సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మూడ్రోజుల క్రితం 5 శాతం కరువు భత్యాన్ని ప్రకటించిన సంస్థ త్వరలో మరో రెండు విడతల కరువు భత్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో రెండు దఫాలుగా డీఏ ప్రకటించేలా ఏర్పాట్లు ప్రారంభించింది. రెండు కలిపి దాదాపు 9 శాతం వరకు ఉంటుందని సమాచారం. ఈ మూడింటిని జోడిస్తే జూనియర్ డ్రైవర్, కండక్టర్ల వేతనాలకు నెలవారీ రూ.1,300 వరకు, సీనియర్లకు రూ.1,600 నుంచి రూ.2,000 వరకు, అధికారుల్లో స్థాయిని బట్టి రూ.3,800 నుంచి రూ.10 వేల వరకు పెరగనున్నాయి.
అసంతృప్తి చల్లార్చేందుకు..
ఆర్టీసీ తమ ఉద్యోగులకు 6 విడతల డీఏ పెంపు బకాయి పడింది. సంస్థలో సమ్మె జరిగిన 2019లో జూలై విడత నుంచి డీఏ పెంపు నమోదవలేదు. అప్పటి నుంచి డీఏ 40.9 శాతం నిలిచిపోయి ఉంది. తాజాగా మూడ్రోజుల క్రితం అధికారికంగా ప్రకటన లేకుండా 5 శాతం డీఏ పెంచుతూ ఎండీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల డీఏ మొత్తం 45.9 శాతానికి చేరుకుంది.
దీన్ని స్వాగతించినా బకాయిల ఊసు లేకపోవడం అసంతృప్తిని మిగిల్చింది. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరిగి నష్టాలు మరింత ఎక్కువైనందున ఆక్యుపెన్సీ రేషియోను 80 శాతం దాటించటం ద్వారా బ్రేక్ ఈవెన్‌కు చేర్చాలని ఎండీ వంద రోజుల ప్రణాళిక ప్రారంభించారు. ఇది విజయం సాధించేందుకు ఉద్యోగుల కృషి అవసరం. దీంతో వారిలో అసంతృప్తిని తగ్గించేందుకు డీఏ పెంచాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment