కొత్తగా ప్రారంభించిన బస్సులో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): ప్రయాణికుల ఆదరణతో టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థికంగా పటిష్టంగా తయారవుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ప్రయాణికుల వల్లే ప్రగతిరథ చక్రం పరుగులు పెడుతోందని, 2022లో ప్రయాణిక దేవుళ్లు టీఎస్‌ఆర్టీసీని ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించారని పేర్కొ న్నారు. బుధవారం కూకట్‌పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీలోని బస్‌స్టాప్‌లో కొత్త స్లీపర్, స్లీపర్ కమ్ సీట్ బస్సులను ఎండీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొ న్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడారు. గత 15 రోజుల క్రితం సూపర్ డీలక్స్ బస్సులను ప్రారంభించామని, ఈ నెలాఖరులో కొత్త ఏసీ బస్సులను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్లీపర్ బస్సులు హైదరాబాద్–విజయవాడ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.
సీఎం సహకారంతో ఆర్టీసీ అభివృద్ధి: బాజిరెడ్డి
ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సంస్థలోని 50 వేల మంది ఉద్యోగుల కృషి వల్లే రోజు రోజుకూ రెవెన్యూ మెరుగుపడుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment