
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువుభత్యం బకాయిల్లో ఒకదాన్ని చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆరు విడతల డీఏ బకాయి ఉండగా, అందులో ఒక విడత 5.4 శాతం డీఏను చెల్లించనున్నట్టు ప్రకటించింది. దీంతో 45.9 శాతంగా ఉన్న కరువు భత్యం 51.6 శాతానికి పెరిగింది. ఈనెల జీతంతో దీన్ని చెల్లించనున్నారు. 2013 వేతన సవరణకు సంబంధించిన మూలవేతనంపై లెక్కించి ఇవ్వనున్నారు.
ఇంకా ఐదు విడతల డీఏ చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం చెల్లించడం లేదు. ఒక విడత డీఏ ప్రకటించటం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎరియర్స్ లేకుండా కేవలం డీఏ చెల్లించటం సరికాదని సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. డీజిల్ సెస్ పెంచిన తర్వాత నష్టాలు రూ.641 కోట్ల మేర తగ్గాయని ప్రకటించిన తర్వాత కూడా ఎరియర్స్ ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇప్పుడు ప్రకటించిన డీఏ ఏ విడతదో కూడా తెలపకపోవటం వెనక ఎరియర్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశం ఉన్నట్టు స్పష్టమవుతోందని టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment