తెలంగాణలోనూ వైఎస్సార్‌సీపీ ఉంటుంది: బాజిరెడ్డి గోవర్ధన్
బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టీకరణ
చంద్రబాబు మూడుసార్లు తెలంగాణను మోసం చేశారు
విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చానంటూనే సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకున్నానంటున్నారు
ఇరుప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే సమైక్యంగా
ఉంచమనే వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతోంది
వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అనేక వైఖరులు అవలంభించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉండగా లేనిది తమ పార్టీ ఎందుకుండదని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేసిన నాయకుడని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ ప్రాంతమే అత్యధికంగా లబ్ది పొందిందని తెలిపారు. అలాంటి నాయకుడి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కచ్చితంగా ఉంటుందని చె ప్పారు. వైఎస్‌ను అదరించిన వ్యక్తులు, అభిమానులు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు.
వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసినా, ఈ విషయమై రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా సహించేది లేదని బాజిరెడ్డి హెచ్చరించారు. పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్‌రావు, బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావులతో కలసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల విషయంలో తమ పార్టీ మొదటినుంచీ ఒకే వైఖరి అవలంభిస్తున్న విషయం బాజిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనిపక్షంలో సమైక్యంగా ఉంచమని చెబుతోందే తప్ప ఇతర పార్టీల మాదిరిగా ప్రాంతాల వారీగా వైఖరులను అవలంభిస్తూ ప్రజలను గందరగోళ పరచడంలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన విషయం ఆయన గుర్తుచేశారు. న్యాయంగా వ్యవహరిస్తున్న పార్టీపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరమేంటో టీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ, బీజేపీ ఉండగాలేనిది వైఎస్సార్‌సీపీ ఎందుకుండదు?
‘తెలంగాణ ప్రాంతాన్ని మూడుసార్లు మోసం చేసిన చంద్రబాబు ఒకపక్క విభజనకు లేఖ ఇచ్చానని చెబుతూనే.. మరోపక్క సీమాంధ్రలో యాత్ర చేస్తూ తెలంగాణను అడ్డుకున్నది తానే అని చెబుతున్నారు. అలాంటి టీడీపీ, ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసగించిన బీజేపీ రెండు ప్రాంతాల్లో ఉండగాలేనిది, వైఎస్సార్‌సీపీ ఎందుకు ఉండదు?’ అని బాజిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెబుతున్న టీఆర్‌ఎస్ నేతలు...సీమాంధ్రలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎందుకు ఎండగట్టడం లేద ని ఆయన నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర నేతలను ఎందుకు బహిష్కరించ డంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ నేతలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.