
సిద్దిపేట, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment