సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న మరో విడత కరువు భత్యం మంజూరైంది. గత నెలలో రెండు విడతల పెండింగ్ డీఏ మంజూరు కాగా, ఇప్పుడు మరో విడతగా 3.9 శాతం కరువు భత్యాన్ని ఆర్టీసీ మంజూరు చేసింది. దీన్ని బుధవారం చెల్లించనున్నారు. ఈ డీఏను మంగళవారమే మంజూరు చేసినందున, నెల జీతంలో దా న్ని కలిపేందుకు ఒక రోజు సమయం పట్టనుంది. ఇందుకోసం ఈనెల జీతాలు ఒకటో తేదీన కాకుండా 2న చెల్లించనున్నారు.
ప్రస్తుతానికి కరువు భత్యంతో సరి..
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘకాలం పెండింగులో ఉన్న బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య పేరుతో కార్మిక సంఘాలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగటంతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆ సమాఖ్య నేతలను పిలిపించి చర్చించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం ఓ డీఏను ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో రెండు విడతల డీఏ ఇవ్వగా ఇప్పుడు మూడో విడత ఇవ్వటంతో మొత్తం డీఏ 63.9 శాతానికి చేరింది. దీంతోపాటు 2019 జనవరికి చెందిన డీఏ ను ఆలస్యంగా విడుదల చేసినందున దాని తాలూకు ఎరియర్స్‌ను కూడా ఈనెల జీతంతో ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక దసరా పండగ అడ్వాన్సును కూడా చెల్లించనున్నారు.ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన రెండు విడతల డీఏలు మాత్రమే పెండింగులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment