ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్‌టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్‌లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు.
ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp
— Telangana Congress (@INCTelangana) December 30, 2023
రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది.
లీజుకు ఆర్టీసీ భూములు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్‌ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment