రతి గుండె మండుతోందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో నిర్వహిస్తున్న రిలే దీక్షలకు ఎల్లసిరి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ సంఘీభావం తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టవర్‌క్లాక్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి అక్కడే ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు దీక్షకు దిగారు. దీక్షా శిబిరాన్ని గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు సందర్శించి సంఘీభావం తెలిపారు.కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయిబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం కోట క్రాస్‌రోడ్డు వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వాకాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ నాయకులు ముట్టడించి తరగతులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యానాది, జేఏసీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంటలో కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. పొదలకూరులో మంగళవారం రెడీమేడ్ వస్త్ర దుకాణదారులు, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ నుంచి ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మంగళవారం నాల్గోరోజు పాదయాత్ర ప్రారంభించారు. నాలుగు గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర పేడూరులో ముగిసింది. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం వెంకటగిరిలో సమైక్య గర్జన నిర్వహిస్తున్నట్టు పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య పోరు ఉధృతంగా సాగుతోంది. రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరాయి. తడలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. వీఆర్వోలు దీక్షలో కూర్చుని నిరసన పాటించారు. వీరికి సంఘీభావంగా ఐటీఐ విద్యార్థులు బజారు సెంటర్లో మానవహారం నిర్వహించారు. నాయుడుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహాదీక్షలు కొనసాగుతున్నాయి.