
సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9 వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది.
ఇంత విస్తృత నెట్‌వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యుషన్ (CIS)పై మొగ్గు చూపి వాటి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్ బస్ భవన్‌లో మంగళవారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు.
“సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చాం. CIS ప్రాజెక్ట్ సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతోంది. కేంద్రీకృత సమగ్రమైన డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుంది.
అంతేకాకుండా ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్‌లు, వర్క్‌షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్ వంటి కార్యకలాపాల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తోంది. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీఎస్ ఆర్టీసీ మొదటిది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్ వర్క్‌ను అప్ గ్రేడ్ చేశాం అని సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ అన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత సామార్థాన్ని మెరుగుపరచాలనే ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సమర్థవంతమైన ఈ వ్యవస్థ సంస్థ అభివృద్ధికి దోహద పడగలదని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మెరుగైన నాణ్యమైన సేవల్ని అందించేందుకు టీఎస్ ఆర్టీసీతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని నల్సాఫ్ట్ సీఈఓ నల్లూరి వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు. సమష్టి కృషి, అంకితభావంతో పని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయగలిగామని చెప్పారు. ఆధునీక సాంకేతితను అందిపుచ్చుకోవడంలో టీఎస్ ఆర్టీసీ ముందంజలో ఉందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్ త్రినాథ్ బాబు మాట్లాడుతూ, రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు. సీఐఎస్ ప్రాజెక్టు ద్వారా కార్యకలాపాల నిర్వహణ మరింత సౌలభ్యంగా మారే అవకాశం ఉందన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ టీఎస్ ఆర్టీసీ పురోగమించడం శుభపరిణామన్నారు.
సీఓఓ డాక్టర్ వి రవీందర్, ఐటి కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పివి ముని శేఖర్, ఎస్ కృష్ణకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఎ. పురోషోత్తం, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప, చీఫ్ ఇంజనీర్ (IT) ఎం. రాజ శేఖర్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment