ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట రిలేనిరాహార దీక్షల్లో పాల్గొన్న టీఎంయూ నాయకులు
మంచిర్యాలఅర్బన్ : ఈ నెల 11న ఆర్టీసీలో తలపెట్టిన సమ్మెపై కార్మిక సంఘాలు, యాజమాన్యం ఎవరి వ్యూహల్లో వారు నిమగ్నమయ్యారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూని యన్ సమ్మెకు పిలుపునివ్వగా జేఏసీ మద్దతునిచ్చిన సంగతి విదితమే. సమ్మెకు మూడు రోజు లు గడువు మిగిలి ఉండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 7నుంచి టీఎంయూ, జేఏసీలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేస్తున్నాయి.
ఒకవేళ సమ్మె జరిగితే చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. సమ్మె పిలుపు నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. మరోవైపు ఆయా డిపోలలో సమ్మెపై ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీయటం, కార్మిక సంఘాల నేతల ఫోన్‌నంబర్లు, ఇతరత్రా – మిగతా
వివరాలు సేకరించారు. ఆర్టీసీలో చేపట్టే సమ్మెపై వ్యుహప్రతివ్యుహలు సాగుతుండటం చర్చానీయంశంగా మారింది.
సమ్మె సక్సెస్‌కు..
ఆర్టీసీలో సమ్మె సక్సెస్‌కు కార్మిక సంఘాలు సన్నాహలు చేస్తున్నాయి. ఆదిలాబాద్ రీజినల్‌లోని ఆరు డిపోలలో 650 బస్సులుండగా 3000 మంది కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె జరిగితే ఒక్క బస్సును కూడా డిపోలోనుంచి కదలనివ్వకుండా వ్యూహలు రచిస్తున్నారు. గుర్తింపు సంఘం తలపెట్టిన సమ్మెకు జేఏసీ కూడా మద్దతు ప్రకటించటంతో విజయవంతానికి తలమునకలయ్యారు. మరోవైపు సూపర్‌వైజర్ అసోసియేషన్ సిబ్బంది కూడా ఒకటి రెండు రోజుల్లో సమ్మెకు అనుకూల ప్రకటన చేసే అవకాశం ఉందని కార్మిక సంఘాలు నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రెడ్‌బ్యాడ్జీలతో నిరసన, గేట్ ధర్నా, రీజినల్ కార్యాలయం ఎదుట నిరహరదీక్షలు చేపట్టారు. సమ్మె సన్నాహక సదస్సులు నిర్వహిస్తూ కార్మికులను సమాయత్త పరుస్తున్నారు.
ముందస్తు చర్యల్లో యాజమాన్యం.
ఆర్టీసీలో సమ్మె తప్పనిసరి అయితే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే ముందస్తు చర్యలపై యాజమాన్యం దృష్టి సారించింది. గురువారం ఆదిలాబాద్ రీజినల్‌లోని ఆయా డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యుహలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అద్దెబస్సులను నడపటంతో పాటు పైవేట్ సర్వీసులను వినియోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ల కొరత అధిగమించేందుకు పోలీస్, ఇతరశాఖల డ్రైవర్ల సహకారం పొందా లని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. పదోతరగతి ఉత్తీర్ణులైన వారిని తాత్కాలిక కండక్టర్లుగా విధుల్లోకి చేర్చుకోవాలనే నిర్ణయించినట్లు సమాచారం. ఇదంతా చేసిన సూపర్‌వైజర్ అసోసియేషన్ కూడా సమ్మెలోకి వెళ్లితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని బేరిజు వేసుకుంటున్నారు.
ఇంటలిజెన్స్ ఆరా..
ఆర్టీసీలో 11న తలపెట్టిన సమ్మెపై ఆయా డిపో పరిధిలో ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. శుక్రవారం మంచిర్యాల డిపో పరి«ధిలో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఎంత మంది ఉన్నారు.. సంస్థ బస్సులు, అద్దెబస్సులు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు సేకరించారు. రోజుకు సమ్మె మూలంగా నష్టం ఎంత..? ఏయే కార్మిక సంఘాలు బలంగా ఉన్నాయనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘాల నేతల ఫోన్ నంబర్లు సేకరించటం చర్చానీయంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె వాయిదా వేసుకునే పరిస్థితి లేదని ఓ కార్మిక సంఘం నాయకుడు అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment